ఆనం మాస్టర్‌ప్లాన్ | Anam Masterplan | Sakshi
Sakshi News home page

ఆనం మాస్టర్‌ప్లాన్

Published Sun, Nov 30 2014 1:58 AM | Last Updated on Mon, Oct 29 2018 8:29 PM

Anam Masterplan

సాక్షి: ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరానికి సంబంధించి తాజా మాస్టర్‌ప్లాన్‌పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభ్యంతరాలతో అందులోని లొసుగులు వెలుగుచూస్తున్నాయి. మొన్నటి వరకు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దశాబ్దానికి పైగా రాజకీయం చేసిన ఆనం కుటుంబం ఈ వ్యవహరం వెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లోని లొసుగులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బయటపెట్టడంతో ఆనం వర్గీయులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉండదంటూ తాజా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గళం విప్పడం ఇందుకు నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా తమ హయాంలో నగరంలో ఎక్కడా రోడ్ల విస్తరణ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2008లో ప్రారంభమైన తాజా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కసరత్తు 2011కు పూర్తయింది. ఆ ఏడాదిలోనే అప్పటి మేయర్ భానుశ్రీ అధ్యక్షతన కౌన్సిల్ ఆమోదం పొందింది.

2013లో ఈ మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. ఇదంతా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగానూ, ఆయన సోదరుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖ మంత్రిగానూ వ్యవహరించినప్పుడు జరిగింది. అప్పట్లో ప్రైవేటు ఏజెన్సీ మాస్టర్‌ప్లాన్ పూర్తి చేసి కౌన్సిల్‌కు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి కీలక పరిణామాలు కింగ్‌మేకర్లగా వ్యవహరించిన ఆనం సోదరులకు తెలియవనుకుంటే పొరబాటే.

ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయాల్సి వస్తే వ్యాపారులకు, పలు ప్రార్థనా మందిరాలకు నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గొంతు చించుకుంటున్నారు. అప్పట్లో ఆయన దీనిపై ఎందుకు స్పందించలేదనేది ఆయనకే తెలియాలి. వారి హయాంలోనే స్టౌన్‌హౌస్‌పేట, వాకర్స్‌రోడ్డు, జీఎన్‌టీ రోడ్డు, రైల్వేఫీడర్స్‌రోడ్డు వంటి ప్రధాన రోడ్ల విస్తరణ జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజా మాస్టర్‌ప్లాన్ అమలునుద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కొండాయపాళెం రోడ్డు వెడల్పు తగ్గడంలో మతలబు
1978 తరువాత 2011 సంవత్సరంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని చోట్ల రోడ్ల విస్తీర్ణం తగ్గడంలో ఆనం ప్రమేయం ఉన్నట్లు బహిరంగంగానే విమర్శలున్నాయి. కొండాయపాళెం మార్గంలో 60 అడుగుల రోడ్డును తాజా మాస్టర్‌ప్లాన్‌లో 40 అడుగులకు తగ్గించడం వెనుక సొంత మనుషులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలున్నాయి.

ఆ ప్రాంతంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత భూములున్నాయి. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో రోడ్ల విస్తీర్ణాన్ని పెంచడానికి బదులు తగ్గించాడని చెబుతున్నారు. మాగుంట లేఅవుట్ సమీపంలో రైల్వే లైన్‌కు పడమర వైపు మాజీ మేయర్‌కు సంబంధించిన బినామీల ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం.

అదేవిధంగా జాతీయ రహదారి నుంచి అయ్యప్పగుడి వరకు 200 అడుగులు, అక్కడి నుంచి శబరిక్షేత్రం వరకు 150 అడుగులు, అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు 100 అడుగులు విస్తరించాలన్న నిర్ణయం కూడా అప్పట్లోనే జరిగింది. తమ కనుసన్నల్లో జరిగిన మాస్టర్‌ప్లాన్‌ను ఆనం ఇప్పుడు వ్యతిరేకించడం హాస్యాస్పదమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement