
ఇదే యాదాద్రి..
డిజైన్లు, నమూనాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర
దసరా నుంచి పనులు ప్రారంభించండి
పాత దాతల పేర్లతోనే కొత్త భవనాలు
చుట్టూ ఉన్న గుట్టల వద్ద మౌలిక సదుపాయాల కల్పన
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయం, శివాలయం, గుట్టపై ఇతర నిర్మాణాలు, చుట్టూ ఇతర గుట్టల అభివృద్ధి కోసం రూపొందించిన లేఅవుట్లను బుధవారం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి ఆమోదించారు. లేఅవుట్లు, డిజైన్లు సిద్ధమైనందున దసరా నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే దసరా నాటికి ఓ రూపం తీసుకురావాలని సూచించారు. దీంతోపాటు ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) ఉపాధ్యక్షుడు కిషన్‌రావు నేతృత్వంలో పనులు జరగాలని... ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. అనుమతులు తదితర విషయాలన్నీ వైటీడీఏ చూసుకుంటుందన్నారు.
ప్రధాన గుట్ట యాదాద్రితో పాటు చుట్టూ ఉన్న గుట్టలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు రూ.200 కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. పాత భవనాలు, కాటేజీలు కూల్చివేసే సందర్భంలో పాత దాతల పేర్లతోనే కొత్త డిజైన్ల ప్రకారం సత్రాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కిషన్‌రావుతో పాటు నిర్మాణ నిపుణులు రాజు ఎక్స్ పిడిత్, పి.జగన్‌మోహన్, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద సాయి, స్తపతి సౌందర్ రాజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం ఆమోదించిన డిజైన్ల ప్రకారం
గుట్టపైన గర్భగుడి యథావిధిగా ఉంటుంది. గుట్టపైకి వెళ్లేందుకు, కిందికి వచ్చేందుకు వేర్వే రు దారులు ఉంటాయి. ప్రస్తుతమున్న దారిని వెళ్లేందుకు ఉపయోగించి.. కిందికి వచ్చేందుకు కొత్త మార్గాన్ని నిర్మిస్తారు. గుట్టపైన 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఉంటుంది. బస్సులు అక్కడే భక్తులను దింపి.. కిందికి వెళ్లే భక్తులను ఎక్కించుకుంటాయి. వీఐపీలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 2.3 ఎకరాలు ఉంటుంది. శివాలయానికి కూడా మాడ వీధులు నిర్మిస్తారు.
ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణ అభిముఖంగా 108 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ నిర్మిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిపేందుకు గుట్టపైనే తూర్పు భాగంలో ప్ర త్యేక స్థలం ఉంటుంది. అర్చకులు సేద తీరేం దుకు, వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్స్‌గా మారుస్తారు. దైవ సంబంధ వస్తువులకు గుట్టపైనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. గుట్టపై ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగిస్తారు. కొత్త లే అవుట్ ప్రకారమే నిర్మాణాలు ఉంటాయి. ధర్మ గుండాన్ని యథావిధిగా ఉంచి విస్తీర్ణం పెంచుతారు.