అక్రమాలకు చెక్ | Check to illegality | Sakshi
Sakshi News home page

అక్రమాలకు చెక్

Published Thu, May 7 2015 2:21 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

అక్రమాలకు చెక్ - Sakshi

అక్రమాలకు చెక్

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల్లో అంతులేని అవినీతి
పటిష్ట ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో అడ్డుకట్ట వేస్తాం
‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్

 
సిటీబ్యూరో:  ‘ఇప్పుడున్న హైదరాబాద్ ఎటు పడితే అటు పెరిగింది. దాన్ని సరిచేస్తాం.  శాస్త్రీయంగా ఆలోచించి  మాస్టర్‌ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎండీయే, జీహెచ్‌ఎంసీల్లో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. ఇకపై అలా జరగకుండా అక్రమాలకు ముకుతాడు వేయాల్సిందేనన్నారు. ఇకపై పటిష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉంటుందన్నారు. మాస్టర్‌ప్లాన్ కనుగుణంగా పద్ధతి ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్రమార్కులకు కళ్లెం వేసి సిటీని అందంగా తీర్చిదిద్దుదామన్నారు. రియోడిజెనీరో నగరాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తారని, మనం కూడా స్వచ్ఛ హైదరాబాద్‌ను నిర్మించుకుందామన్నారు. బలహీనవర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలనే తలంపుతోనే డబుల్‌బెడ్‌రూమ్ ఆలోచన చేశానన్నారు. ఐడీహెచ్‌కాలనీలో  ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల అక్కడకు వెళ్లాను.ఒక్కో ఇంటికి ఐదారు లక్షలు ఖర్చు చేస్తున్నాం. కానీ..  అక్కడి ప్రజల కళ్లలో కోటి మెరుపులు చూశానన్నారు. ఒకసారి ఇల్లు నిర్మిస్తే రెండు మూడు తరాల వారి వరకు ఇళ్ల అవసరం తీరాలని చెప్పారు. నగరంలోని రెండు లక్షల మందికి దశలవారీగా మూడు నాలుగేళ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. స్లమ్‌ఫ్రీని అమలు చేస్తామన్నారు.  కొన్ని రహదారులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు.

 ‘స్వచ్ఛ హైదరాబాద్’ అమలు విధానం తదితర అంశాల గురించి
 కేసీఆర్ ఇలా వివరించారు...


 300 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌నగర ప్రత్యేకతను నిలబెట్టాలి.  స్వచ్ఛ  హైదరాబాద్ లో సైనికాధికారులు, సైనికులు, పోలీసు అధికారులు, పోలీసులు పాల్గొంటారు.  నగరంలోని ప్రతి ఇంటికి రెండు చెత్తడబ్బాలను ప్రభుత్వమే అందజేస్తుంది. తడి, పొడి చెత్తలకు వాటిని వేర్వేరుగా వినియోగించాలి.   బస్తీవాసులు, టీమ్ సభ్యులకు టీషర్టులు, టోపీల పంపిణీ  త్వరలోనే పత్రికలు, ఛానళ్ల ప్రతినిధులతో సమావేశమై విస్తృత ప్రచారం చేయాల్సిందిగా కోరతాం.  కార్యక్రమంలో భాగస్వాములైన ఆరువేల మంది ఛేంజ్ ఏజెంట్స్ నెంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు సమాచార పంపిణీ.   స్వచ్ఛ హైదరాబాద్‌కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లోనూ సమాచార పంపిణీ   బృందాలు బస్తీలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ సహాయం అవసరమైన విద్యార్థులు, క్రీడాకారులు, రోగగ్రస్తులను గుర్తించాలి. పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందని అర్హులుంటే గుర్తించాలి. వారి వివరాలు సేకరించాలి. ఇళ్లులేని పేదలను గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచాలి. బస్తీల్లోని సంపన్నులను  ప్రోత్సహించి వారి ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి.   

 చెరువుల్లో మురుగునీరు కలిసే ప్రాంతాలు గుర్తించాలి.   ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న అందరితో స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు.  స్వచ్ఛభారత్‌లో పాల్గొనే బృందాలు.. వాటి పనితీరు తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ప్రజలు కూడా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములయ్యేందుకు ముందుకురావడంతో బృందాలు 425కు పెరిగాయన్నారు.  సమరమర్థ నీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక టాయ్‌లెట్లు తదితర అంశాలపై అస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
 
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరు

‘స్వచ్ఛ హైదరాబాద్’ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మొత్తం మంత్రివర్గం, శాసనమండలి స్పీకర్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి రాజీవ్‌శర్మలతో సహ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరైంది. పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఏఐఎస్‌లు, హెచ్‌ఓడీలతో సహ వెయ్యిమందికి పైగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అమలుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ 25 స్లైడ్స్‌తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని ఆసక్తిగా తిల కించిన కేసీఆర్ మధ్యలో కల్పించుకుంటూ సభికులకు మరింత వివరణ ఇచ్చారు.
 
దేశంలోనే ప్రథమం: రాజీవ్‌శర్మ

నగరంలో ప్రారంభిస్తున్న స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ లాంటి కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రంలో, ఏనగరంలో ఇంతవరకు చేపట్టలేదని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ఉద్యమరూపంలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, మంత్రులు , ఏఐఎస్ అధికారులు ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను స్వీకరించి నూరు శాతం పరిశుభ్రతకు కృషి చేయడం గతంలో ఎక్కడా జరగలేదన్నారు.  40 వేల మంది అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో  భాగస్వాములవుతున్నారన్నారు. అస్కి డెరైక్టర్ జనరల్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ  వేస్ట్‌మేనేజ్‌మెంట్‌పై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement