‘ గ్రేటర్’ లక్ష్యంగా స్వచ్ఛ హైదరాబాద్!
జంటనగరాల్లో అధికార పార్టీ నేతల హడావుడి
స్వయంగా కాలనీలు తిరిగిన సీఎం కేసీఆర్
వాడలను చుట్టివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో, అధికార పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా బస్తీలు తిరగడం.. వాడల్లో ప్రజల తో మమేకం కావడం... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంటనగరాలను చుట్టి రావడం.. చర్చనీయాంశమైంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పేరిట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పీఠమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మక అడుగులు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో ప్రజలను నేరుగా కలవడం, వారి సమస్యలను వినడం, తాత్కాలికమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సి పనులకు హామీలు ఇవ్వడం కోసం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఉపయోగపడిందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.
ఎంఐఎం పట్టున్న పాతబస్తీతోపాటు విపక్ష టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధుల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అయిదు రోజులపాటు ఉద్యమంగా జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పరిశీలించిన వర్గాలు ఇది కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా చేపట్టిందేనని వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం అయిదు రోజుల్లో సుమారు 7 లక్షల మంది ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా క లుసుకోగలిగామని జీహెచ్‌ఎంసీ అధికారికంగానే ప్రకటించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి రోడ్ల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, గ్రంథాలయాలు, జిమ్‌ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలకు కూడా అందాయి. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఏకంగా ఐదు వందల బృందాలను రంగంలోకి దింపారు. నగర ప్రజల ముంగిట్లోకి వెళ్లి, వారిని నేరుగా కలిసి మాట్లాడారు. ప్రధానంగా నగరంలోని వివిధ బస్తీ వాసుల్లో విశ్వాసం నింపేలా వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ వరసగా రెండు రోజుల పాటు హామీలు ఇచ్చారు. యూనివర్సిటీ జాగాల్లో పక్కా ఇళ్ళు కట్టిస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధానంగా తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికార పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. పాతబస్తీలో ఎంఐఎం నేతల నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన కార్యక్రమం కావడంతో నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అనివార్యంగా పాల్గొనడమే కాకుండా, ఎలాంటి విమర్శలు చే యలేకపోయారు. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.