తాడికొండ: రాజధాని ప్రాంతంలోని రైతుకూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తరతరాల నుంచి రైతును నమ్ముకొని ఆయా భూముల్లో వ్యవసాయ కూలి చేసుకుంటూ రోజుకు సగటున రూ.400 ఆదాయంతో కుటుంబాన్ని దిద్దుకుంటున్న కూలీలకు మరో నెల రోజుల్లో వ్యవసాయ పనులు కనుమరుగుకానున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 30 లోగా భూములు ఖాళీ చేస్తే చదును చేసి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో వ్యవసాయ కూలీల్లో ఆందోళన, భయం ఏర్పడ్డాయి. కూలి పనులు తప్ప మరో పని తెలియని తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఏ విషయమైనా రైతులకు సంబంధించే మాట్లాడుతున్నారు కానీ రైతు కూలీలు, ఇతర వృత్తులవారి గురించిన ప్రస్తావనే రావటం లేదు. దీంతో తమ బతుకులు ఎలా సాగుతాయోనని బెంబేలెత్తుతున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మొత్తం 45 వేల మంది వ్యవసాయ కూలీలు, ఇతర వృత్తులవారు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే జనవరిలో ప్రభుత్వం సర్వేచేసి మొత్తం 12 వేలమందిని మాత్రమే కూలీల జాబితాలో చేర్చింది. వీరికి నెలకు రూ.2,500 పింఛను కల్పించి, నైపుణ్యం ప్రకారం ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రణాళిక ప్రారంభం కాలేదు. ఈ విషయమై కూలీల పక్షాన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు బహిర్గతం కాలేదు. భూములు చదును చేస్తే వలసబాట పట్టే పరిస్థితి ఏర్పడుతుందని, కూలి పని తప్ప మరి ఏ ఇతర వృత్తి నైపుణ్యం తెలియని అధికసంఖ్యలో కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తరతరాలుగా సొంత గ్రామాల్లో ఉంటూ వలసబాట పట్టాల్సివస్తుందా! అని కంటిపై కునుకులేకుండా భయాందోళన చెందుతున్నారు. కూలీల బతుకులపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కూలీల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయకూలీల భవితకు భరోసా ఇచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించి వారి ఉపాధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఉపాధి ఉత్తి మాటేనా?
Published Mon, Mar 9 2015 2:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement