‘తిరుమల స్థానికులు శ్రీవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యులు...
- టీటీడీపై నారాయణ ధ్వజం పాత అన్నదానం
- కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్
సాక్షి, తిరుమల: ‘తిరుమల స్థానికులు శ్రీవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యులు. పెరిగిన భక్తుల సౌకర్యాల కోసం మాస్టర్‌ప్లాన్‌కు సంపూర్ణంగా సహకరించారు. అలాంటి స్థానికులనే టీటీడీ నమ్మించి మోసం చేసింది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తిరుమలలోని దుకాణాలు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ బాటలో నడిచే సీపీఐ కూడా భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు టీటీడీకి మద్దతు తెలిపిందన్నారు.
అందువల్ల స్థానికులకు పునరావాసం కింద బాలాజీనగర్ కట్టిం చి కేటాయించారన్నారు. అయితే, మరమ్మతు చేయిస్తామని ఖాళీ చేసిన బాలాజీనగర్ ఇళ్లను తిరిగి కేటాయించ కుండా టీటీడీ అధికారులు మోసం చేయడం దారుణమన్నారు. బాలాజీనగర్‌లో ఇళ్ల ల్లో ఉన్నవారందరూ స్థానికులేనని ఆయ న స్పష్టం చేశారు. 1985 ఏప్రిల్ 6వ తేది అప్పటి సీఎం ఎన్‌టీ రామారావు ప్రారంభించిన అన్నదాన భవనాన్ని నిరుపయోగంగా వదిలివేయడం తగదన్నారు. సెక్యూరిటీ పేరుతో ఆ భవనాన్ని ఖాళీగా ఉంచడం వల్ల భక్తులు రాకపోవడంతో ఆ ప్రాంతంలో దుకాణదారుల వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయన్నారు.
తిరుమల స్థానికుల సమస్యలపై త్వరలోనే సీఎం, ఎండోమెంట్ మంత్రి, టీటీడీ ఈవోకు లేఖలు రాస్తానని, అవసరమైతే నేరుగా కలసి విన్నవిస్తామన్నా రు. పరిష్కారం చూపకపోతే సీపీఐ పోరాటం చేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఆలయం వద్ద భక్తులతో, శ్రీ వారి సేవకులతో ముచ్చటించారు. సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకయ్య, పట్టణ కార్యదర్శి ఏ.బాలరంగయ్య, ఏ.శ్రీనివాసులు, రామచంద్ర, రామకృష్ణ, గంగాధరం ఉన్నారు.