
కర్రపెత్తనంపై కస్సుబుస్సులు
- రాజమహేంద్రి ‘దేశం’లో ఆధిపత్య పోరు
- సిటీలో గోరంట్ల జోక్యం
- మండిపడుతున్న మేయర్ వర్గం
- నానాటికీ తీవ్రమవుతున్న విభేదాలు
- కమిషనర్‌గా విజయకుమార్‌రాజు బాధ్యతలు స్వీకరించాక గోరంట్ల, మేయర్ వర్గాల మధ్య విభేదాలు మరింతగా రచ్చకెక్కాయి.
- పుష్కరాల్లో సుమారు కోటిన్నర రూపాయలతో మూడు జనరేటర్లు కొనుగోలు చేశారు. వాటిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ ఒక జనరేటర్ పని చేయలేదని గుర్తించారు. జనరేటర్‌కు ఎంత ఎక్కువ లెక్కేసినా రూ.30 లక్షలకు మించి ఉండదని టీడీపీ నేతలే అంటున్నారు. అటువంటిది మూడింటిని అంత ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేయడం వెనుక గోరంట్ల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి.
- రాజమహేంద్రవరంలో 130 సెల్లార్లకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. యజమానుల విజ్ఞప్తుల మేరకు కొంత గడువు ఇద్దామని మేయర్ సూచన చేశారు. కానీ దానిని అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వెనుక గోరంట్ల ముఖ్య అనుచరుల పాత్ర ఉందని అంటున్నారు.
- ఇటీవల 42వ వార్డులో క్రీడా మైదానానికి నిధులు మంజూరు చేయాలని మేయర్ ఆదేశించారు. అప్పట్లో ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని చెప్పిన అధికారులు తాజాగా రూ.28.50 లక్షలు మంజూరు చేశారు. దీనికి మేయర్ అభ్యంతరం చెప్పారు. ఆ వ్యవహారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
- కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మేయర్ తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా 17 మంది శానిటేషన్ సిబ్బంది గైర్హాజరయ్యారని గుర్తించి, చర్యలకు ఆదేశించారు. అయితే గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకోకుండా గోరంట్ల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని.. ఇలా మేయర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆమె సన్నిహితులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
- చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 39వ వార్డు, కంబాలచెరువు పార్కుల అభివృద్ధికి మేయర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ఆమెను అవమానించడం కాక మరేమిటని సహచర మహిళా కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. కంబాలచెరువు పార్కు అభివృద్ధికి తమ నేత విజ్ఞప్తి చేసినందువల్లనే గోరంట్ల అడ్డుపడి ఉంటారని గన్ని కృష్ణ వర్గీయులు మండిపడుతున్నారు.
- ఒకపక్క మేయర్, మరోపక్క గన్ని చెప్పినా పట్టించుకోని అధికారులు.. గోరంట్ల అనుచరుడైన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు వార్డులో పార్కు, రోడ్డు, డ్రైన్ పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
- గోరంట్ల అనుయాయులైన వాసిరెడ్డి రాంబాబు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావుల ద్వారా కార్పొరేషన్‌పై గోరంట్ల పెత్తనం చెలాయిస్తున్నారని మేయర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
- గోరంట్ల ఇంట్లో ఇటీవల జరిగిన టీడీపీ కార్పొరేటర్ల సమన్వయ సమావేశంలో మేయర్‌ను అవమానపరిచే రీతిలో పలువురు మాట్లాడటంతో ఆమె కన్నీటిపర్యంతమై బయటకు వచ్చేశారు. వ్యూహాత్మకంగానే మేయర్‌ను ఆహ్వానించి ఇలా వ్యవహరించడం.. తాజాగా చంద్రన్న బీసీ రుణాల పంపిణీ కార్యక్రమ ఆహ్వాన పత్రికలో పేరే లేకుండా చేయడం కూడా ఆమెను అవమానించేందుకేనని అంటున్నారు. ‘మేయర్‌కు అవమానం’ శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించడంతో అధికారులు ఆగమేఘాలపై మేయర్ పేరుతో మరో ఆహ్వాన పత్రిక తయారుచేసి అందజేశారు. తెరవెనుక గోరంట్ల ఉండి మేయర్‌ను అడుగడుగునా అవమానించే ఉద్దేశంతోనే అలా చేశారని ఆమె వర్గం మండిపడుతోంది.