9 గుట్టలు... 9 ఇతివృత్తాలు | master plan ready to yadigirigutta developing | Sakshi
Sakshi News home page

9 గుట్టలు... 9 ఇతివృత్తాలు

Published Thu, Apr 30 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

9 గుట్టలు... 9 ఇతివృత్తాలు

9 గుట్టలు... 9 ఇతివృత్తాలు

అనుసంధానంగా రోప్ వే
చుట్టూ అడవి... అందులో జింకల సందడి
మధ్యలో దివ్యక్షేత్రంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ఆధ్యాత్మిక కేంద్రంతోపాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి
యాదాద్రి నిర్మాణంలో ఆలోచనలెన్నో
నెలరోజుల్లో మాస్టర్‌ప్లాన్ సిద్ధం
 

హైదరాబాద్: అందమైన ప్రకృతి.. అడవిని తలపించే వాతావరణం.. అందులో లేళ్లు, జింకల గెంతులు... చుట్టూ కనువిందుచేసే గుట్టలు.. ఒక్కో ఇతివృత్తంతో పర్యాటకులను ఆకట్టుకునేలా గుట్టల అభివృద్ధి... మధ్యలో లక్ష్మీ నరసింహుడు కొలువు దీరిన ఆధ్యాత్మిక కేంద్రం... దేశంలోనే ప్రధాన పుణ్యక్షేత్రంతో కూడిన పర్యాటక కేంద్రంగా యాదాద్రి రూపొందబోతోంది. దీనికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ మే నెలాఖరుకల్లా సిద్ధం కానుంది. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునే హంగులతో యాదాద్రిని ‘టెంపుల్ టూరిజం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ప్రధాన ఆలయం మినహా మిగతా ప్రాంతాలను సమూలంగా మార్చబోతున్నారు. గుట్ట దిగువన భారీ రాజగోపురం, పైకి వెళ్లేందుకు, కిందకు వచ్చేందుకు విడివిడిగా రహదారులు, పైన అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, ఎత్తయిన మరో రాజగోపురం, కల్యాణ మండపాలు, యాగశాలలు, భక్తుల క్యూ మార్గం, ప్రసాద వితరణ కేంద్రం, కల్యాణ కట్ట, దుకాణ సముదాయం.. ఇలా అన్నీ సరికొత్త రూపు సంతరించుకుంటాయి. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండనుంది. దీనికి అనుబంధంగా మరో 8 గుట్టలను అభివృద్ధి చేయనున్నారు. వాటిల్లో ఒక్కో గుట్టను ఒక్కో ఇతివృత్తంతో తీర్చిదిద్దబోతున్నారు. ఇది పర్యాటకంతో కూడుకున్న ప్రాజెక్టు. ఇతివృత్తాలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... వాటిపై కన్సెల్టెంట్లు రకరకాల ఆలోచనలపై కసరత్తు చేస్తున్నా రు. అన్ని గుట్టలను కలుపుతూ రోప్‌వే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
 
 గుట్టపైకి వీఐపీ వాహనాలే...

గుట్టపైన వంద వాహనాలు సరిపోయేలా పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీఐపీలు వచ్చినప్పుడు వారి వాహనాలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు. మిగతారోజుల్లో సాధారణ వాహనాలకు ప్రవేశం నిషిద్ధం. దిగువన ఐదొందల ఎకరాల్లో అడవిని అభివృద్ధి చేసి అందులో జింకల పార్కును ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించి మరో నెలరోజుల్లో స్పష్టత రానుంది.
 
రైలు... బ్యాటరీ వాహనాలు... లిఫ్టులు..

యాదాద్రిని పర్యావరణ అనుకూలంగా మలిచేందుకు కొన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గుట్టపైకి సాధారణ వాహనాలను అనుమతించొద్దని నిర్ణయించారు. భక్తుల వాహనాలు గుట్ట దిగువనే నిలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐదు వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ టవర్‌ను నిర్మిస్తారు. గుట్టపైకి భక్తులను చేర్చేందుకు మూడు అంశాలను పరిశీలిస్తున్నారు. మినీ ఎలక్ట్రిక్ రైలును ఏర్పాటు చేసి ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులను తరలించడమా లేదా.. బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి తేవడమా లేక.. భారీ లిఫ్టుల ద్వారా భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడమా అనే ప్రతిపాదనలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement