సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 6న బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెల్లడించనున్నట్టు చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్తున్నారు. అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని చెప్తున్నారు.
రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలి. కొత్త రక్తం పార్టీలో చేరబోతుంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలి. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని మాకు భరోసా ఇచ్చారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అసెంబ్లీ, జిల్లలా వారీగా ఛార్జ్‌షీట్ తయారు చేసి విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను వివరిస్తాం. సభకు బీజేపీ జాతీయ నేతలు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment