అభిప్రాయం
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.
భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది.
అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.
కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు.
బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్‌వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు.
క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.
1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది.
ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.
ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు.
అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది.
ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది.
నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.
మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది.
ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment