ఈ యుగం బాబాసాహెబ్‌దే! | Sakshi Guest Column On DR BR Ambedkar Jayanti | Sakshi
Sakshi News home page

ఈ యుగం బాబాసాహెబ్‌దే!

Published Fri, Apr 14 2023 2:56 AM | Last Updated on Fri, Apr 14 2023 2:56 AM

Sakshi Guest Column On DR BR Ambedkar Jayanti

ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్‌ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్‌ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్‌ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్‌ ముల్లర్,  సురేంద్ర దాస్‌ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్‌ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు.

ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్‌ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్‌ ఆఫ్‌ ఈస్ట్‌’  పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్‌ చదివి రాసుకున్న నోట్స్‌ ఎంతో విలువైనది.

దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో’, ఎంగెల్స్‌ రాసిన ‘డైలెక్టిక్స్‌ ఆఫ్‌ నేచర్‌’, మోర్గాన్‌ రాసిన ‘ఏన్షియంట్‌ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి.

వేదాల గురించి అంబేడ్కర్‌ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి.  వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే  వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం.

మానవ కల్పి తాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్‌ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్‌ చెప్పారు. 

అంబేడ్కర్‌ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు.

వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. 

ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది.  లండన్‌ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు.

కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్‌ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. 

అంబేడ్కర్‌ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం  చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్‌ుమేట్‌ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది.

నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. 

నీటి వినియోగం పైన  అంబేడ్కర్‌ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలలో అంబేడ్కర్‌ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్‌ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి.

ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్‌ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్‌ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం.
డాక్టర్‌ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళిత ఉద్యమనేత ‘ 98497 41695

రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే  అఖండ ఏకైక భారత్‌ ప్రాపగాండా అనేది స్పష్టం. 

ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. 

ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్‌లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం  ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు.  

కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. 

ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్‌ అంబేడ్కర్‌... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్‌ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్‌ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?

6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్‌’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్‌ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్‌ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. 

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్‌ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి.  స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్‌ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. 

జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే...  దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్‌ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.
డా‘‘ గాలి వినోద్‌ కుమార్‌
వ్యాసకర్త ఫౌండర్‌ చైర్మన్, నవ భారత్‌ నిర్మాణ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement