అభిప్రాయం
రాజ్యాంగమే మనకు దిక్సూచి. రాజ్యాంగమే మనకు ప్రమాణం. రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తిస్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. బౌద్ధం ప్రవచించిన సామాజిక సమానత్వం తిరిగి సాకారం కావాలి. ప్రజలు సిరిసంపదలతో తులతూగే, సుఖ సంతోషాలతో శాంతమయమైన జీవితాన్ని గడిపే రోజులు మళ్లీ రావాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించాలి, ద్వేషాన్ని విడనాడాలి.
అంబేడ్కర్ భారతదేశాన్ని బౌద్ధ భారతంగా గుర్తించారు. బీజేపీ పార్టీ రాముడు అని నినాదం చేస్తే, ఆవ్‌ు ఆద్మీ పార్టీ వాళ్ళు ఆంజనేయుడు అన్నారు. కొందరు రామరాజ్యం కావాలి అంటే, ఇంకొందరు కృష్ణరాజ్యం కావాలి అన్నారు. కానీ ఈరోజు కావాల్సింది బౌద్ధ రాజ్యం. బౌద్ధంలో సామాజిక సమానత్వం ఉంది. బౌద్ధ సూత్రాలతోనే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారు.
‘మన ఉద్యమాలు హిందువుల మనసులను మార్చలేకపోయాయి. మనం ఆశించిన సమానత్వాన్ని అందుకోలేకపోయాం. వర్ణ వ్యవస్థకు, అస్పృశ్యతకు మూలమైన హిందూమతంలో కొనసాగేకంటే ఆ మతానికి స్వస్తి చెప్పి మరో మతాన్ని స్వీకరించడం మేలు. దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. అది నా చేతిలో లేదు. కానీ నేను హిందువుగా మరణించను’ అని అంబేడ్కర్ ప్రకటించారు. ఈ ప్రకటన హిందువుల గుండెల్లో ఆందోళన రగిలించింది. అంబేడ్కర్ హిందూ మతాన్ని విడనాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసిన హైందవేతర మతాధిపతులు అంబేడ్కర్‌ను తమ తమ మతాలను స్వీకరించాల్సిందని రాయబారాలు సాగించారు.
ఆ సమయంలో ఇటలీ బౌద్ధ భిక్షువు లోక్‌నాథ్ శ్రీలంక వెళ్తూ బొంబాయిలోని రాజగృహ గ్రంథాలయంలో అంబేడ్కర్‌ను కలుసుకొని బౌద్ధ మత విశిష్టత గూర్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత దేశంలో అస్పృశులకు స్వాతంత్య్రాన్నీ, సమానత్వాన్నీ అందివ్వగలిగేది బౌద్ధమేననీ, అందుకు బౌద్ధాన్ని ప్రచారం చేయమనీ కోరారు.
శ్రీలంక చేరుకున్న తర్వాత కూడా ఒక ఉత్తరాన్ని రాశారు. ‘‘...ఈ ఉత్తరాన్ని ముగించే ముందు నేను మీతో మీ గ్రంథాలయంలో మాట్లాడిన విషయాన్ని మరొక్క మారు గుర్తుకు తేనివ్వండి. డాక్టర్ అంబేడ్కర్! మీ భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. పీడిత ప్రజానీకానికి ఆనందమైన జీవితాన్ని అందించినా లేక వారిని దుఃఖంలో ముంచినా అంతా మీపై ఆధారపడి ఉంది. వారి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది.
మీరు మరో సామాన్యమైన మతాన్ని స్వీకరించినట్లయితే మీరే కాకుండా కోట్లాది ప్రజలు నష్టపోతారు. వారిని బౌద్ధమతం వైపు నడిపించండి. బౌద్ధమతం గురించి మీరు ప్రశంసించిన మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి. మీ గ్రంథాలయ గోడపై ధ్యాన నిమగ్నంలో ఉన్న అత్యంత సౌందర్యవంతమైన బుద్ధుని చిత్రపటం నాకళ్ళ ఎదుటే వున్నట్లు కనిపిస్తుంది’ అంటూ భిక్కు లోక్‌నాథ్ రాశారు. అంబేడ్కర్ బౌద్ధమతం తీసుకోవటం వెనుక లోక్‌నాథ్ ప్రభావం కూడా ఉంది.
నిజానికి బౌద్ధం గొప్ప చారిత్రక, రాజకీయ ధర్మం. శాతవాహన, ఇక్ష్వాకు రాజకుటుంబాల్లోని స్త్రీలు బౌద్ధం పట్ల మక్కువజూపి లెక్కలేనన్ని బౌద్ధచైత్యాల్ని, మండపాల్ని, విహారాల్ని నిర్మించారు. నాగార్జున కొండలో బయల్పడిన ప్రాకృత శాసనాలను పరిశీలిస్తే, ఆ కాలపు ప్రజలు సిరిసంపదలతో తులతూగి, సుఖ సంతోషాలతో, శాంతమయమైన జీవితాన్ని గడిపారని తెలుస్తుంది.
వర్తకులు, కళాకారులు, భూస్వాములు, సైనికులు, ఉన్నతోద్యోగులు, ఒకరేమిటి వివిధ వృత్తులవారు ఒక్కటై బౌద్ధారాధనలో అంకిత భావంతో అమితోత్సాహంగా పాలు పంచుకొన్నారు. దీనికి అప్పటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించి తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల్లో బౌద్ధం విస్తరించటానికి తోడ్పడినాయి.
అంబేడ్కర్‌కు ఈ చరిత్రంతా తెలుసు. అందుకే ఆయన బౌద్ధాన్ని ఒక జీవన విధానంగానే కాక, ఒక దేశీయ విధానంగానూ భావించారు. నిజానికి మనది బౌద్ధ భారతం. మన రాజముద్ర ఏది? బౌద్ధ చక్రవర్తి అశోకుడు చెక్కించిన సారనాథ్‌లోని నాలుగు తలల సింహస్తూపం, 24 ఆకులు గల ధర్మ చక్రాలతో కూడిన ముద్రే కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర ఏదీ? విదికుడనే చర్మకారుడు క్రీస్తు శకం 12 శతాబ్దంలో అమరావతి స్తూపంపై చెక్కిన పూర్ణ ఘట శిలాఫలకమే కదా! మనం వాడే ధర్మం అనే పదం ఎక్కడిది? బుద్ధుడు నైతిక విలువలకు చిహ్నంగా బోధించిన ‘ధమ్మ’ పదం నుంచి వచ్చిందే కదా!
దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన అనేకమంది మేధావులు బౌద్ధం నుండి వచ్చినవారే. నాగార్జునుడు, ఆర్యదేవ, భవ్య, దిఙ్నాగ, ధర్మకీర్తి, వసుబంధు, బుద్ధపాలిత, భావవివేక, అసంగ తదితర తత్వవేత్తలు అందరూ బౌద్ధులే. బౌద్ధం ప్రేమ తత్వాన్ని బోధించింది. ద్వేషాన్ని తొలగించింది. బౌద్ధ భారత నిర్మాణంలోనే ‘కుల నిర్మూలన’ జరుగుతుందని అంబేడ్కర్ బోధించారు. నిజానికి భారత రాజ్యాంగం అంతా బౌద్ధ సాంస్కృతిక జ్ఞాన వికాసంతో నిండి ఉంది. నిజానికి మత భావకులు ప్రేమను, నైతికతను, జ్ఞాన సంపదను చెప్పవలసిందిపోయి పరలోక రాజ్యాల గురించి బోధిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగం అంతా అహింసా సూత్రాలతో నడుస్తుంది. అంటరానితనం నిషేధించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం.
రాజ్యాంగాన్ని పరిశీలిస్తే అంబేడ్కర్ బౌద్ధ ధమ్మపథ సారాన్ని అంతా ఎలా అందులోకి ఇమిడ్చారో మనకు అర్థమౌతుంది. అంబేడ్కర్ భారతదేశ చరిత్రను, సంస్కృతిని, నీతిశాస్త్రాన్ని, అహింసా ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, కరుణ భావాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి బౌద్ధ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఈనాడు ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, లౌకిక వాదులు, సాంస్కృతిక వాదులు అందరం అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భారత నిర్మాణానికి తిరిగి పూనుకుందాం. అప్పుడే భారతదేశంలో క్రాంతి, శాంతి, అహింస, నైతికత, ఉత్పత్తి, ప్రేమ సమతుల్యం అవుతాయి.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment