అభిప్రాయం
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ ఏకంగా బలమైన ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి జైళ్లలోనూ పెడుతోంది. ఇందుకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతంతాజా ఉదాహరణ. దీనిపై ప్రతిపక్ష కూటమి భగ్గుమంటోంది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలో అనేక చోట్ల దళితులపై జరుగుతున్న దాడులూ, కర్నాటక బీజేపీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం వంటివన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.
ప్రతిపక్షాల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్రం అరెస్టు చేసింది. ఎన్నికల ముందు ఇలా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం గురించి ప్రపంచ దేశాలు విస్తుబోయాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టేనని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, జపాన్‌లు వ్యాఖ్యానించటం గమనార్హం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ ‘దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు మేలు చేయబట్టే నా మీద బీజేపీ దాడులకు దిగింద’ని వక్కాణించారు.
కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీ వాల్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ... నిర్విరామ విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ బడులు బలోపేతం, మొహల్లా క్లినిక్‌లు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి అనేక హామీలతో కేజ్రీవాల్ జైలు నుంచి ఒక లేఖ పంపినట్టు ప్రకటించారు.
ఇటువంటి హామీలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుందనీ, 180 సీట్లన్నా తెచ్చుకోగలదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుతంత్రంలో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా యని, మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం, నియంతృత్వ రాజ్యాన్ని తీసుకురావడం, ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు పరచడం వంటివి బీజేపీ వ్యూహమనీ ఆయన అన్నారు. నియంతలను గద్దె దించటం ఎలాగో ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు.
నిజానికి బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మీద... ముఖ్యంగా తమిళనాడు సామాజిక సాంస్కృతిక అస్తిత్వం మీద దాడిచేస్తోంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడం, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం మీద బీజేపీ అసహనంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిరాకరించి అధునాతన ధర్మానికీ,రాజ్యాంగ పరిరక్షణకూ పూనుకునే కార్యక్రమాలు నిర్వహించడం మీద బీజేపీ ఆగ్రహంగా ఉంది.
ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ‘కచ్చతీవు’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి జయరాం రమేష్‌లు తగిన విధంగా స్పందించారు. 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు (దీవి)ని శ్రీలంకకు అప్పగించిందని మోదీ ఆరోపించారనీ, మరి 2015లో బంగ్లాదేశ్‌తో ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న భూమి సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చింది కదా అని జయరాం రమేష్ గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే మనకు వచ్చాయి అన్నారు.
ఆ సమయంలో మోదీపై ఆరోపణలు చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లుకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని వెల్లడించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ వర్గాలను కలవరపెట్టిందని విమర్శించారు. తమిళనాడులో వస్తున్న సామాజిక ఆర్థిక పరిణామాలను తట్టుకోలేక మోదీ ‘కచ్చతీవు’ ప్రస్తావన తెచ్చారని అన్నారు. 1974లో సిరిమావో బండారు నాయకే– ఇందిరా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా శ్రీలంక నుండి ఇందిరా గాంధీ చాతుర్యం వల్ల ఆరు లక్షల మంది తమిళ భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చైతన్యానికి బెదిరి ఎప్పటివో సరిహద్దు విషయాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. బిహార్ ఓబీసీ రాజకీయ నాయకులు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీ నాయకుల్ని బతకనివ్వటం లేదనీ, తన తల్లి, తండ్రి, తోబుట్టువులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ప్రకారం ఓబీసీలు అంటే శూద్ర బానిసలనీ, వారు రాజ్యపాలనకు పనికిరారనేది వారి భావ జాలం అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏ గిరిజనుల, దళితుల, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందో, మాట్లాడుతోందో వారే నిజానికి సామా జిక ఉత్పత్తి శక్తులు. భారతీయ గిరిజనులు మన ప్రకృతినీ, సంస్కృతినీ రక్షించినవారు. దళితులు నదీ నాగరికతను సృష్టించినవారు. వీరి శ్రమ లేనిదే భారతదేశ సంపద లేదు. ఎవరు సంపద సృష్టిస్తున్నారో వారి రక్షణ కోసమే భారత రాజ్యాంగం రాయబడింది.
ప్రధాని దేశంలో సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా వ్యవస్థలను విస్తృతం చేయాలనే పథకాలను రూపొందించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా విభాగం సీట్లన్నీ తగ్గించేశారు. ఎస్సీలకు ఇస్తున్న ఉపకార వేతనాలను తగ్గించేశారు. ఇకపోతే మహిళా సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ళ కాలంలో ఘోరంగా విఫలమయ్యింది. బడ్జెట్‌లోనూ మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపును తగ్గించింది. 5 కీలక మహిళల సమస్యల పరిష్కారంలో విఫలమైంది. 2023 – 24 కేంద్ర బడ్జెట్‌లో అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కేవలం 0.55 శాతం నిధులు మాత్రమే కేటాయించింది.
వాచాలత్వం నుండి, ఆధిపత్యం నుండి, అణచివేత నుండి, హింస నుండి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జీవులు అయిన గిరిజనులు, దళితులు చెట్టును ప్రేమిస్తారు, నదిని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. భారతదేశం ప్రకృతి జీవులది. పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద శక్తులు వీరి శ్రమను దోపిడీ చేసి అభివృద్ధి చెందుతున్నాయి. ఎవరి శ్రమ దోచుకుంటున్నారో వారిపై అరాచకాలు చేస్తు న్నారు.
బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఆరు గురు యువకులు ఒక దళిత బాలికపై (16 ఏళ్ళు) లైంగిక దాడి చేశారు. వారిపై కేసు పెట్టినందుకు ఆమెను వారు అగ్నిలో దహించారు. ఇటు వంటి పాలకులను అందిస్తున్న బీజేపీకి చెందిన కర్నాటక నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం ముందు ముందు ఏమి జరగను న్నదనే సంగతిని సూచిస్తోంది.
ఇకపోతే ఇండియా కూటమి కూడా అంబేడ్కర్‌ని ముందు పెట్టుకోకుండా వెళితే రాజ్యాంగాన్ని రక్షించలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇక ప్రజలకు ఉండదు. రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ ‘భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’గా ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ లౌకిక, ప్రజాస్వామ్య భావనలు ప్రమాదంలో పడబో తున్నట్లనిపిస్తోంది.
రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. ఇప్పుడు అవీ ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగ 11వ అధికరణం ప్రాథమిక హక్కులను హరించే ఏ శాసనం చెల్లదని చెప్పడం కొంత ఊరటనిస్తోంది. అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ మీదా ఉంది.
ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కులతత్వ, మత తత్వవాది. ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ దశలో అంబేడ్కర్ ఆలోచనలతో లౌకిక భారత పునరుజ్జీవనం కోసం బడుగు వర్గాలు, లౌకికవాదులం ఏకమై రాజ్యాంగ స్ఫూర్తినీ, చైత న్యాన్నీ, ప్రతిష్ఠనూ, వ్యక్తిత్వాన్నీ కాపాడే పోరాటంలో భాగస్వాముల మవుదాం. విజయం సాధిద్దాం!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment