![Is the Indian Constitution a copy-paste document check deets inside](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/indianconstitution.jpg.webp?itok=KwSTZV0E)
భారత స్వాతంత్య్ర సంగ్రామం చివరికి ఉపఖండం భారత్ (India), పాకిస్తాన్‌లుగా విభజితమవ్వడంతో ముగిసింది. బ్రిటిష్ రాణి 1947 జూలైలో ‘భారతీయ స్వాతంత్య్ర చట్టం–1947’ను ఆమోదించారు. ‘3వ జూన్ ప్లాన్’ పేరున ‘మౌంట్ బాటెన్ ప్రణాళిక’కింద రెండు (భారత్–పాక్) డొమినియన్‌ల సృష్టి జరిగింది. అవి స్వతంత్ర దేశాలని అనుకుంటున్నాం కాని, బ్రిటిష్ రాణి (British Queen) దయవల్లనే వాటికి డొమినియన్ స్థాయిని ఇచ్చారు (ఇది దానం వలె ‘ఇచ్చింది’ అని అర్థం చేసుకోవాలి). స్వాతంత్య్ర చట్టం ఆమోదానికి ముందే మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ (1946) ఏర్పడింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగ నిర్మాణం సాగి 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.
అయితే మన రాజ్యాంగం (Indian Constitution) కాపీ కొట్టిన రాజ్యాంగం అనే అపప్రథను మూట కట్టుకుంది. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది. బ్రిటిష్ వాళ్లు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం–1935’ను మక్కీకి మక్కీ నకలు చేశారంటారు. అలాగే అనేక ప్రపంచ దేశాల నుంచి నచ్చిన అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో చేర్చారు. మనకు ఉన్న దేశాధ్యక్షుడు (రాష్ట్రపతి), మంత్రి వర్గం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో అనేకానేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నవే. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధారణ అంశాలు (భాగాలు) కాబట్టి అది నకలు అనడానికి వీల్లేదు. మనం ప్రజాస్వామ్య విధానం పాటిస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన అంశాలను స్వీకరించడం తప్పుకాదు కదా. ఇక ఏ ఏ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించామనే విషయానికి వస్తే... బ్రిటన్ నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పరి పాలన, రూల్ ఆఫ్ లా, శాసన ప్రక్రియ, క్యాబినెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ నిర్వహణలో న్యాయరంగంలో ఆజ్ఞల పాత్ర (రిట్ గొప్పతనం) వంటివి ఉన్నాయి.
ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యులను ఎంపిక చేసే పద్ధతిని స్వీకరించాము. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినవాటిలో అధికారం నుంచి రాష్ట్రపతిని తొలగించడం (మహా అభిశంసనం), రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అధికారాలను నిర్వహించే విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ పీఠిక ఉన్నాయి.
సమాఖ్య తరహా అధికారిక కేంద్రీకరణ... అంటే రాష్ట్రాలతో పోల్చితే బలమైన కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు కాక మిగిలిన అన్ని అధికారాలను కేంద్రానికి అప్పగించడం, కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్ (రాజ్ పాల్) నియామక అధికారం, సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఆస్ట్రేలియా నుంచి కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగిన అంశాల జాబితా (ఉమ్మడి జాబితా), లోక్‌సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడంవంటి అంశాలు; సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పీఠికలో చేర్చడం; ఫ్రాన్స్ నుండి గణతంత్ర లక్షణం, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను పీఠికలో చేర్చడం వంటివాటిని స్వీకరించాం.
అలాగే జర్మనీ నుంచి ఎమర్జన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే (సుషుప్తావస్థలో ఉంచే) విధానాన్ని, దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎన్నికల విధానం, రాజ్యాంగ సవరణవంటివి మనం తీసుకున్నాం. ఈ లక్షణాలన్నీ వివేకంగా ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయించారు. అంతకుముందు బీఎన్ రావ్ ఒక ముసాయిదా రాశారు. అయితే అది పూర్తిగా మారిపోయింది. పోల్చుకోవడం కూడా సాధ్యం కాని విభిన్నమైన ప్రజాస్వామ్యాల నుంచి అనేక అంశాలు, కీలకమైన కొన్ని విధానాలు చేర్చ వలసి ఉందని ఆయనే స్పష్టంగా చెప్పారు.
చదవండి: బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..
అందుకు తగినట్లే అనేక రాజ్యాంగాల నుంచి తగిన విషయాలను స్వీకరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొందరు పెద్దలు అసలు మొదటి రాజ్యాంగం రాసింది రావ్ గారే తెల్సా అని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మన తాజా దేశభక్తులు కూడా ఇదే వాదన చేస్తుంటారు. విధిలేక అంబేడ్కర్‌ను ఈ భక్తులు మొక్కుతున్నారు గాని రాజ్యాంగ నిర్ణాయక సభ (లేదా రాజ్యాంగ నిర్మాణ పరిషత్)లోని సప్త రుషులవంటి ఏడుగురు రాజనీతిజ్ఞుల అవిరళ కృషి, మార్గదర్శకాలతో తొలి డ్రాఫ్ట్ రూపొందింది. తరువాత ఆ ఏడుగురిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం చేశారని అర్థం చేసుకోవాలి. ప్రతి నియమానికి నానా కష్టాలు పడి, చర్చించి, ఒప్పించి, అందరూ ఏకాభిప్రాయం సాధించిన తరువాత ఈ రాజ్యాంగం ఏర్పడిందని గ్రహించాలి.
-మాడభూషి శ్రీధర్, మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment