నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది.
వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము.
దీంతో భారత నవయువ రిపబ్లిక్‌తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది.
ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు.
భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది.
రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది.
75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే.
‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్‌ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’
సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము.
రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు.
ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్‌సభ స్పీకర్
(నేడు భారత రాజ్యాంగ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment