రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఘనతలు సాధించాం
కలిసికట్టుగా పనిచేస్తే సంవిధాన్ ఆశయాలకు మరింత బలం
దేశ ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే పునాది రాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పాత పార్లమెంట్ భవనం సెంట్రల్‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం.. హాజరైన ఎంపీలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు.
కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్‌లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు.
మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే..
విశ్వబంధు భారత్
‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం.
అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది.
స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం
వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి.
ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి.
స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్
రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు.
మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు.
రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు.
రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా
చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు.
సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment