మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు | President Murmu Calls For An End To Culture Of Adjournments | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు

Published Mon, Sep 2 2024 4:20 AM | Last Updated on Mon, Sep 2 2024 4:57 AM

President Murmu Calls For An End To Culture Of Adjournments

న్యూఢిల్లీ:  మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు.

 జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్‌లాగ్‌ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్‌ అదాలత్‌లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్‌ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. 

న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.  

కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ 
జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. 

‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్‌ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement