రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా? | Sakshi Guest Column On Constitution of India | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?

Published Fri, Dec 8 2023 4:23 AM | Last Updated on Fri, Dec 8 2023 4:23 AM

Sakshi Guest Column On Constitution of India

రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు.

ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్‌ మార్షల్‌ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్‌ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్‌ ఆఫ్‌ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి.

వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్‌ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్‌ బ్యాంక్‌ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. 

ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు.  

ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్‌ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్‌ ఆఫ్‌ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్‌ ఆఫ్‌ లాను పొందగలరు.
– డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ – రీసెర్చ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement