indian politics
-
కావాలంటే బయట మార్పుకోసం ఎంతయినా శ్రమిద్దాం! మనలో మార్పంటే అసాధ్యం కామ్రేడ్!
-
ఆమె పైనే అందరి దృష్టి
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారబోతున్నారు. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ఇందిరాగాంధీ ఆహార్యంతో భవిష్యత్తు భారత రాజకీయాలపై ఆమె చూపించబోయే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.2004 లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలి నుండి పోటీ చేసిన తల్లి సోనియాగాంధీ, అమేథీ నుండి పోటీ చేసిన అన్న రాహుల్ గాంధీల తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అడపా దడపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా – ఉత్తరప్రదేశ్ ఇన్చార్జిగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తీవ్ర ప్రచారం చేసినా తన పార్టీని ఘోర పరాజయం నుండి కాపాడలేక పోయారు. కానీ 2022లో జరిగిన హిమాచల్‌ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో అన్నీ తానై అధికార బీజేపీని ఓడించడానికి దోహద పడ్డారు. ఈ విజయం... ఆ తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవటానికి స్ఫూర్తినిచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మహిళల మెడలో మంగళ సూత్రాలు మాయం చేస్తారనే మోదీ విమర్శలకు ధీటుగా స్పందించారామె. ‘ఈ దేశ ప్రజల కోసం నా తల్లి సోనియా గాంధీ తన మంగళ సూత్రాన్ని త్యాగం చేసింద’ని మోదీ విమర్శలను తిప్పి కొట్టిన తీరు ఓటర్లను ఆకర్షించినట్లుంది. మరి 4లక్షల మెజారిటీని ఓటర్లు కట్టబెట్టారంటే మామూలు సంగతి కాదు.లోక్‌సభలో విపక్షం నుండి ప్రభుత్వంపై బలమైన విమర్శలతో విరుచుకుపడే సుప్రియా సూలే, మహువా మొయిత్రాకి తోడుగాప్రియాంక గాంధీ చేరడం విపక్ష ‘ఇండియా’ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే. రాహుల్ గాంధీ ఉత్తర భారత్ నుండి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతం నుండి ప్రాతినిధ్యం వహించటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చూడాలి. ఇంతకు ముందు దక్షిణాదికి చెందిన తెలంగాణలోని మెదక్ నుండి ఇందిరా గాంధీ, కర్ణాటకలోని బళ్లారి నుండి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. – డా‘‘ తిరునహరి శేషు ‘ రాజకీయ విశ్లేషకులు, వరంగల్ -
రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?
రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు. ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్ మార్షల్ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్ ఆఫ్ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి. వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్ బ్యాంక్ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్ ఆఫ్ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్ ఆఫ్ లాను పొందగలరు. – డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ – రీసెర్చ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ -
రాజకీయాలతో ప్రజల మమైకం.. బిస్మార్క్ మాటలు అక్షర సత్యం
భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 55 ఏళ్ల వరకూ, అంటే 21వ శతాబ్దం మొదలయ్యే వరకూ ప్రజల్లో కొంత మందికి రాజకీయాలంటే వ్యతిరేకత ఉండేది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనిపించనప్పుడు తప్పంతా రాజకీయ నాయకులదే అనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. 1960, 70ల్లో అయితే అసలు ప్రజాస్వామ్యం ఇండియాకు ప్రయోజనకరమా? అనే ప్రశ్న కూడా బహిరంగ ప్రదేశాల్లో మధ్య తరగతి నోట వినిపించేది. కొందరైతే ప్రజాజీవితంలో అరాచకం తరచు కనిపించే భారతదేశంలో సైనిక పాలనే మెరుగైన ఫలితాలు ఇస్తోందేమోననే రీతిలో ఆగ్రహంతో మాట్లాడేవారు. అయితే, 1977 నుంచీ దేశ రాజకీయాల్లో శరవేగంతో వచ్చిన మార్పులు, వికసించిన జన చైతన్యం, పాలనా వ్యవస్థల్లో కొద్దిపాటి కదలికలు కానరావడంతో–రాజకీయాలను, రాజకీయ నేతలను, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పలచనచేసి మాట్లాడే ధోరణి తగ్గిపోయింది. అన్ని సమస్యలకూ ప్రభుత్వాలది, రాజకీయపక్షాలదే బాధ్యత కాదని, జనంలో రాజకీయ స్పృహ, చలనశీలత ఉంటేనే పనులు వీలైనంత సక్రమంగా జరుగుతాయనే భావన వారిలో ఏర్పడడం మొదలైంది. దేశంలో 1977 పార్లమెంటు ఎన్నికలు ప్రజల పరిశీలనా దృష్టిలో గణనీయ మార్పు తీసుకొచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1978 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తెలుగు జనం ఆలోచనా ధోరణిలో చెప్పుకోదగ్గ పరిణతికి కారణమయ్యాయి. అప్పటి నుంచీ తెలుగునాట ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పరిపాలన సాగాలనే విషయంపై శ్రద్ధ పెరిగింది. 2004 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగునాట రాజకీయాల్లో, పాలనా వ్యవహరాల్లో ఊహించని మార్పులు విస్తృత ప్రజాచైతన్యానికి దారితీశాయి. రాజకీయపక్షాల ధోరణిపై అవగాహన పెరుగుతోంది! అనేక సమస్యలపై, సందర్భాల్లో వివిధ ప్రధాన రాజకీయపక్షాల వైఖరిపై ప్రజలకు పాతికేళ్ల క్రితం సంపూర్ణ అవగాహన ఉండేది కాదని రాజకీయ పండితులు చెబుతుంటారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉండడంతో ఆయా పార్టీల రాజకీయ ధోరణుల్లో మార్పులు అవసరమయ్యాయి. ప్రజా సంక్షేమం కోసం, పాలన సాఫీగా నడవడానికి రాష్ట్రాలను పరిపాలించే పార్టీలపై బాధ్యత, ఒత్తిడి ఎక్కువవుతున్నాయి. కేంద్రంలోని పాలకపక్షంతో పరిపాలన విషయంలో సఖ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితులు పదేళ్లుగా ఎక్కువయ్యాయి. వేర్వేరు సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఉన్న భిన్న రాజకీయపక్షాలు ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా రాష్ట్రాల్లోని పాలకపక్షాలతో (అవి ప్రాంతీయపార్టీలైనా లేదా జాతీయపక్షాలైనా) కలిసిమెలిసి సుహృద్భావ వాతావరణంలో వ్యవహరించాల్సివస్తోంది. 19వ శతాబ్దం చివరిలో జర్మనీ ఏకీకరణకు కారకుడైన ఆటో వాన్ బిస్మార్క్ (దేశాధినేత ఛాన్సలర్ గా ఆయన 1871–1890 మధ్య ఉన్నారు) దాదాపు 150 ఏళ్ల క్రితం అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. అధికారంలో ఉన్న నాయకులు ఆచరణాత్మత రాజకీయాలు నడపడానికి ఏం చేయాలో ఆయన సూటిగా ఒక్క వాక్యంలో చెప్పారు. ‘రాజకీయాలంటే–అలివికానివిగా కనిపించేవాటిని సాధ్యమయ్యేలా కృషిచేయడమే. ఇదొక కళ. ఎంత వరకు వీలైతై అంత వరకు సాధించడమే ఈ కళ లక్ష్యం,’ అనే అర్ధంలో బిస్మార్క్ చెప్పిన మాటలను ఇప్పటికీ ఆధునిక ప్రజాతంత్ర దేశాల్లో గుర్తుచేసుకుంటుంటారు. 1989-90 మధ్య దేశ ప్రధానిగా ఉన్న విశ్వనాథ ప్రతాప్ సింగ్ జీకి మైనారిటీ ప్రభుత్వం ఏడాదిపాటు నడపటం చాలా కష్టమైంది. సైద్ధాంతికంగా భిన్నదృవాలై బీజేపీ, వామపక్షాల నుంచి బయటి నుంచి మద్దతు తీసుకుంటూ వీపీ సింగ్ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి నాయకత్వం వహించడం అత్యంత క్లిష్టంగా ఉండేది. ఫలితంగా, మిత్రపక్షాలతో ఆయన అనేకసార్లు ఇష్టంలేకున్నా రాజీపడేవారు. అప్పుడు ఆయన రాజ్యపాలనకు సంబంధించి బిస్మార్క్ మాటలను తరచు ఉటంకించేవారు. ఇప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలకపక్షాలు పలు సందర్భాల్లో జనం కోసం రాజకీయంగా ఎంతో యుక్తితో వ్యవహరించాల్సి వస్తోంది. ‘పాలిటిక్స్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్’ అనే బిస్మార్క్ వాక్యం 21వ శతాబ్దంలో కూడా ప్రాసంగికత కలిగి ఉంది. ఇది అన్ని కాలాలకూ వర్తిస్తుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
Recap 2022: రాజకీయ రంగస్థలంలో కీలక ఘట్టాలు
రాజకీయాలు అంటేనే ఎన్నో మలుపులు, ఆకస్మిక నిర్ణయాలు, అనూహ్య ఫలితాలు, ఫిరాయింపులు, తిరుగుబాట్లుతో ఎప్పడికప్పుడు రక్తికట్టిస్తాయి. అలాంటి కీలక మలుపులకు కేరాఫ్‌గా నిలిచింది 2022. ఈ సంవత్సరంలో రాజకీయాల్లో నెలకొన్న కొన్ని కీలక ఘట్టాలు భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. 2022 ఏడాది పూర్తి చేసుకుని 2023లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ఏడాది దేశంలో జరిగిన కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం. ఉత్తరాఖండ్ సంప్రదాయానికి బీజేపీ చెక్: ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అవసరమైన మెజారిటీని సాధించింది. ఫిబ్రవరి 14న మొత్తం 70 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లు సాధించి అధికారం ఛేజిక్కించుకుంది. పుష్కర్ సింగ్ ధామీ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీదే గోవా: గోవాలో ఫిబ్రవరి 14న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోమారు అధికారం ఛేజిక్కించుకుంది. మొత్తం 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు సాధించింది. దీంతో ప్రమోద్ సావంత్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు. మణిపూర్‌లో బీజేపీ ఘనవిజయం: ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా 32 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన ఎన్. బిరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ పాగా: జాతీయ పార్టీగా అవతరించాలనే లక్ష్యంగా సాగిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి 20న మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 92 సీట్లు సాధించింది దేశం దృష్టిని ఆకర్షించింది. ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగా హవా: ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హవా కొనసాగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో మొత్తం 403 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవి చేపట్టారు. షిండే తిరుగుబాటు: ఈ ఏడాది మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగురవేయడంతో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. షిండే వర్గం బీజేపీతో చేతులు కలపడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో పరిణామాలు వాడీవేడీగానే కొనసాగుతున్నాయి. శివసేన పార్టీ తమదంటే తమదని ఇటు షిండే వర్గం, అటు ఉద్ధవ్ వర్గం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళా: దేశ చరిత్రలోనే తొలిసారి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు ముర్మూ. జులై 18న జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్: ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్.. భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మార్గరేట్ అల్వాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 710 ఓట్లలో 528 సాధించారు. బిహార్‌లో కొత్త కూటమి: మహారాష్ట్రను మించిన ట్విస్టులు బిహార్ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. కూటమిలో నెలకొన్న విభేదాల కారణంగా బీజేపీకి షాక్ ఇస్తూ విపక్ష ఆర్జేడీతో చేతులు కలిపారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. జేడీయూ, ఆర్జేడీ కలిసి కొత్త కూటమిగా ఏర్పడంతో పాటు రెండు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆగస్టు 10న నితీశ్ కుమార్ మళ్లీ సీఎం పీఠం అధిరోహించారు. ఓపీఎస్ వర్సెస్ ఈపీఎస్: తమిళనాడులో అధికారం కోల్పోయిన తర్వాత ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నెట్ర కళగం(ఏఐఏడీఎంకే)లో చీలికలు ఏర్పడ్డాయి. ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) నేతృత్వంలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్)ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి ఈపీఎస్‌కు దక్కెలా నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. భారత్ జోడో యాత్ర పేరిట తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ యాత్ర ప్రారంభమైంది. హిమాచల్‌ను లాగేసిన కాంగ్రెస్: నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికారాన్ని లాగేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 40 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 25 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. గుజరాత్లో బీజేపీ రికార్డులు: 25 ఏళ్లకుపైగా గుజరాత్‌ను శాసిస్తోంది బీజేపీ. డిసెంబర్లో రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునామి సృష్టించింది. మొత్తం 182 సీట్లకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి పదవి చేపట్టారు. -
రాజకీయాల్లోనూ యువతను ప్రోత్సహించాలి
భారతదేశ జనాభాలో 15–29 ఏళ్ల మధ్య ఉన్న యువత 27.5 శాతం ఉన్నారు. యువత జాతి ప్రగతికి సోపానం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగు తోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతోంది. 2020 నాటికి ప్రపంచములో అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశంగా భారత్ నిలిచింది. దేశ అభివృద్ధిలో ఈ యువ మానవ వనరు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగంలోనే ఉపయోగించుకోవడం సరికాదు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాల్లోనూ యువతకు తగిన స్థానం కల్పించవలసి ఉంది. అప్పుడే నిజమైన నవ సమాజ నిర్మాణం సాధ్యమ వుతుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. వీటి నుంచే చాలా రాజకీయ పార్టీలకు నాయకులు లభించిన, లభిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆయా సంఘాలలో పనిచేసేవారికే కాక... చురుకుగా పని చేయ గలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలూ ప్రోత్సహించాలి. ఎన్ని కల సమయంలోనో... లేదా ఏవో కొన్ని ఉద్య మాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్నీ వాడుకుని వదిలేస్తుండటం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు విడనాడాలి. మైఖేల్ గ్రీస్ రాసిన ‘సామాజిక రాజకీయ మార్పులో క్రియాశీలక ప్రతినిధులుగా యువత’ అనే పుస్తకంలో యువతలో సానుకూల దృక్పథం కలిగించి, అభివృద్ధికి అనువుగా మలుచు కోవ డాన్ని ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో బలీ యమైన ఉద్యమంగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమ నించాలి. ఇప్పటివరకూ యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్ నుంచీ అత్యు న్నత పార్లమెంట్ సభ్యుని వరకూ వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవి ష్యత్ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతి నిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్లా ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడ తాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచ్ లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా, జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహా నగరాలకు మేయ ర్లుగా... ఇలా వివిధ పదవులను పొంది... పాలనలో ప్రాథమిక అనుభవం పొంద డానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్ ఉభయ సభలకూ పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచీ ఢిల్లీ వరకూ వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు. నేదునూరి కనకయ్య వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం ‘ 94402 45771 -
సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..
నాటకాలు బాగా ప్రదర్శిస్తున్న రోజుల్లో ఓ సరదా సంభాషణ ప్రాచుర్యంలో ఉండేది. ‘ఏమోయ్.. నాటకం బాగా రక్తి కట్టిందటగా ఏ మాత్రం కలెక్ష వచ్చిందేమిటి?’.. కొంచెం వ్యంగ్యంగా అన్న ప్రశ్నకు.. ‘మహా బాగా వచ్చాయి.. బాటా తొంభై, నాటు నలభై.. అన్నీ ఎడమ కాలివే..’ అని నిష్ఠూరపు సమాధానం. ఇప్పుడు నాటకాలు పాలిటిక్స్‌లో బాగా రక్తి కడుతుండడంతో ఆ బాటా, నాటు జోళ్ల అవసరం, ప్రస్తావన ఇక్కడ బాగా పెరిగింది.. ఏదైనా పరస్పర విరుద్ధం అని చెప్పడానికి ఉప్పు, నిప్పు అంటారు. రాజకీయాల్లో విరుద్ధమైన రెండింటికీ ‘చెప్పు’ ఒక్కటే చాలు. స్వామిభక్తిని చాటడానికైనా. నిరసన తెలప డానికైనా.. ‘చెప్పు’ చేతపడితే చాలు. ఇలారండి .. భారత రాజకీయాలు ఎలా చెప్పుచేతుల్లో ఉన్నాయో చూద్దాం.. ‘షూ’ట్ ఎట్ షార్ట్‌కట్.. నిజానికి చెప్పుల కథ ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టంగానీ.. రామ భరతుల కాలంనాటి ‘పాదుకా పట్టాభిషేకం’ మనకు ఎరుకే. ఆ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.. ఎమర్జెన్సీ రోజుల్లో నాటి యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ. అసలు ఏ అధికార పదవిలోనూ లేని సంజయ్ గాంధీ చెప్పులు తివారీ చేతందు కోవడం మొదలు తరచుగా నాయకులు పాదుకా స్పర్శలో ‘అమితా’నందాన్ని పొందుతూనే ఉన్నారు. నిన్నటి బండి సంజయ్ – అమిత్ షా చెప్పుల ఉదంతం చూశాం... ఎప్పుడో 2015 నాటి నారాయణసామి – రాహుల్ చెప్పుల కథను ప్రధాని మోదీ ప్రస్తావించడం.. ఇప్పుడది ట్రోల్ అవుతుండటం చూస్తున్నాం.. నాడు రాహుల్ కాళ్లకు ఎక్కడ బురద అంటుకుంటుందోనని.. కాంగ్రెస్ నేత నారా యణసామి చెప్పులు చేతబట్టుకుని మరీ కాపలా కాశారు. రాహుల్ బూట్లు అలా విప్పగానే చటుక్కున తన చెప్పులు ఆయన కాళ్ల వద్ద పెట్టి స్వామి భక్తిని ‘చెప్పు’కున్నారు. ‘రాహుల్ వంటి సీనియర్‌ను గౌరవించుకోవడం తప్పా..?’ అని కూడా ఈ 68 ఏళ్ల వయసున్న పెద్దాయన అప్పట్లో చెప్పారు. 2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి రమేశ్ బాగ్వే ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పులను కాసేపు ‘గౌరవం’గా చేత పట్టుకున్నారు. ఇదే రాహుల్‌గాంధీ ఆమధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ‘చెప్పు’డు విమర్శ లకు దిగారు. తాము అమిత్‌షా నివాసానికి వెళితే ఇంటి బయటే చెప్పులు విప్పించారని, లోపల అమిత్‌షా మాత్రం చెప్పులు వేసుకునే ఉన్నారని మణిపూర్ ప్రజాప్రతినిధులు తనతో చెప్పారంటూ.. అమిత్‌షా క్షమాపణ చెప్పా లంటూ డిమాండ్ చేశారు కూడా. కొన్నేళ్ల కింద బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి.. ప్రభుత్వ అధికారులు ఉన్నది తమ చెప్పులు మోసేందుకే అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా రనుకోండి ‘షూ’ట్ ఎట్ ఫైట్ ఇక యూపీలోని సంత్ కబీర్‌నగర్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పబ్లిక్ ముందే చెప్పులాటకు దిగారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ బఘేల్‌ను చెప్పుతో కొడితే.. రాకేశ్ తిరిగి లెంపకాయతో బదులిచ్చారు. ‘షూ’ట్ ఎట్ సైట్ ఎప్పుడూ భక్తి తన్మయత్వమేనా.. అప్పు డప్పుడూ నిరసనల కోపం కూడా చెప్పులను చేతబట్టించింది. ► 2009లో దైనిక్ జాగరణ్ రిపోర్టర్ జర్నైల్ సింగ్ నాటి కేంద్ర మంత్రి చిదంబరంపై విసిరిన బూటు దేశంలో కలకలం రేపింది. ► 2016లో యూపీలోని సీతాపూర్ జిల్లాలో రోడ్‌షో చేస్తున్న రాహుల్ గాంధీ వైపు హరిఓం మిశ్రా అనే సామాజిక కార్యకర్త విసిరిన నిరసన బూటు దూసుకొచ్చింది. 2012లో డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రాజకీయ సభలోనూ రాహుల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ► 2016లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడుతుంటే.. వేద ప్రకాశ్ శర్మ అనే రాజకీయ కార్యకర్త చెప్పు విసిరి తన నిరసన చెప్పుకున్నాడు. ► విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదంటూ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలూ వచ్చాయి. ► అప్పట్లో కర్ణాటక సీఎంగా ఉన్న యడ్యూరప్పపై చెప్పుదాడి జరగడంతో.. చెప్పుల లొల్లి చెప్పలేనంత తలనొప్పిగా మారిందని నాటి ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ తల పట్టుకున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఆపడానికి ఏదో ఒకటి చేయాలనీ అన్నారు. ‘షూ’ట్ ఎట్ హైట్ కొందరు రాజకీయ నేతలు చెప్పుల ఎత్తు పెంచుకుని.. కొత్త ఎత్తులకు వెళ్లారని పాశ్చాత్య మీడియా అప్పుడప్పుడూ కోడై కూస్తుంటుంది. లీడర్ల అసలు ఎత్తుకు, అధికారికంగా చెప్పే ఎత్తుకు సంబంధం ఉండదని అంటూ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎత్తు బూట్లు వేసుకుని ఎత్తయిన వ్యక్తిలా కనిపించే ప్రయత్నం చేస్తారని అది ఆయన విజయ రహస్యమనీ చాలాసార్లు వార్తలూ వచ్చాయి. కొన్నేళ్ల కింద అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి వెళ్లిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తు చెప్పులు వేసుకెళ్లారని గోల చేశారు కూడా. ఇక మన దీదీ మమతా బెనర్జీ హవాయి చెప్పుల ‘సింప్లిసిటీ’కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా! నువ్వేం ‘షూ’టర్? అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్‌పై ఓ నిరసనకారుడు బూటు విసిరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ జోక్.. బూటు విసిరిన వ్యక్తికి జడ్జి మూడేళ్లు జైలుశిక్ష వేశారు. ‘కేవలం బూటు విసిరితే మూడేళ్లు జైలా?’ అని నిందితుడు వాపోతే.. ‘కాదు.. విసిరినందుకు ఒక్క ఏడాదే.. అది తగలకుండా మిస్సయినందుకు మిగతా రెండేళ్లు జైలు’ అని జడ్జి ఆగ్రహం! (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) ఇది ‘షూ’పర్.. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి మన అమ్మల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ‘చెప్పు’ లేనట.. ఆ భయం చూపి.. అల్లరిపిల్లలను దారిలో పెడుతున్నారని సరదా కామెంట్. ఇలా అమ్మలు వారి ఆయుధాన్ని విరివిగా వాడి పిల్లలను డిసిప్లిన్‌లో పెడితే... ముందు తరాల రాజకీయాల్లో చెప్పుల అవసరం బాగా తగ్గుతుందని ఓ నెటిజన్ ఉవాచ. -
Sakshi Cartoon: అది వాళ్ల వల్ల కాద్సార్! తర్వాత మనమే బలంగా పోషించాలి!!
అది వాళ్ల వల్ల కాద్సార్! తర్వాత మనమే బలంగా పోషించాలి!! -
Sakshi Cartoon: రక రకాల రాజకీయ పార్టీలు, నాయకులుంటారు. రక రకాల జెండాలు..
రక రకాల రాజకీయ పార్టీలు, నాయకులుంటారు. రక రకాల జెండాలు, ఎజెండాలుంటాయి. కానీ రక రకాల రాజకీయాలు కూడా ఉంటాయటా! -
పాలకుల ‘ఫేస్’బుక్?
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎన్నికలు మాత్రం అంత ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదా? మన దేశ ఎన్నికల రాజకీయాలలో ఫేస్బుక్, ట్విట్టర్ల జోక్యం ఎక్కువగా ఉంటోందా? మీడియా ముసుగులో ఇలాంటి సోషల్ మీడియా దిగ్గజాలు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయా? అవునంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె ప్రసంగం చిన్నదే కానీ, ఆరోపణలు తీవ్రమైనవి. ఆలోచించి తీరాల్సినవి. విద్వేష వ్యాఖ్యల వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు మాత్రం అనుకూలించేలా ఫేస్బుక్ తన స్వీయ నియమాలను సైతం మార్చేస్తున్నట్టు ప్రసిద్ధ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పరిశోధన గత ఏడాది బయటపెట్టింది. ఇక, రాజకీయ పార్టీల తరఫున పరోక్షంగా పనిచేస్తున్న వాణిజ్య ప్రకటనదారుల విషవ్యవస్థ ఫేస్బుక్లో ‘న్యూస్ మీడియా’గా చలామణీ అవుతున్న తీరును తాజాగా ‘అల్ జజీరా’, ‘రిపోర్టర్స్ కలెక్టివ్’లు బహిర్గతం చేశాయి. ఎన్నికల వేళ ఈ ‘ఫేక్’ బుక్ చర్యలు దేశ ఎన్నికల చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక గళాలను పూర్తిగా తొక్కేస్తున్నాయి. తప్పుడు సమాచారంతో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పిన్నపెద్దల మనసులను కలుషితం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే, బీజేపీకి తక్కువ ధరలకే ఫేస్బుక్ ఎన్నికల ప్రచార ప్రకటనల్ని అందించారనీ తెలుస్తోంది. అయితే, అధికార పక్షమే ప్రయోజనం పొందుతున్న వేళ, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ సారథ్య ప్రభుత్వాన్నే కోరాల్సి రావడం విరోధాభాస. సహజంగానే అధికార పక్షీయులు ఆ పాపంలో తమకు భాగం లేదంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లు సమాచార ప్రచురణకర్తలా, లేక వట్టి వాహకాలేనా అన్నది ఇప్పటికీ తేలలేదన్న లా పాయింట్ లేవదీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ ఆరోపణలను అడ్డం పెట్టుకొని, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎ) ద్వారా భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోం దంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు. వాదోపవాదాలు పక్కనపెడితే – ఏ దేశంలోనైనా సరే పార్టీలు, నాయకులు, వారి నియుక్తులు ‘తాము చెప్పిందే వేదం, చూపిందే సత్యం’ అని భ్రమింపజేసేలా కథనాలను వండి వార్చడానికి సోషల్ మీడియాను వాడుతుండడం ఆందోళనకరం. ప్రజాపాలనకే ప్రమాదకరం. ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసి, తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి సోషల్ మీడియా వాడకం పెరుగుతోందనీ, దీనికి ప్రభుత్వం చరమగీతం పాడాలనీ సోనియా అన్నది అందుకే! సోనియా కన్నా తొమ్మిది నెలల ముందే – 2021 జూలైలోనే ఎన్నికలలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు సైతం గళం విప్పడం గమనార్హం. సోషల్ మీడియాతో తిమ్మిని బమ్మిని చేస్తుండడంతో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియలకే ముప్పు వచ్చి పడిందని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లోనే వ్యాఖ్యానించింది. ‘ఫేస్బుక్ వర్సెస్ ఢిల్లీ అసెంబ్లీ’ కేసులో తీర్పునిస్తూ, కోర్టు చేసిన ఆ వ్యాఖ్యకు ఒక రకంగా కొనసాగింపే ఇప్పుడు బయటపడ్డ సంగతులు, వినిపిస్తున్న ఆరోపణలు. నిజానికి, తమ వాదనను వినిపించలేని కోట్లాది మందికి ఫేస్బుక్ లాంటి వేదికలతో భావప్రకటనా స్వాతంత్య్రం వచ్చింది. ప్రధాన స్రవంతికి ప్రత్యామ్నాయ వేదికగా నాణేనికి రెండో కోణం చూపడానికి సోషల్ మీడియా ఉపయోగాన్నీ కొట్టిపారేయలేం. కానీ పదునైన ఈ కత్తిని దేనికి వాడుతున్నామన్నది కీలకం. జవాబుదారీతనం లేని అపరిమిత స్వేచ్ఛ పొంచి ఉన్న ప్రమాదం. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో సైతం ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వ్యవస్థీకృతంగా అనుచిత రాజకీయ జోక్యం సాగుతున్నట్టు తాజా అధ్యయనం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫేస్బుక్లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ, ప్రతిపక్షాన్ని అవహేళన చేస్తూ అనేక ప్రకటనలొచ్చాయి. ఆ ప్రకటనలిచ్చిన ‘న్యూ ఎమర్జింగ్ వరల్డ్ ఆఫ్ జర్నలిజమ్ లిమిటెడ్’ సంస్థ సాక్షాత్తూ రిలయన్స్ వారి ‘జియో’ చెట్టు కొమ్మేనట. ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధించి ఆ సంగతి తేల్చింది. ఫేస్బుక్లో ఇలా రహస్య రాజకీయ వాణిజ్యప్రకటనలు కొత్త కాదు. 2019లో అధికార పార్టీతో బంధాన్ని నేరుగా ప్రకటించకుండా పలు ఫేస్బుక్ పేజీలు అధిక శాతం ప్రకటనలిచ్చినట్టు ‘ఆల్ట్ న్యూస్’ విశ్లేషణలోనూ వెల్లడైంది. గ్రామీణ ప్రజలే లక్ష్యంగా వార్తాకథనాల ముసుగులో ఇన్‌స్టా వీడియోలతో సాగుతున్న ముస్లిమ్ వ్యతిరేక ప్రచారం అపారమని ‘అల్‌జజీరా’ వెల్లడించింది. సానుకూలత కోసం పచ్చి అబద్ధాలను సైతం పవిత్రమైన నిజాలుగా, నిష్పూచీగా చలామణీలోకి తేవడంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఆఖరికి అందరం వాడుతున్న వాట్సప్లదీ ప్రధాన భూమిక. ‘వాట్సప్ యూనివర్సిటీ’ల్లో సమాచారం పేరిట ఫార్వర్డ్‌ల రూపంలో నిత్యం ప్రవహిస్తున్న అజ్ఞానానికి అంతం లేదు. డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారి ప్రవహిస్తున్న ఈ అసత్యాల మురుగును అడ్డుకొనేదెలా అనేది ప్రశ్న. ఫేస్బుక్లో న్యూస్‌ఫీడ్ మాటున దాన్ని స్వలాభానికీ, ప్రత్యర్థులపై బురద జల్లడానికీ వాడుకోవడం రాజకీయ పార్టీల నైచ్యం. చివరకు ఈ ప్రపంచ సంస్థలు, వాటి ఆసరాతో పార్టీలు ఏ భావోద్వేగభరిత పోస్టులు, ఎవరికి, ఏ మోతాదులో చేరాలో నిర్ణయించే స్థాయికి రావడం ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా ముప్పే! దీన్ని ఇకనైనా అడ్డు కోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా, సామాజిక సామరస్యాన్ని కాపాడడం కీలకం. అది మర్చిపోతే అధికారం దక్కినా, సమాజం చీలిపోతుంది. పదునైన కత్తితో ఆటలాడితే, చేయి కోసుకుంటుంది! -
బీజేపీతో శివసేన చెలిమి కుదిరేనా?
సాక్షి, ముంబై: మరాఠ్వాడ ముక్తి సంగ్రాం దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఔరంగాబాద్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఉదయం ఔరంగాబాద్‌లోని సిద్ధార్థ్ ఉద్యానవనంలో ఉన్న స్మృతి స్తంభం వద్ద సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధ్వజారోహణం చేసి అమరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగిస్తూ.. వేదికపై ఆసీనులైన ప్రస్తుత, మాజీ సహచరులందరూ ఏకతాటిపైకి వస్తే భవిష్యత్తులో సహచరులు అవుతారని పేర్కొన్నారు. ఆ సమయంలో వేదికపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రావ్‌సాహెబ్ ధన్వె, కేంద్ర సహాయ మంత్రి భాగవత్ కరాడ్ ఉన్నారు. వీరి సమక్షంలో ఉద్ధవ్ ఇలా వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తులో బీజేపీ, శివసేన మళ్లీ కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు అయింది. ఉద్ధవ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అనేక కథనాలకు తావిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పలువురు నాయకులు స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు నానాపటోలే పేర్కొన్నారు. ఆయనకు ముందు నుంచే హాస్యం, గమ్మతు చేసే అలవాటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని, వారిని కాస్త నవ్వించడానికి సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నానాపటోలే అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ ఉద్ధవ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడవద్దో తానెలా నిర్ణయిస్తానని పేర్కొన్నారు. ఉద్ధవ్ మనసులో ఏముందో చెప్పలేం కదా అన్నారు. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే వాటిపై మాత్రమే సీఎం తనతో చర్చిస్తారని అజిత్ పవార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నారు. మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పారు. బహుశా ఈ విషయం ఆయనకు గుర్తుకు వచ్చి ఉంటుందని, అందుకే మనసులోని మాటను అలా పైకి అని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతోందని అర్థమవుతోందన్నారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె స్పందిస్తూ ఉద్ధవ్ మనసులో ఏముందో చెప్పడానికి తాను జ్యోతిష్యున్ని కాదన్నారు. తమతో కలిసి రావాలనుకుంటే రేపటి సహచరులు అని సంబోధించాలన్నారు. కానీ, ఇలా భవిష్యత్తులో సహచరులవుతారని ఎందుకు అనాలని ప్రశ్నించారు. ఏదైన ఉంటే స్పష్టంగా, నిర్భయంగా బయటపెట్టాలని సూచించారు. ఇలా పరోక్షంగా నాన్చడం ఎందుకని వ్యాఖ్యానించారు. మొత్తానికి మరాఠ్వాడ ముక్తి సంగ్రాం దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. -
ప్రతిపక్షాల ఐక్యత గాలిలో దీపమేనా?
బీజేపీని ఇప్పటికిప్పుడు అధికారానికి దూరం చేయడానికి దేశం సిద్ధంగా లేదు. మోదీని ఎన్నికల్లో తిరస్కరించగలిగేంత స్థాయిలో అసంతృప్తి కూడా ప్రజల్లో ఇప్పటికైతే లేదు. యావద్దేశానికి నమ్మకం, దార్శనికతతో కూడిన సందేశం ఇచ్చే శక్తి ప్రతిపక్షానికీ లేదు. దేశభవిష్యత్తుకు హామీ ఇచ్చే నేతలు మనకు ఇప్పుడు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశానికి ఇప్పుడు విపక్షం కాదు... ప్రతిపక్షం అవసరం. విపక్షం అనేది అధికారం మీదే దృష్టి పెడుతుంది. అదే ప్రతిపక్షం జాతీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. విపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటుంది. ప్రతిపక్షం అన్ని కాలాల్లో శక్తిమంతంగా, విమర్శనాత్మకంగా ఉంటుంది. దేశంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ప్రస్తుతం అత్యంత బడాయితో కూడిన భావనగా ఉంటోంది కానీ ఎవరికి వారు ముందే సొంతం చేసుకుంటున్న నిరుపయోగకరమైన ఆలోచనగా అది మారిపోయింది. ప్రస్తుత భారత రాజ కీయాల సంధి దశలో ఇది ఒక సంక్లిష్టమైన ప్రశ్నగానూ, అదేసమయంలో ఒక నిరర్థకమైన అన్వేషణగానూ ఉంటోంది. ప్రత్యేకించి గడచిన మాసంలో ఇది రాజకీయ పార్టీలన్నింటికీ ఇష్టమైన సుగంధ పరిమళంగా మారిపోయింది. ప్రధానంగా పశ్చిమబెంగాల్లో బీజేపీని మమతా బెనర్జీ ఓడించడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుకు కొత్త తలుపులు తెరిచినట్లయింది. అన్ని రాజకీయ పార్టీల మధ్య చర్చలకు దారితీసిన ఒక ముచ్చటైన వ్యవహారంలా ఇది తయారైంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలనే ఏ ప్రాజెక్ట్ అయినా సరే.. 2019లో బీజేపీ లేదా దాని మిత్రపక్షాల కూటమికి దేశం మొత్తంలో 63 శాతం మంది ఓట్లు వేయని వాస్తవాన్నే ప్రాతిపదిక చేసుకోవలసి ఉంటుందని అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతిపక్ష ఐక్యత కోసం ప్రయత్నాలకు మరోసారి ఇప్పుడు ఊతం దొరికినట్లయింది. ప్రధానంగా 3 అంశాల పట్ల మనకు స్పష్టత ఉంటే తప్ప ప్రతిపక్ష ఐక్యత గురించి చర్చించడం అర్థరహితమే అవుతుంది. ప్రతి పక్షంగా ఎవరిని లెక్కిం చాలి? ఎలాంటి ఐక్యత గురించి మనం మాట్లాడుతున్నాం? ముఖ్యంగా మోదీ నేతృత్వంలోని బీజేపీతో తలపడటానికి ప్రతిపక్ష ఐక్యత అనేది మనకు అవసరమేనా?ఎలాంటి ప్రతిపక్షం అవసరం? ప్రధాని నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న, బీజేపీని దాని ప్రస్తుత భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఏ పార్టీనైనా, ఏ వ్యక్తినైనా ఒకటిగా చేయడమే ప్రతిపక్షం అనే భావన అసాధ్యమే కాదు.. అది వ్యతిరేక ఫలితాలను తీసుకొస్తుంది. పైగా ప్రతిపక్షం అనే విశాలమైన చట్రం పరిధిలో ఉన్న వ్యక్తులు, నేతలందరి అహాలను, ఆకాంక్షలను, ఎత్తుగడలను సామరస్యపూర్వకంగా ఐక్యపర్చడం అనేది మానవ సాధ్యం కాని పని. ఒకవేళ ఇలాంటి అద్భుతం సాధ్యపడినప్పటికీ, ఇలాంటి కూటమిని కలిపి ఉంచడం అనేది దాని రాజకీయ ప్రయోజనాలకు చాలా భారంగా పరి ణమిస్తుందన్నది స్పష్టం. మరోవైపున ఇలాంటి మొత్తం ప్రతిపక్ష ముఠాతో ఒంటరిగా పోరాడుతున్న అసహాయ వీరుడిగా మోదీ కీర్తి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎలాంటి ఐక్యతతో కూడిన కూటమి ఏర్పాడాలి అనే అంశాన్ని ప్రతిపక్షం చాలా తెలివిగా ఎంచుకోవలిసి ఉంది. కూటమిలో ప్రవేశించే ఇలాంటి నేతలు తమ డిమాండ్లను చర్చల్లో తీసుకువస్తారు కూడా. గట్టిగా ఓట్లు సాధించుకుని వచ్చే వారే ఈ కూటమిలో బలమైన అభ్యర్థులుగా ఉంటారనేది స్పష్టం. అంతకుమించి కాంగ్రెస్ లేకుండా, అనేకసార్లు ఇప్పటికే రాష్ట్రాల్లో బీజేపీని ఓడించిన ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు లేకుండా ఏర్పడే ప్రతిపక్ష కూటమి అర్థరహితంగానే ఉంటుంది. సామూహిక లక్ష్యం కోసం వ్యక్తిగత లేక పార్టీపరమైన ఆకాంక్షలను వదులుకోవడానికి సిద్ధపడటం మాత్రమే ఇలాంటి ఐక్యతకు గీటురాయిగా ఉంటుంది. అలాగే, ప్రతిపక్షం అనే భావనకు నిర్వచనం రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కారాదు. పార్టీలతో సంబంధంలేని వ్యక్తులే బీజేపీ ఆధిపత్య ధోరణికి నిజమైన ప్రతిపక్షంగా ఉంటున్నారన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. ఐక్యత అంటే ఏమిటి? ఒక్కసారికి మాత్రమే ఎన్నికల పొత్తును కుదుర్చుకోవడం అనే పరిధిని దాటి దీర్ఘకాలికంగా రాజకీయ ఐక్యతను కలిగి ఉండేలా ఐక్యతా భావాన్ని విస్తరింపజేయాలి. ప్రతిపక్ష ఐక్యత అంటే ఇంతవరకు సాధారణంగా ఉంటున్న అవగాహన ఏమిటంటే సీట్ల పంపకం, ఓట్లను రాబట్టడం కోసం బీజేపీయేతర పక్షాలు ఎన్నికలకు ముందస్తుగా కూటమి గట్టడం అని మాత్రమే. కానీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల విషయంలో ఇలాంటి ఐక్యత అసందర్భమైనదని మనం మరిచిపోతున్నాం. ఉదాహరణకు కేరళ, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలను చూడండి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ బలమైన శక్తిగా లేదు. పైగా బీజేపీయేతర శక్తుల మధ్య ఐక్యతకు వీటిలో కొన్ని రాష్ట్రాలు పిలుపునిస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. ఇంకా పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి బీజేపీయేతర పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రాలకు కూటమి భాగస్వామి అసలు అవసరం లేదు. మరోవైపున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం తలపడుతున్న మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్తాన్ వంటి అనేక రాష్ట్రాలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష ఐక్యత లేకపోవడం అనేది సమస్యగా లేదు. ప్రతిపక్షం లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో బీజేపీతో తలపడలేకపోతోంది. పైగా పొత్తు కుదుర్చుకోవడానికి బలమైన పార్టీలు కూడా ఇక్కడ దానికి అందుబాటులో లేవు. మొత్తం మీద చూస్తే కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలకు ముందస్తుగా కూటమి ఏర్పర్చే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. 200 కంటే ఎక్కువ లోక్‌సభా స్థానాలు కలిగి ఉన్న ఈ రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది కానీ, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఐక్యతకు ఒక నమూనాను ఏర్పర్చే స్థాయిని కలిగిలేవు. ఈ దశలో ఎన్నికల ఐక్యత కంటే రాజకీయ ఐక్యత అవసరం ఎక్కువగా ఉంటోంది. జాతీయ వ్యాప్తంగా ఎన్నికల కూటమికి పరి ణతి లేని, గ్రూప్ చర్చలు అవసరం లేదు. రాజకీయ ఐక్యతను ప్రదర్శించడం ఇప్పుడు ప్రతిపక్షానికి చాలా అవసరం. ప్రత్యేకించి బీజేపీతో ఇటీవలికాలంలో విసిగిపోయి ఉన్న ఓటర్లకు మోదీ వ్యతిరేక నేతలపై విశ్వాసం కూడా ఏర్పడుతోందంటే సందేహించాల్సిన పని లేదు. ప్రతిపక్ష నేతలు అర్థవంతంగా ఐక్యత కుదుర్చుకోగలరా అని మాత్రమే ఇలాంటి ఓటర్లు సందేహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మరింత మెరుగైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పర్చగలవా అని వీరు సందేహిస్తున్నారు. కనీసం కొంత కాలమైనా ప్రతిపక్షాలు కలిసి ఉంటాయా అని వీరి సందేహం. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరస్పరం ఆమోదించిన ఎజెండా, (కనీస ఉమ్మడి పథకాన్ని ఆదరాబాదరా ముందుకు తీసుకురావడం కాదు) మాత్రమే ప్రతిపక్షంలో విశ్వాసాన్ని పెంచగలదు. ఇది మాత్రమే తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి తాము పాలించడానికి ప్రత్నామ్నాయ శక్తిగా ఉండగలం అనే భరోసాను ఓటర్లకు అందిస్తుంది. ఒకటి మాత్రం నిజం.. బీజేపీని ఇప్పటికిప్పుడు అధికారానికి దూరం చేయడానికి దేశం సిద్ధంగా లేదు. మోదీని ఎన్నికల్లో తిరస్కరించగలిగేంత స్థాయిలో అసంతృప్తి కూడా ప్రజల్లో ఇప్పటికైతే లేదు. 2014లో దేశం ముందు తనకుతాను ప్రత్యామ్నాయంగా మోదీ ప్రదర్శించుకున్నంత స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మన ప్రతిపక్షానికి అలాంటి స్థాయి, శక్తి లేవ న్నది వాస్తవం. యావద్దేశానికి నమ్మకం, దార్శనికతతో కూడిన సందేశం ఇచ్చే శక్తి ప్రతిపక్షానికి ప్రస్తుతానికి లేదు. దేశభవిష్యత్తుకు హామీ ఇచ్చే నేతలు మనకు ఇప్పుడు అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశానికి ఇప్పుడు విపక్షం కాదు ప్రతిపక్షం అవసరం. విపక్షం అనేది అధికారం మీదే దృష్టి పెడుతుంది. అదే ప్రతిపక్షం జాతీయ ప్రయోజనానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. విపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటుంది. ప్రతిపక్షం అన్ని కాలాల్లో శక్తిమంతంగా ఉంటుంది. ప్రజలతో విస్తృత సంబంధాలను ఏర్పర్చుకోవడం, యాంత్రిక అవగాహనతో కొట్టుకుపోకుండా జాగ్రత్త పడటం మన ప్రతిపక్షాల లక్షణంగా ఉండాలి. దేశ ప్రజలు మొత్తంగా విశ్వసించే స్థాయికి ప్రతిపక్షం చేరుకున్నప్పుడు అలాంటి కూటమే ఎన్నికల ప్రయోజనాలకు ప్రాతిపదికగా ఉంటుంది. వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ సంస్థాపకులు (‘ది ప్రింట్’ సౌజన్యంతో) -
ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?
దేశవిభజనకు ముందు ప్రారంభమైన హిందూ–ముస్లింల మధ్య ఘర్షణ ఆ తర్వాతా కొనసాగడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు మతాల మధ్య ద్వేషాన్ని, పరస్పర అనుమానాలను పెంచి పోషించడంలో మితవాదపక్షం విజయవంతమైంది. ముస్లింలను ద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రించడమే కాకుండా వారిని లవ్ జిహాదీలుగా, గోవధ చేసేవారుగా, చివరకు కరోనాను వ్యాప్తి చెందించేవారుగా కూడా నిందిస్తూ వస్తున్నారు. ముస్లింలను విలన్లుగా చిత్రిస్తూ దుష్ప్రచారం చేయడమే కాకుండా వారిని కాల్చిచంపడానికి కూడా పోలీసులకు విశేషాధికారాలను కల్పిస్తున్నారు. పోలీసులు ముస్లింలను చంపేయడాన్ని సమాజం కూడా పట్టించుకోవడం లేదు. అమెరికా నల్లజాతి ప్రజల్లాగే భారత్‌లో ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా అనేది నేటి ప్రశ్న. తమిళనాడు పోలీసులు కస్టడీలో తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన పాశవిక ఘటన, పోలీస్ యంత్రాంగం విశేషాధికారాలను మరోసారి చర్చల్లోకి తీసుకొచ్చింది. మర్మాయవాలనుంచి రక్తం కారేలా చితకబాదడం, అవయవాలను కుళ్లబొడవడమే వీరి చావుకు కారణమైంది. మన పోలీసులు ఎంత క్రూరులో, నిర్దయాపరులో వీరి మరణం మరోసారి తేటతెల్లం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం షాపును తెరిచి ఉంచారనే సాకుతో తండ్రీకుమారులను పోలీసు స్టేష న్కు లాక్కొచ్చారు. వారు చేసింది సివిల్ అపరాధమే కానీ హింసాత్మక నేరం కాదు. ఈ ఉదంతం అమెరికాలోని జార్జి ఫ్లాయిడ్ కేసును తలపిస్తుంది. కానీ జార్జ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో మొదలైన ఉద్యమంలాంటిది భారత్‌లో కనిపించదేం? ఇక మహారాష్ట్ర ప్రభుత్వం 2003లో క్వాజా యూనస్‌ను కస్టడీలో చంపేసిన నలుగురు పోలీసులను ఈ వారమే తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంది. దీంతో యూనస్ తల్లి కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేసింది. ఆమె కుమారుడైన ఐటీ ఇంజనీరును పోలీసులు గతంలోనే అదుపులోకి తీసుకుని తిరిగి వెనక్కు పంపలేదు. అతడి మృతదేహాన్ని కూడా ఆమె ఇంతవరకు చూడలేకపోయింది. యూనస్ తమ కస్టడీనుంచి తప్పించుకున్నాడని పోలీసులు ప్రకటించినప్పటికీ, అతడిని లాకప్‌లో బట్టలూడదీసి గుండెపై, పొత్తికడుపుపై బెల్టుతో హింసించి మరీ చంపారని సీఐడీ విచారణలో తేలింది. ఈ ఉదంతంలో 14మంది పోలీసులపై విచారణ జరగగా నలుగురు పోలీసుల (వేజ్, తివారీ, నికమ్, దేశాయ్)పై మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం నేరారోపణ చేసింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగులో ఉండటం గమనార్హం. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలు ఉంచి తొక్కిపెట్టి శ్వేతజాతి పోలీసు అధికారి ఊపిరాడకుండా చేసి చంపిన ఉదంతంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నల్లజాతి ప్రజల ప్రాణాలూ విలువైనవే అంటూ సాగిన ఆ ఉద్యమానికి లండన్, ప్యారిస్ వంటి నగరాల్లోకూడా వేలాదిమంది మద్దతునిస్తూ ఊరోగింపు తీశారు. హత్యకు గురైన జార్జికి సంఘీభావంగా నిరసనకారులు మోకాలిమీద నిలబడ్డారు, నినాదాలు చేశారు. ఈ నిరసనలు ఎప్పుడో జరగాల్సి ఉండింది. ప్రతి సంవత్సరం అమెరికా పోలీసులు వెయ్యిమంది నల్ల జాతి ప్రజలను కాల్చి చంపుతున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ సంతతి యువతను నేరస్తులుగా చిత్రించారు. అమెరికాలోని జైళ్లు పూర్తిగా నల్ల జాతి పౌరులతో కిక్కిరిసిపోతుంటాయి. మరాఠీ జర్నలిస్టు సమర్ ఖదాస్ బకరా కళేబరం (బక్రియాచి బాడీ) అనే పేరిట యూనస్ కేసుపై ఒక కథనం రాశారు. ఒక ముస్లిం యువకుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషనులో కుర్చీకి కట్టేస్తారు. అతడి ముఖంపై టవల్ కప్పివుంచి దానిపై నీరు ధారగా పోస్తారు. ఆ మనిషి గిలగిలా కొట్టుకుంటూ వదిలేయమంటూ ప్రాధేయపడుతుంటాడు. నెమ్మదిగా అతడి వేడికోళ్లు ఆగిపోయి, శబ్దాలు నిలిచిపోతాయి. చివరకు నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో పోలీసులు అతడి చుట్టూ ఉండి జోకులేసుకుంటూ, తింటూ, టీవీ చూస్తూ గడిపేస్తుం టారు. యూనస్ ఖాన్ హత్యకు బాధ్యుడైన ఇన్స్పెక్టర్ సచిన్ వేజ్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు. ఇంతవరకు ఇతగాడు 63 మందిని చంపాడు. మరో 6 నెలల్లో రిటైర్ కాబోతున్నాడు. అతడికి పదవీవిరమణ ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అతగాడిని ఇటీవలే సర్వీసులోకి తీసుకుంది. అదే సమయంలో యూనస్ తల్లి గత 17 ఏళ్లుగా న్యాయం కోసం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. నిందితులైన పోలీసు అధికారులను ప్రోత్సహించే చరిత్ర మనది. 1992–93లో బాంబే దాడుల్లో అసమర్థంగా వ్యవహరించిన లేక నేరుగా హింసాత్మక చర్చలకు పాల్పడిన పోలీసులపై శ్రీకృష్ణ కమిషన్ చేసిన నేరారోపణలపై చర్య తీసుకోవడంతో వరుసగా ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయి. ఆ దాడుల్లో పోలీసులు ముస్లింలను అతి దగ్గరనుండి కాల్చేశారు. ముస్లిం కుటుంబాలను అల్లర్లకు పాల్పడుతున్న వారి వద్దకు పంపి వారి క్రూరహత్యకు కారణమయ్యారు. ఒక బేకరీలో తొమ్మిదిమందిని కాల్చి చంపిన ప్లటూన్‌కి నాయకత్వం వహించిన పోలీసు అధికారి త్యాగిని తర్వాత ముంబై పోలీసు కమిషనర్‌గా చేశారు. 1997లో ముంబైలోని రాంబాయి నగర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనకు నిరసన తెలుపుతున్న దళితులపై ఇన్స్పెక్టర్ మనోహర్ కడామ్ కాల్పులకు ఆదేశించి 13మందిని అక్కడికక్కడే చంపించేశాడు. కానీ అతగాడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడికి ప్రమోషన్ ఇచ్చి మరీ సర్వీసులో చేర్చుకున్నారు. పోలీసుల ఇలాంటి ప్రవర్తనలను వారు ఒత్తిడికి గురై చేస్తున్నవిగానూ, వారు కూడా మామూలు మనుషులే కదా అని చెబుతూ సమర్థిస్తున్నారు. ఈ సమర్థనే పోలీసులను ఒకవైపు మరింత క్రూరులుగానూ, అహంభావులుగానూ మార్చేస్తోంది. మరోవైపు వీరికే ఆయుధాలను కట్టబెడుతూ, ఏ జవాబుదారీతనం కూడా లేనివారిగా మారుస్తూ నిధులు కూడా సమకూరుస్తున్నారు. పైగా వారేం చేసినా వాటి వర్యవసానాలను అనుభవించకుండా విశేషాధికారాలను కట్టబెడుతున్నారు. ఈ విధంగా వారి బాధ్యతారహితమైన హింసాత్మక ప్రవర్తనకు చట్టపరంగా రక్షణ కల్పిస్తున్నారు. భారతదేశంలో పోలీసు వ్యవస్థను పాశవికంగా మలిచిన వ్యవస్థలకు బ్రిటిష్ రాజ్ కాలంలోనే బీజం పడింది. గిరిజనులు, దళితులు, ముస్లింలతో సహా కిందితరగతి భారతీయులను అదుపులో ఉంచడంకోసం వారిని నేరస్థులుగా ముద్రించి వలసప్రభుత్వం బుల్లెట్లను ప్రయోగించడమే కాకుండా, చిత్రహింసలు పెట్టేది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఇదే పోలీసు విభాగాలు భారత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కులీన వర్గాలకు సేవ చేయడాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. వీళ్లు నాటి పాశవికత్వాన్నికొనసాగిస్తూ శాస్త్రీయ పోలీసింగ్ విధానాలకు దూరమయ్యారు. ఇటీవలి రెండు సర్వేల ప్రకారం ముస్లింలు సహజంగానే నేర ప్రవృత్తి కలవారని 14 శాతం పోలీసులు.. ముస్లింలు ఏదో ఒకరకమైన నేరాలకు పాల్పడుతున్నట్లు 36 శాతం పోలీసులు భావిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛాందసవాద రాజకీయ పాలనా వ్యవస్థ తన రాజకీయ ప్రత్యర్థులకు గుణపాఠం నేర్పాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ రకమైన వివక్ష, దురభిప్రాయాలు మరింత బలం పుంజుకుంటున్నాయి. దేశవిభజనకు ముందు ప్రారంభమైన హిందూ–ముస్లింల మధ్య ఘర్షణ ఆ తర్వాతా కొనసాగడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు మతాల మధ్య ద్వేషాన్ని, పరస్పర అనుమానాలను పెంచి పోషించడంలో మితవాద పక్షం విజయవంతమైంది. ముస్లింలను ద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రించడమే కాకుండా వారిని లవ్ జిహాదీలుగా, గోవధ చేసేవారిగా, చివరకు కరోనాను వ్యాప్తి చెందించేవారుగా కూడా నిందిస్తూ వస్తున్నారు. ముస్లింలను విలన్లుగా చిత్రిస్తూ చేస్తూ వచ్చిన దుష్ప్రచారం కారణంగా వారిని కాల్చిచంపడానికి పోలీసులకు విశేషాధికారాలను కల్పిస్తున్నారు. అంతకుమించి పోలీసు బాసులను నాయకత్వపరంగా బాధ్యత వహించేలా చేసే వ్యవస్థ భారతదేశంలోలేదు. తన ప్లటూన్ లోని బలగాలు చేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కమాండర్‌ను బాధ్యుడిని చేయడం మన దేశంలో లేదు. లేదా సామాన్యులు పోలీసు అధికారిపై దావా వేసేందుకు కూడా చట్టం అనుమతించడం లేదు. వారిపై చార్జి షీటు ఉండదు. ఒకవేళ ప్రభుత్వమే ప్రాసిక్యూట్ చేసినా అది బలహీనంగా ఉంటుంది, విచారణ ఫలితంలో జాప్యం కొనసాగుతుంది. వీటన్నింటివల్ల పోలీసు పాశవితకు గురైన బాధితులకు ఈ దేశంలో న్యాయం ఒక ఎండమావిగానే మిగిలిపోతోంది. అమెరికాలో నల్లజాతి ప్రజలు కేవల సంస్కరణలు తమకువద్దని, మొత్తం పోలీసు విభాగాలనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జార్జి ఫ్లాయిడ్ స్మారకార్థం వారు ‘నాకు ఊపిరాడటం లేదు’ అంటూ వీధుల్లో నినాదాలు చేస్తున్నారు. ‘నా మెడపై మీరు కాలు వేసి తొక్కుతున్నప్పుడు నేను స్వేచ్ఛగా ఉండలేను. కదలలేను, ఉద్యోగం చేయలేను, కిరాయికి గదిని సంపాదించలేను, యూనివర్శిటీకి వెళ్లలేను, ప్రార్థించలేను. నేను పౌరుడినే కాదు. నా సొంత దేశంలో నేను స్వేచ్ఛగా గాలి పీల్చలేను’ అనే విస్తృతార్థం ఈ వాక్యంలో అంతర్లీనమై ఉంది. న్యాయం లభించకపోతే శాంతి కూడా లభించదు అనేది ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లోని వీధుల్లో నల్లజాతి ప్రజల మంత్రవాక్యంలాగా ధ్వనిస్తోంది. భారతీయ మెజారిటీ వర్గాలు, ప్రభుత్వాలు కూడా ఈ నినాదాన్ని పట్టించుకుంటాయని మనం ఆశించవచ్చా? వ్యాసకర్త: హుసేన్ దల్వాయి రాజ్యసభ మాజీ ఎంపీ, సమీనా దల్వాయి ప్రొఫెసర్, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ -
ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు!
కేజ్రీ... హ్యాట్రిక్ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... (చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం) పవన్ కుమార్ చామ్లింగ్ (ఎస్డీఎఫ్) రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24 ఏళ్ల 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్‌కుమార్ చామ్లింగ్ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్ బహుదూర్ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్ 1992లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు. సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్‌కుమార్‌పై ఒక క్రేజ్‌ని సృష్టించాయి. చామ్లింగ్ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు. సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. జ్యోతిబసు (సీపీఐ–ఎం) రాష్ట్రం: పశ్చిమ బెంగాల్, పదవీ కాలం: 23 ఏళ్ల 137 రోజులు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మాణిక్ సర్కార్ (సీపీఐ–ఎం) రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19 ఏళ్ల 363 రోజులు తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం మాణిక్ సర్కార్. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్ కుటుంబంలో జన్మించిన మాణిక్ సర్కార్ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్ సర్కార్ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది. బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్ సర్కార్ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్ సర్కార్ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) రాష్ట్రం: ఒడిశా, పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కాలంలో జనతాదళ్ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నవీన్ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15 ఏళ్ల 25 రోజులు ఇప్పుడు అందరం కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్. కాంగ్రెస్ డార్లింగ్‌గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. రమణ్ సింగ్ (బీజేపీ) రాష్ట్రం: ఛత్తీస్‌గఢ్, పదవీ కాలం: 15 ఏళ్ల 4 రోజులు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్‌తోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు రమణ్ సింగ్. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్ సింగ్‌ను ఆప్యాయంగా చావాల్ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్‌గఢ్ పరిపాలనను రమణీయంగా మార్చాయి. వ్యూహాత్మకంగా నక్సల్స్ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్ సింగ్‌పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్ సింగ్ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్ సింగ్ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. నరేంద్ర మోదీ (బీజేపీ) రాష్ట్రం: గుజరాత్, పదవీ కాలం: 12 ఏళ్ల 226 రోజులు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. గుజరాత్ మోడల్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్లో అత్యధికమన్న వాదనా ఉంది. -
ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికే కళంకం
భారతదేశంలో రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు చూసి అతి తక్కువ కాలంలో ఇన్ని రంగులు మార్చడం తమవల్ల కూడా కావట్లేదని ఊసరవెల్లులు సైతం చేతులెత్తేసేలా ఉన్నాయి. రాజ కీయ పదవులు,ప్రభుత్వ నిధులు పొందడానికి మాత్రమే గెలిచిన తమ స్థానాన్ని వినియోగించుకోవాలని తాపత్రయ పడుతున్నారు తప్ప, ప్రజలు ఏ పార్టీ మేనిఫెస్టో,విధి విధానాలకు వ్యతిరేకంగా తమను గెలిపించారు అనే కనీస ఆలోచన కూడా చేయడంలేదు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డెక్కినాక బోడి మల్లయ్య’ అన్నట్లుగా పార్టీ టికెట్ అందే వరకు ఒక లెక్క,పార్టీ టికెట్ దక్కించుకున్నాక ఒక లెక్క, ఆ పార్టీ విధి విధానాలను నమ్మి ఓటేసి గెలి పించాక మరో లెక్కలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తయారవ్వ డానికి కారణం ఏంటి? లోపం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందా? పార్టీలు ఫిరాయించే ఫిరాయింపుదారులలో ఉందా? వారిని ఎన్నుకున్న ప్రజలలో ఉందా? అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’లోనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆ చట్టమే ఫిరాయింపుదారుల పాలిట వరంలా మారింది. ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకుంటూ దానికి ‘ఆపరేషన్ ఆకర్ష్‘ లేదా ఇంకేదైనా పేరుతోనో ప్రత్యర్థి పార్టీలో ఉన్న అభ్యర్థులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాగి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసి రాచరిక పాలన దిశగా అడుగులు వేయడానికి మన బల హీనమైన చట్టాలు ఎలా ఉపయోగపడుతున్నాయనేది చర్చనీ యాంశం. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయానికొస్తే ఈ తతంగం ప్రస్తుతం మాత్రమే చోటు చేసుకున్నదేమీ కాదు, తమ ఎమ్మెల్యేలను గొర్రెల వలె కొంటున్నారని ప్రతిపక్షం అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంలో అంతగా పస లేదు ఎందుకంటే గతంలో 1990–95 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో పి. చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి అప్పటి బడా పార్టీ ముమ్మరంగా ఫిరాయింపుల ద్వారా ఎంపీలను చేర్చుకొని గద్దెనెక్కడమే కారణం. అలాగే 1991లో కూడా పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1995 నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులనే వాడుకోవడం గమనార్హం. కాబట్టి ఏ ఒక్క రాజ కీయ పార్టీకో ఈ ఫిరాయింపుల సంస్కృతిని ఆపాదించి మిగతా పార్టీలు సత్యహశ్చంద్రుడి పార్టీలుగా బిల్డప్ ఇవ్వాల్సిన పనిలేదు. ఒక వేళ ఏ పార్టీ అభ్యర్థి అయినా మరోపార్టీలోకి మారటం అనివార్యం అయితే తాను గెలిచి పొందిన పదవికి రాజీనామా చేసి బయటకు రావడం ప్రజాస్వామ్యాన్ని శోభిల్ల చేస్తుంది. వైఎస్సార్సీపీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధకాన్ని అమలు చేసే నిర్ణయాధికారం స్పీకర్‌కు మాత్రమే ఉండటం, స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే కాలాన్ని పొడిగించే సౌకర్యం కలిగి ఉండటం (ఆ కాలం కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కావచ్చు) ఈ చట్టం లోని లోపాలు. ఈ లోపాలవల్లే ప్రతిపక్షంలో ఉండి గెలిచిన అభ్యర్థి తన పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరి మంత్రి పదవులను సైతం నిర్వహించడం కళ్లారా చూస్తూనే ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక అధికారాన్ని స్పీకర్‌కు కాకుండా స్వతంత్ర సంస్థలకు లేదా ఎన్నికల సంఘానికి అప్పగించినట్లయితే ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదు. అంతే కాకుండా ఒక పార్టీకి చెందిన శాసన సభ్యులు 2/3 వంతు మంది వేరే పార్టీలో చేరితే దాన్ని సమర్థిస్తుండటం కూడా ఈ చట్టం నిర్వీర్యమవడానికి కారణమవుతోంది. కాబట్టి ఒక పార్టీ మేనిఫెస్టోపై ఎన్నికైన సభ్యుడు మరో మేనిఫెస్టో కలిగిన వేరొక పార్టీతో విలీనం కావడాన్ని కూడా రద్దు చేస్తేనే పార్టీ ఫిరాయింపుల నిరోధానికి పూర్తి స్థాయిలో కట్టుబడ్డట్టవుతుంది. ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీ కాకుండా నిజమైన ప్రజాభిప్రాయానికి ప్రతి బింబం కావాలంటే పార్టీ ఫిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది,లేదంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అపహాస్యమే అవుతుంది. శ్రీనివాస్ గుండోజు ‘ ఫోన్ : 99851 88429 -
బహుళ కూటములతో ఎవరికి లబ్ధి?
దేశవ్యాప్తంగా ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న బీజేపీ ఒకవైపున మరోవైపు వివిధ కూటముల ఏర్పాటుతో చీలిపోయి తలపడనున్న ప్రతిపక్షం మరోవైపుగా భారత రాజకీయాలు చీలిపోయాయి. బీజేపీని, కాంగ్రెస్‌ను తక్కువ స్థానాలకు పరిమితం చేస్తే తామే దేశరాజధానిలో పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే గతంలో దేవైగౌడ పాలనకు లాగా కాంగ్రెస్ మద్దతును వెలుపలనుంచి పొంది అధికారంలోకి వచ్చే పరిస్థితి పునరావృతం అయేటట్లు కనిపించడంలేదు. పైగా ప్రతిపక్షాల కూటమి లోని అనైక్యత, స్వార్థ రాజకీయాలు, తామే అసలైన పెళ్లి కొడుకులం అని భావించే పరిస్థితి ప్రధాని మోదీ స్థానాన్ని బద్దలు చేయలేవు. నేను రెండు దఫాలుగా పాతికేళ్లపాటు పని చేసిన పత్రికలో ఒక సుప్రసిద్ధమైన కథ రాజ్యమేలేది. ఆ పత్రిక దివంగత సంస్థాపకుడు రామ్‌నాథ్ గోయెంకాతో ముఖ్య స్నేహితుడొకరు ఒక సందర్భంలో మాట్లాడుతూ నీ సంపాదకుడి ఉద్యోగ కాంట్రాక్టును ఎందుకు పొడిగించ లేదని ప్రశ్నించారు. ‘‘ఆయన రుషితుల్యుడు లాంటివాడు. అలాంటి గొప్ప వ్యక్తిని నీవు ఎక్కువకాలం కొనసాగించకపోవడాన్ని నేను ఊహించలేకపోతున్నాను’’ అని ఆ స్నేహితుడు వ్యాఖ్యానించారు. ‘‘భాయీ, ఆయన సెయింట్ జార్జి వర్గీస్, కాదనను. కానీ నా పత్రిక మహాశివుడి పెళ్లి ఊరేగింపు (శివ్జీ కీ బారాత్) వంటిది. ఎవరికివారు తామే పెళ్లికొడుకులుగా భావించే అలాంటి ఊరేగింపును ఒక రుషి నిర్వహించడం చాలా కష్టం’’ అని ఆ పత్రికాధిపతి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పుడు మహాశివుడి పెళ్లి ఊరేగింపు అనేది తమకిష్టమైనది తిని తాగి, ఊగిపోతూ చిందులేస్తున్న నానావిధమైన ప్రాణులు, దయ్యాలు, ఆత్మలు, భూతాలు, మంత్రగత్తెలు వంటి సంతోషకరమైన గుంపునకు సంకేతంగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల వ్యవహారం దీనికి భిన్నంగా ఉందేమో దయచేసి నాకు చెప్పండి. అదే సమయంలో మహాశివుడి పెళ్లి ఊరేగింపు ఇప్పటికీ క్రమపద్ధతిలోనే ఉండటానికి కారణం లేకపోలేదు. పెళ్లికొడుకు కాబోతున్న మహా శివుడి స్థాయి, ప్రశ్నించడానికి వీలులేని నాయకత్వమే దానికి కారణం. దాని ఆధునిక రూపంలో ప్రతి ఊరేగింపూ ఒక పెళ్లివేడుకగా మారనుంది. ఇటీవల ముగిసిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన వ్యూహకర్తలు చిరునవ్వులు చిందిస్తున్నారంటే తమ నాయకత్వానికి భవిష్యత్తులోనూ ప్రమాదం లేదనిపించడమే కారణం. ఇప్పుడు విషయానికి వద్దాం. ఒకవైపున భారతదేశ అత్యంత ప్రముఖమైన నూతన శివ–భక్త పార్టీ అయిన కాంగ్రెస్ నేతృత్వంలో తగుమాత్రపు విశ్వసనీయతతో కూడిన నాలుగు పార్టీల కూటమి ఉంది. అవేమిటంటే శరద్ పవార్ ఎన్సీపీ, ఎంకె స్టాలిన్ డీఎంకే, లాలు ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, హెచ్డీ దేవేగౌడకు చెందిన జేడీ(ఎస్) పార్టీలు. ఎన్డీయేని మొదటి కూటమిగా భావిస్తే, దీన్ని రెండో కూటమిగా లెక్కిద్దాం. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు తమ సొంత ఘటబంధన్తో తమదైన మార్గంలో వెళుతున్నాయి. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఈ రెండు పార్టీలు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండింటిపైనా ఎన్నికల ప్రచారంలో దాడులకు తలపడనున్నాయి. మన సౌకర్యం కోసం దీన్ని మూడో ఫ్రంట్ అని పిలుద్దాం.ఇక మమతా బెనర్జీ బలప్రదర్శనతో మరొక కూటమి ప్రదర్శితమవుతోంది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీతో పాటు డీఎమ్‌కే, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వంటి పలు ప్రాంతీయ పార్టీలు భాగమై ఉన్నాయి. దీన్ని ఒకరకంగా నాలుగో కూటమిగా భావించవచ్చు.ఇకపోతే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూటములకు దేనికీ చెందకుండా ప్రత్యేకంగా ఉంటున్న కూటములు కూడా ఇప్పుడు రంగంలోకి వస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఇవి ముందుపీఠికి రావడానికి వేచి చూస్తున్నాయి. ఈ విధంగా ఐదో, ఆరో, ఏడో కూటమిలకు కూడా తావు ఉంటుంది. చివరిగా వామపక్షాలు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు వీటిని ఎవరూ కోరుకోవడం లేదు. ఇప్పుడు దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటి స్ధితి ఇదే. వీటిని పెళ్లికొడుకు లేని ఊరేగింపుగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌ను మినహాయిస్తే వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా 50 లోక్‌సభ స్థానాలను సాధించే పరిస్థితి లేదు. వీటి ఆశ ఏమిటంటే బీజేపీని 170 స్థానాలలోపు, కాంగ్రెస్‌ని 100 స్థానాలలోపు కుదించివేయదలచడమే. ఇది సాధ్యమైతే ఈ పార్టీలన్నీ ఒక కూటమిగా మారి కాంగ్రెస్ పార్టీనీ వెలుపల ఉండి మద్దతు తెలిపేలా చేస్తాయి. గతంలోనూ ఇలాంటి సినిమానూ మనం దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ రూపంలో చూశాం. ఇలాంటి స్థితి సాధ్యమైతే, కాంగ్రెసేతర పార్టీలు ఎంత చిన్నవిగా ఉన్నప్పటికీ లోక్ కల్యాణ్ మార్గ్‌లో పాదం మోపడానికి తమవంతుగా ప్రయత్నిస్తాయి. కారణం ఒకటే. మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం కంటే మీ జీవితం చివరలో మాజీ ప్రధానమంత్రిగా ఉండటం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కదా. 1996లో దివంగత సీపీఎం నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ ఇలాగే దేవేగౌడకు అలాంటి స్థానమే కల్పించారు. ఈరోజు ప్రతి పక్షం నేను కూడా దేవేగౌడను అవుతాను అని ఆశలు పెట్టుకుంటోంది. అయితే 1996లో సంభవించిన పరిణామాలను భారత్ 2019లో పునరావృతం చేసేలా కనిపించడం లేదు. దీనివల్లే బీజేపీలో మీరు ఆత్మవిశ్వాసంతోపాటు కాసిన్ని చిరునవ్వులను కూడా మనం చూడగలుగుతాం. ఈ వేసవిలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికలు ఇటీవలే ముగిసిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే తాము గత కొందకాలంగా ఉపఎన్నికల్లో పొందుతూ వస్తున్న వరాజయాలను ప్రతిబింబించవని మోదీ, ఆయన వ్యూహకర్తలు బలంగానే నమ్ముతున్నారు. పైగా, ప్రతిపక్షాల అనైక్యత, పరస్పరం ప్రయోజనాల మధ్య ఘర్షణ, వ్యక్తిగత శత్రుత్వాలు, వీటన్నిటికీ మించి మోదీ హఠావో అనే ఏకసూత్ర అజెండా కారణంగా భారత్ మరోసారి ఇందిరాగాంధీ వర్సెస్ ఇతరులు అనే 1971 నాటి పరిస్థితుల వైపునకు చేరబోతోందని బీజేపీ నమ్ముతోంది. అప్పట్లోనూ ఇందిరా గాంధీకి పరాజయం తప్పదని ఎన్నికల విశ్లేషకులు ప్రకటించారు కానీ ‘గరీబీ హఠావో’ కావాలా లేక ‘ఇందిరా హఠోవో’ కావాలా ఏదో ఒకటి తేల్చుకోండి అనే నినాదంతో ఇందిర నాటి ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్ లేక ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే మీరు ప్రజావ్యతిరేకతకు ఎదురొడ్డవచ్చు. మీ పార్టీలో ఉంటున్న ఇద్దరు లేక ముగ్గురు పోటీదారుల గురించి ఓటర్లకు స్పష్టంగా తెలుసు. పైగా వ్యక్తిగత విశ్వాసాల ప్రాతిపదికన ఓటర్లు పెద్దగా చీలిపోవడం కూడా తటస్థించదు. కానీ జాతీయ స్థాయిలో మేం మోదీకి వ్యతిరేకంగా పోరాడుతూనే, అదేసమయంలో మాలో మేముకూడా పోట్లాడుకుంటాం అంటే అది ప్రమాదకర ఫలితాలకు దారితీస్తుంది. ‘వీరిలో మీ కొత్త దేవేగౌడ ఎవరై ఉంటారు’ అంటూ మోదీ దాన్నే ఒక ఎన్నికల ప్రచారంగా మార్చేస్తారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలను తునాతునకలు చేస్తారు కూడా. ఈ 2019 సంవత్సరాన్ని బీజేపీ 1971తో పోలుస్తున్నా–నిజానికి రెండు కారణాలరీత్యా ఆ పార్టీకి అంతకన్నా మెరుగైనదని చెప్పవచ్చు. 1971 మాదిరిగా కాక ఈసారి అత్యధిక స్థానాలు ప్రాంతీయ పార్టీలకు దక్కుతాయి. వీటిలో ద్రవిడ పార్టీలు మొదలుకొని మాయావతి, ఆఖరికి మమత వరకూ చర్చించదగిన స్థాయిలో ఎవరికీ సైద్ధాంతిక జంజాటం లేదు. వారు కాంగ్రెస్, బీజేపీల్లో దేనితోనైనా భాగస్తులు కాగలరు లేదా వ్యతిరేకించగలరు. ఎవరితోనైనా జట్టు కట్టగలరు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీకైనా మొత్తం 543 స్థానాల్లో 350 అవసరమవు తాయి. 300 కన్నా తక్కువ వస్తే కొత్త అవకాశాల అన్వేషణ మొదలవు తుంది. 275 కన్నా తగ్గితే ప్రాంతీయ పార్టీల శక్తి రెండింతలవుతుంది. అప్పుడు ఆ పక్షాలు బీజేపీతో కూడా జత కట్టగలవు.రెండు–1971లో, ప్రత్యేకించి హిందీ రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రతి పక్షాలన్నీ కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతపై మాత్రమే ఒకటి కాగలిగేవి. ఇవాళ బీజేపీ ఇజంపై గట్టి వ్యతిరేకత ఉందన్న మాట వాస్తవమే అయినా దానికి పోటీగా కాంగ్రెస్ వ్యతిరేకత కూడా నిలిచి ఉందని మరిచిపో రాదు. ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే 50లోపు స్థానాలుండి కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కలలుగనే నేతలకు అది మంచి అవకాశమవుతుంది. దీన్ని బలంగా చెబుతున్నవారు తెలం గాణ ముఖ్యమంత్రి కేసీఆర్.ఇప్పుడు ఈ లెక్కలు మీకొక విషయాన్ని చెబుతాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు కలిసి 250 కన్నా తక్కువ వచ్చినా మిగిలిన పార్టీలు 272కి చేరుకునే అవకాశం లేదు. వారికి ఖచ్చితంగా ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి బయటినుంచి మద్దతివ్వాల్సిందే. దానర్థం– వీపీ సింగ్, చంద్రశేఖర్, హెచ్డీ దేవెగౌడ తరహాలో రోజుకూలీ ప్రధానులు మళ్లీ వస్తారన్నమాట. మోదీ, రాహుల్ మినహా మరే నాయకుడూ 50 స్థానాలకు మించి సంపాదించలేరు గనుక బీజేపీయేతర, కాంగ్రెసేతర నాయకుడెవరినీ ఎవరూ ఏడాదికి మించి భరించే అవకాశం లేదు. అలాంటి ప్రభుత్వం అల్లరల్లరిగా సాగే ‘శివ్జీ కీ బారాత్’ తరహాలోనే ఉంటుంది. నాయకుడు లేదా పెళ్లి కొడుకు లేని ఆ ఏర్పాటు చాలా త్వరగానే ముగిసిపోతుంది. గుర్తుంచుకోండి, రుషి తుల్యుడు జయ ప్రకాశ్ నారాయణ్‌లాంటి నాయకుడే 1979లో ఈమాదిరి గుంపును ఎన్నాళ్లో ఒకటిగా ఉంచలేకపోయారు. అంతిమంగా, ప్రతిపక్షం ఇలాగే నాయకుడు లేని రూపంలోనే ఎన్నికలకు వెళతామని పట్టుబట్టిందనుకోండి. అప్పుడు మోదీకి ఈ స్క్రిప్టునే పెద్దగా ఓటర్లకు చదివి వినిపిస్తే సరిపోతుంది. ఓటర్లు మోదీ మాటలను చాలావరకు శ్రద్ధగా వింటారు కూడా. ఒకవేళ అలా జరగకుండా ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలల అద్భుతాన్ని పునరావృతం చేసిన పక్షంలో, మరో 50 ఏళ్లపాటు బీజేపీనే అధికారంలో ఉంటుందనిగొప్పగా చెప్పుకునే అవకాశాన్ని అమిత్ షాకు మరోసారి ఇస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
భవిష్యత్‌ను నిర్ణయించేది మహిళా ఓటర్లే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో మహిళా ఓటర్ల పాత్ర చరిత్రాత్మక దశకు చేరుకుంది. 1990వ దశకంలో ఎన్నికల్లో ఓటేసిన పురుషులకంటే మహిళల సంఖ్య పది శాతానికి పైగా తక్కువగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య 65.5 శాతానికి చేరుకుంది. అదే ఎన్నికల్లో 67 శాతం పురుషులు ఓటేశారు. అంటే పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల సంఖ్య ఒకటిన్నర శాతం మాత్రమే తక్కువ. ఏకంగా దేశంలోని 87 లోక్‌సభ నియోజక వర్గాల్లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్టర్ చేసుకున్న పురుషుల ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్లే కంటే ఎక్కువే. అయినప్పటికీ రిజిస్టర్ చేసుకున్న మహిళల్లోనే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అంటే ఓ ప్రభుత్వాన్ని, ఓ రాజకీయ పార్టీ భవిష్యత్తును శాసించే దశకు వారు చేరుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా మహిళలే శాశిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1994 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ సరళి చూస్తే పురుషులకన్నా మహిళలే కాంగ్రెస్‌వైపు ఎక్కువ మొగ్గు చూపారు. కాంగ్రెస్ కన్నా బీజేపీకి రెండు, మూడు శాతం తక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు. అంతర్జాతీయంగా కూడా మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికులకన్నా డెమోక్రట్లకే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. 2016 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి ఓటేసిన వారిలో 56 శాతం మంది మహిళలు ఉండగా, 44 శాతం మంది మహిళలు ఉన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీకన్నా కన్జర్వేటివ్ పార్టీకే మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి. దేశంలో లోక్‌నీతి జరిపిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి ఒకే రీతిన అంటే, 19 శాతం పురుషులు, 19 శాతం పురుషులు ఓట్లు వేశారు. అదే బీజేపీకి 33 శాతం మంది పురుషులు ఓటేయగా, 29 శాతం మంది మహిళలు ఓటేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌కు స్త్రీ, పురుషులు సమానంగా వేయగా, ప్రతి చోటా బీజేపీకి పురుషులకన్నా స్త్రీలు తక్కువ సంఖ్యలో ఓటేశారు. కొన్ని రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల ఓటింగ్ సరళిలో కూడా ఎంతో వ్యత్యాసం కనిపించింది. అస్సాం రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయగా, ఎక్కువ మంది పురుషులు బీజేపీకి ఓటేశారు. కర్ణాటకలో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని కోరుకోగా పురుషులు బీజేపీ పార్టీని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలనే స్త్రీ, పురుషులు కోరుకున్నారు. ఈ రెండు పార్టీలకే మహిళలు కూడా ఎక్కువ ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 15 శాతం మంది పురుషులు ఓటేయగా, ఐదు శాతం మంది మహిళలు మాత్రమే ఓటేశారు. గుజరాత్లో మాత్రం స్త్రీ, పురుషులు దాదాపు సమానంగా బీజేపీకే ఓటేశారు. తెలంగాణలో కే. చంద్రశేఖర రావు, బీహార్‌లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్లోలో శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌లు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడిఎంకే (జయలలిత) పార్టీలు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించాయి. అలాగే 2014 అనంతరం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సరళిని లోక్‌నీతి సంస్థ పరిశీలించగా మహిళా ఓటర్లే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెల్సింది. మహిళా నాయకత్వంలోని అన్ని పార్టీలకు పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. 2017, నవంబర్‌లో ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ జరిపిన అధ్యయనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పురుషులకన్నా స్త్రీల మద్దతు కాస్త తగ్గింది. మతమరమైన అంశాలను మోదీ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారన్నదే వారి అభియోగం. కానీ 2018 మే నెలలో లోక్‌నీతి జరిపిన అధ్యయనంలో 2014 ఎన్నికలతోపోలిస్తే బీజేపీకి మహిళల మద్దతు కొద్దిగా పెరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నమాట. -
అంబేడ్కర్ ఓ ఐకాన్ మాత్రమే..!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రాజకీయాల్లో నేడు డాక్టర్ అంబేడ్కర్ అత్యంత ప్రజాదరణ కలిగిన చారిత్రక పురుషుడు. ప్రతి పార్టీ ఎన్నికల సందర్భంగానో, జయంతి, వర్ధంతుల సందర్భంగానో ఆయన ఉపన్యాసాల గురించి, భావాల గురించి మాట్లాడుతుంది. ‘సమాజంలో ఓ వెనకబడిన వర్గం నుంచి వచ్చిన నేను ఈ రోజున ప్రధాన మంత్రి అయ్యానంటే అందుకు కారణం అంబేడ్కర్’ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు సమీపించినా ఆయన అంబేడ్కర్ పేరును తలవకుండా ఉండలేరు. ఆయన దేశంలో డిజిటల్ లావాదేవీల కోసం ‘భీమ్’ యాప్‌ను తీసుకొచ్చారు. భీమ్ అంటే మనలో ఎక్కువ మందికి దళితుల నినాదం ‘జైభీమ్’లోని అంబేడ్కర్ మనకు స్ఫురించరు. మహాభారతంలోని భీముడు మనకు స్ఫురిస్తారు. అది వేరే విషయం అనుకోండి! 1980వ దశకం వరకు కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన స్రవంతిలోని ఏ రాజకీయ పార్టీ అంబేడ్కర్ పేరును తలవలేదు. ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తావించలేదు. బీజేపీ మొదటి నుంచి ఆయనకు మరీ దూరంగా ఉంటూ వచ్చింది. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం జయంతి, వర్ధంతులకు పూలదండలు వేసి మొక్కుబడికి నివాళులర్పించేవారు. 1990 దశకం వరకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అంబేడ్కర్‌ను పట్టించుకోలేదని మేధావి, విద్యావంతుడు కంచ ఐలయ్య పేర్కొన్నారు. 1978లో ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ఏర్పాటుతో మరోసారి అంబేడ్కర్ ప్రజల దృష్టికి వచ్చారు. ఈ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాప నాయకుల్లో ఒకరైన కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడంతో అంబేడ్కర్ పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాన్షీరామ్ శిష్యురాలు మాయావతి హయాంలో అంబేడ్కర్ పేరు మారుమోగిపోయింది. దళితుల ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్‌ను ఎత్తుకోవడంతో ఆయన దళితులకు ఓ ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు అంబేడ్కర్ అంటే అసలు పడేది కాదు కనుక స్వాతంత్య్ర రాజకీయాల్లో ఆయన వివాదాస్పద నాయకుడిగానే చెలామణి అయ్యారు. గాంధీజీని తాను కనీసం వ్యక్తిగత నైతిక ప్రమాణాల ప్రాతిపదికగా కూడా మహాత్ముడిగా గుర్తించనని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేడ్కర్ వ్యాఖ్యానించడం పట్ల నాడు గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నొచ్చుకున్నారు. బ్రిటీష్ ఇండియాలో ఎన్నికలు రెండు రకాలుగా ఉండాలని, దళితులకు ప్రత్యేక ఓటింగ్ విధానం ఉండాలని, వారు దళితులను మాత్రమే తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారంటూ అంబేడ్కర్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గాంధీజీ బెదిరించడంతో ఆ ప్రతిపాదనను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 1956లో అంబేడ్కర్ మరణించినప్పుడు జవహరలాల్ నెహ్రూ తన సంతాప సందేశంలో ‘వెరీ కాంట్రవర్శియల్ ఫిగర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ (భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నాయకుడు)’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఆత్మకథను రాసిన ధనుంజయ్ కీర్ ‘మోస్ట్ హేటెడ్ మేన్ ఇన్ ఇండియా (భారత్‌లో ఎంతో వ్యతిరేకత కలిగిన నాయకుడు)’గా వర్ణించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో విసిగిపోయిన అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీలను ఏర్పాటు చేసినా ఆయనకు ఓట్లు రాలలేదు. నేడు దళితుల ఓట్ల కోసం మాత్రం ప్రతి పార్టీ ఆయన పేరును నమ్ముకుంటోంది. అయినప్పటికీ అంబేడ్కర్కుగానీ, ఆయన రచనలకుగానీ నిజమైన గుర్తింపు రావడం లేదు. ఆయన్ని ఓట్లు కురిపించే ఓ ‘ఐకాన్’గానే చూస్తున్నారు. -
ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్ ఇవ్వగలరా?: వర్మ
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ రచయితలకు ఓ సవాల్ విసిరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు మించిన స్క్రిప్ట్ అందిచగలరా అని ప్రశ్నించారు. ఓ వైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీల సీబీఐ విచారణ, కాంగ్రెస్ అవినీతి, బీజేపీ ప్రతీకారం, మనీ లాండరింగ్, నీరవ్ మోదీ బ్యాంకుల కుంభకోణం, ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. వీటన్నిటి కన్నా బలమైన స్క్రిప్ట్‌తో గొప్ప బాలీవుడ్ రచయితలు ముందుకు రాగలారా? నాకు సందేహమే అని ట్వీట్లో పేర్కొన్నాడు. వర్మ చేసిన ఈ సెటైరిక్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Chidambaram, Karti his Son , Congress Corruption,BJP Vendetta,Money laundering , Nirav Modi , bank scams,Indrani mukherjea and Murder..ALL IN ONE.. Whoaaaa I doubt if the best of Bollywood script writers can come up with a more wilder script than this 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 2 March 2018 -
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన తొలి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించిన దేశంలోని అతి పెద్ద హిందీ పత్రిక ‘దైనిక్ జాగరన్’పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిగతా విడతల పోలింగ్‌పై నిజంగా ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? నిజమయ్యేది ఉంటే గతంలో పలు పత్రికలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పరస్పరం విరుద్ధంగా ఎందుకున్నాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించడం సమంజసమేనా? పలు విడుతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికలు కమిషన్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తున్నదో తెలిసి ఓటరు తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీవైపు మొగ్గుచూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపుకోసం చివరి నిమిషంలో ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే 2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకరావడం ద్వారా ఎన్నికల ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించ కూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధం తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించడమంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని హరించడమేనని మొదటి నుంచి మీడియా ఆరోపిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించవచ్చని, ఓటరు కూడా తప్పుదోవ పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి, మరో పార్టీకి ఓటేసునట్లు చెప్పవచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం మవుతున్నాయి. ఇందులో ఏదీ జరిగినా తదుపరి విడత పోలింగ్‌ల్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం అందరిపైన ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు. ఓపీనియన్ పోల్స్‌లో యూపీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలకు భిన్నంగా దైనిక్ జాగరన్ పత్రిక వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. అంటే తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పత్రిక తర్వాత విడతల ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూపించి ఉండాలి. లేదా అండర్ కరంట్‌గా ఓ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటున్న ఓటర్లు ఎగ్జిట్ పోల్స్‌నే తప్పుదారి పట్టించి ఉండాలి. చివరకు ఏ ఫలితమొచ్చినా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుంది. -
ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ
-
ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ
పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మొదటినుంచీ నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గట్టిగా సవాల్చేస్తున్న మమతాబెనర్జీ తాజాగా భీకర ప్రతిజ్ఞ చేశారు. ‘నేను బతికినా, చనిపోయినా పర్వాలేదు కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రం భారత రాజకీయాల నుంచి తొలగించి పారేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ ఆమె పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై మొదటినుంచి మోదీ ప్రభుత్వంపై మమత విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాల మధ్య ఐకత్య లేకపోవడం, గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలబడకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. జాతీయ అంశాలపై తరచూగా స్పందిస్తున్న మమత బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలోనూ మమత మొదట్లో చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై భారత్ బంద్ పిలుపు విషయంలో ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎవరికివారే అన్నట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మమత సోమవారం మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బతికినా, చనిపోయినా పర్లేదు కానీ.. మోదీని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేశారు. -
మతం పేరుతో ఓట్లడగటం నేరమా?
కులం, మతం కీలక రాజకీయాంశాలుగా మారాయని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాన్ని ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యగా భావించవచ్చా? అని బుధవారం ప్రశ్నించింది. ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగటాన్ని నేరంగా పరిగణించటం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలో అక్రమ కార్యకలాపాలపై చర్యలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్ పరిధిపై చర్చ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. నన్ను గెలిపిస్తే మీ అభ్యున్నతికి పాటుపడతాను. నాకు ఓటేయండని అడిగితే తప్పేంటి?’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజంతా జరిగిన చర్చలో మంగళవారం నాటి ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అనే విషయాన్ని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అయితే ‘హిందుత్వ’ అంశాన్ని సుప్రీంకోర్టు తర్వాతైనా మరోసారి చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. భారతీయ శిక్ష్మా స్మృతిలోని 153 (ఏ)ను ఉదహరిస్తూ.. మతంపేరుతో ఓట్లు అడగటం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించే వ్యక్తి నేర విచారణకు అర్హుడని సిబల్ కోర్టుకు తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లను రాబట్టుకోవటంలో రాజకీయనేతలు ముదిరిపోయారని.. ఈ పద్ధతికి బ్రేక్ వేయటం తక్షణ అవసరమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలువురి వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఆల్ ఫ్రీ
కవర్ స్టోరీ సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా... హామీలు నిలబెట్టుకోకపోతే... ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ఎన్నికల రుతువు వస్తే చాలు, భారత రాజకీయ వినీలాకాశం నిండా వాగ్దానాల మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. వాటిలో కురిసేవి కొన్నే. అవైనా చిరుజల్లులతో సరిపెట్టడం పరిపాటి. ఇంతవరకు భారతదేశం ఎన్నో ఎన్నికలు చూసింది. మరెన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అసలు ఎన్నికల కోసమే పురుడు పోసుకునే రాజకీయ పార్టీలు ఉన్న దేశంలో, అవి విడుదల చేసే మ్యానిఫెస్టోలకీ, వాటిలో ఆదరాబాదరా వండి వార్చిన వాగ్దానాలకీ ఉన్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవడం కష్టం కాదు. చాలా రాజకీయ పార్టీలకు మ్యానిఫెస్టోల తయారీ ఓ ఎన్నికల తంతు. తరువాత వాటి చిరునామా చెత్తబుట్టే. ఎక్కువ పార్టీలు; జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కూడా కావచ్చు- చాలా వరకు అవి కురిపించే వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రహసనం. అధికార పార్టీల ఎన్నికల వాగ్దాన భంగం ఒక్కటే భారతంలో శాశ్వత సత్యం. ప్రజాప్రతినిధుల ఎంపిక స్వేచ్ఛని ఫ్రీబీలతో కొనుగోలు చేయడం ఒక వాస్తవం. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఈ సత్యమే పరిఢవిల్లుతోంది. ఇంతకీ అధికారంలోకి వచ్చి తీరాలన్న తపనలో మన రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు ఎలా ఉంటున్నాయి? అవన్నీ గగన పుష్పాలను తలపింపచేస్తున్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ ఒక వాగ్దానం చేశారు. పార్టీ గెలిచి, ఆయన ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తే ‘వంద రోజులలో’ విదేశాలలో ఉన్న యావత్తు నల్లధనాన్ని భారతదేశానికి తరలించగలమన్నదే ఆ వాగ్దానం సారాంశం. దానిని అమలు చేయడం అంత సులభం కాదని మోదీకి తెలియనిది కాదు. అయినా అక్కడితో ఆగకుండా ఆ డబ్బు రప్పించి, భారతీయుల బ్యాంకు ఖాతాలలో తలా ఒక పదిహేను లక్షల వంతున జమ చేస్తానని ప్రకటించారు. దీనితో తాజాగా రాజస్థాన్‌కి చెందిన కన్హయ్‌లాల్ అనే పౌరుడు, తన బ్యాంకు ఖాతాలో సదరు పదిహేను లక్షలు ఎప్పుడు జమ అవుతాయో తెలియచేయవలసిందంటూ సమాచార హక్కు చట్టం కింద కోరడం కూడా జరిగిపోయింది. దీనికి సమాధానం ఏమిటి? ప్రధాని ఏమని వివరణ ఇస్తారు? ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఇది చాలు, ఎన్నికల వాగ్దానాలలోని డొల్లతనం ఎలాంటిదో తెలియడానికి! ఇక ఫ్రీబీల సంగతి చెప్పేదేముంది? గడచిన ఎన్నికలలో గోరక్షణ హామీ బీజేపీ ప్రధానాస్త్రాలలో, ప్రచారాస్త్రాలలో ఒకటి. నిజానికి దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో గోవధ నిషేధం చిరకాలంగా ఉంది. మరి ఇలాంటి హామీ ఇవ్వడంలో పరమార్థం ఏమిటి? వీరంతా వాగ్దానకర్ణులే... నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా తక్కువేమీ కాదు. తమిళనాట ద్రవిడ పార్టీల వికృత దాతృత్వంతో పోటీపడుతూ ఆయన వాగ్దానాల కుంభవృష్టి కురిపించారు. వీటి గురించి తరువాత చర్చించుకుందాం. ‘మొన్నటి శాసనసభ ఎన్నికలలో మీ నాయకత్వంలోని అన్నాడీఎంకే పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన కోడ్‌కు అతీతంగా ఉంది, అందులో వివేచనే లేదు.’ ఇది అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మీద ఆమె ఆగర్భశత్రువు కరుణానిధి చేసిన విమర్శలా కనిపిస్తుంది. కానీ కాదు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆగస్టు 30న జారీ చేసిన తాఖీదులో మాటలే ఇవి. అయితే ఈ ఘాటు హెచ్చరికకి కరుణానిధి ఎగిరి గంతేసే వీలు లేకపోయింది. ఆయన చక్రాల కుర్చీకే పరిమితం కావడం ఇందుకు కారణం కాదు. ‘మ్యానిఫెస్టోల తయారీలో ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనావళి అంటూ ఒకటి ఉంది. ఆ సంగతి మీకు గుర్తు లేదా?’ అంటూ డీఎంకే నేతకు అంతకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం అక్షింతలు వేసింది. తమిళనాడు అంటే ఫ్రీబీ (తాయిలాలకి) కళకి నిలయమని 2006 ఎన్నికల సమయంలోనే కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంది. అసలు ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ పార్టీలూ, వాటి నేతల నోటి నుంచీ వెల్లువెత్తే వాగ్దానాల పరవళ్లను, మ్యానిఫెస్టోలలో కనిపించే హామీల సునామీలను గమనిస్తే ఎవరికైనా గుండె చెరువైపోతుంది. దేశం పేరునే మారుస్తానన్నాడు... తమిళనాడులోనే ఎండీఎంకే అనే పార్టీ ఉంది. వైకో దీని అధినాయకుడు. సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. ఆయన పార్టీ ఇచ్చిన వాగ్దానం- భారతదేశం పేరును ‘ది యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ భారత్’గా మార్చడం. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, ఎప్పుడూ ఏదో ఒక పెద్ద పార్టీకి తోకలా ఉండే పార్టీ ఇలాంటి వాగ్దానం ఇచ్చింది. దేశం పేరు మార్పు ఒక చిన్న రాజకీయ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దర్శనమివ్వడం మన ప్రజాస్వామ్యం చేసుకున్న ప్రారబ్ధం కాక మరేమిటి? వాగ్దానాల అమలుకు వనరులెక్కడివి? ఈ వాగ్దానాల ధాటికి తట్టుకోలేక ఒక ఐఏఎస్ అధికారి, మరో ముగ్గురు కలసి ఎన్నికల సంఘానికి మొర పెట్టుకున్నారు. దీని ఫలితంగానే అన్నాడీఎంకే మ్యానిఫెస్టోలో హేతుబద్ధత ఏమైనా ఉందా? అని ఎన్నికల సంఘం ప్రశ్నించవలసివచ్చింది. వందల కోట్లు కుమ్మరిస్తే తప్ప నెరవేర్చడం సాధ్యం కాని ఈ వాగ్దానాల అమలుకు వనరులు ఎక్కడివో ఎందుకు చెప్పరు అని నిలదీసింది. ‘సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాం’, ‘ ఆది ద్రవిడ, గిరిజన సంక్షేమ వసతి గృహాలకి వాషింగ్ మెషీన్లు, ఇడ్లీ కుక్కర్లు, స్టీమ్ బాయిలర్లు ఉచితంగా ఇస్తాం’, ‘సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ చేనేత, కోఆప్టెక్స్ దుస్తులు కొనుక్కోవడానికి రూ. 500 చెక్కుల రూపేణా బహూకరిస్తాం’, ‘పేద మధ్య తరగతి ప్రజలందరికీ అమ్మ బ్యాంకింగ్ కార్డులు జారీ చేస్తాం’- ఇలా ఉన్నాయి అన్నాడీఎంకే వాగ్దానాలు. ఇక విపక్ష డీఎంకే ప్రైవేటు రంగంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను సమర్థిస్తామని ప్రకటించింది. విదేశాలలో తమిళులు అధికంగా ఉంటే ‘అర్హులైన’ తమిళులనే అక్కడ భారత ప్రతినిధులుగా నియమిస్తామని హామీ ఇచ్చింది. కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు ఇస్తామని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు పోటీ పడి చెప్పినా, ‘అమ్మ’ అదనంగా రాష్ట్ర ఓటర్లందరికీ (దాదాపు రెండు కోట్లు) సెల్ఫోన్లు అనుగ్రహిస్తున్నానని వరం ఇచ్చారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతో పాటు, నిరంతరాయంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పారామె. ఉపయోగించుకుంటే వైఫై కూడా ఇస్తానన్నారు. వధువులకు ఉచిత తాళిబొట్లు, ఉద్యోగినులు ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే యాభైశాతం రాయితీ కల్పించడం వంటి హామీలు కూడా ఆమె ఇచ్చారు. డీఎండీకే అనే పార్టీకి విజయకాంత్ అనే సినీనటుడు నాయకుడు. ఈయన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తానని ఎలుగెత్తి చాటాడు. అంతేనా! రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది రైతులను ఎంపిక చేసి, వారికి విదేశాలలో శిక్షణ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు. దేశం పేరు మారుస్తానన్నఎండీఎంకే, ఇంకో అడుగు ముందుకు వేసి ఎల్టీటీఈ మీద నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చేసింది. ఈ తాయిలాల పందేరం మీద ఎస్. సుబ్రహ్మణ్య బాలాజీ అనే తమిళుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యం మీద అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్వరంతో చేసిన వ్యాఖ్య గమనార్హం. ఇదీ ఆ వ్యాఖ్య - ‘ఈ తాయిలాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ మూలాలను ధ్వంసం చేస్తాయి.’ ప్రభుత్వం కలర్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సర్ గ్రైండర్లు ఇస్తుందంటే అర్థం ఏమిటి? ప్రస్తుత చట్టాల మేరకైనా ఇదంతా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమేనని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. హామీలివ్వడం పార్టీల హక్కు... అయితే రాజకీయ పక్షాలు గుప్పించే హామీలను మోసుకొచ్చే మ్యానిఫెస్టోలను కట్టడి చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 సెక్షన్ ప్రకారం మ్యానిఫెస్టోల ద్వారా హామీలు ఇచ్చే హక్కు రాజకీయ పార్టీలకు రాజ్యాంగ నిర్మాతలు కట్టబెట్టారు. దానిని ప్రస్తుత తరంలో చాలామంది నేతలు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. మ్యానిఫెస్టోల అసలు ఉద్దేశం- ఓటరుని మభ్యపెట్టడం కాదు. పార్టీల ఆలోచనా ధోరణిని ఆవిష్కరించడం. కానీ అలాంటి ఉత్తమ సంప్రదాయానికి చాలా రాజకీయ పార్టీలు ఏనాడో స్వస్తి పలికాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ధోరణిని అదుపు చేసేందుకు నిబంధనలను రూపొందించవలసిందిగా సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఇది ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం. కానీ ఇలాంటి హితవచనాలను సానుకూల దృష్టితో చూడగలిగిన నాయకులు ఎందరు? చాలామంది నేతల గత చరిత్రను చూసినా, గతంలో లేదా ఇప్పుడు అధికారంలో ఉండగా వారు చూపిన, చూపుతున్న అహంకారం, లీలల గురించి తలుచుకున్నా వారికి హితవచనాల పట్ల, ప్రజాస్వామ్య శ్రేయస్సు పట్ల గౌరవం ఉందని భావించడం దండగ. బాబుగారి వాగ్దానశూరత్వం... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటివారి విషయంలో ఇది నిజం. రియో ఒలింపిక్స్‌లో రజతపతకం గెలుచుకు వచ్చిన సింధు సత్కార సభలో ఆయన ఏమన్నారు? మనం కూడా త్వరలో కొత్త రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిద్దాం అంటూ ఒక బీభత్సమైన వాగ్దానాన్ని సంధించారాయన. ఇది ఎన్నికల వాగ్దానానికి మించిన వాగ్దానం. ఒలింపిక్స్ క్రీడావేదికను ఎవరు నిర్ధారిస్తారు? ఎంతకాలం ముందు నుంచి అందుకు కసరత్తు జరుగుతుంది? ఇవి తెలియని ముఖ్యమంత్రి ఉచితంగా ఆ హామీ పడేశారు. ఒలింపిక్స్ సంగతెలా ఉన్నా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ను బంతాడుకుంటున్నారు. 2014 శాసనసభ ఎన్నికలలో రైతు రుణాలను ‘బేషరతుగా’ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని కూడా అన్నారు. ఇవన్నీ నెరవేర్చేందుకు- అవసరమయ్యే నిధులు వందలకోట్ల రూపాయలు పైనే. సుప్రీంకోర్టు ఆదేశం కాకపోవచ్చు, అలాంటి అభిప్రాయాన్ని గౌరవించాలని భావించే ఏ నేతయినా ఇలాంటి హామీ ఇవ్వలేరు. ఇవ్వరు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనను మించి ఈ హామీల ఖర్చు కనిపిస్తున్నదని నిపుణులు వెల్లడించిన వాస్తవం. జాబు రావాలంటే బాబు రావాలన్నది మరొక నినాదం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిగా రూ. 2,000 ఇస్తామన్నది మరొక హామీ. హామీలు కురిపించడంలో నాలుకకు నరంలేని రీతిలో వ్యవహరించారు చంద్రబాబు. ఏ వర్గాన్నీ విడవకుండా వారి కోసం రకరకాల హామీలు సృష్టించారు. పదవి చేపట్టిన ఆరు మాసాలలో కాపు వర్గానికి బీసీ హోదా ఇస్తానని ఢంకా బజాయించారు. రజకులను ఎస్సీ వర్గంలో చేర్పిస్తామన్నది మరొక తాయిలం. ఆయన వందలాది హామీలను వర్షించారు. అయితే అధికారంలోకి వచ్చాక వాటిలో అమలైనవి ఎన్ని? పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, దక్షిణాదిన కర్ణాటక కూడా రుణ మాఫీని ప్రకటించాయి. ఎక్కడా పరిపూర్ణంగా అమలు కాలేదు. అందరూ అందరే... చాలా ప్రాంతీయ పార్టీలు; కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా దాదాపు అసాధ్యమైన చాలా అంశాల మీద హామీలు ఇవ్వడం కనిపిస్తుంది. మద్యం అమ్మకాలను జాతీయం చే సి, దుకాణాలను పరిమితం చేస్తామని లోక్‌సత్తా పార్టీ ప్రకటించింది. హిందూ మహాసముద్రంలోని డిగోగార్షియా సైనిక కేంద్రం నుంచి అమెరికా అణ్వాయుధాలను ఉపసంహరించాలని కోరతామని సీపీఎం తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. కేజ్రీవాల్ గారి ‘ఆప్’ అవినీతిని కూకటి వే ళ్లతో పెళ్లగిస్తామని హామీ ఇచ్చింది. దురదృష్టం ఏమిటంటే, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవినీతి కేసులలో అరెస్టవుతున్నారు. పార్టీ టికెట్లు అమ్ముకున్న ఆరోపణతో ‘ఆప్’ పంజాబ్ శాఖ చీఫ్‌ను ఈ మధ్యనే తొలగించారు. ‘అసలు మేం మ్యానిఫెస్టోలనే విడుదల చేయం, ఆ పేరుతో చేసే హామీలను మించి మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పసలేని హామీలు ఇవ్వడం కంటే, ప్రజాభివృద్ధి మీదే మాకు గట్టి నమ్మకం’ అంటూ 2014 ఎన్నికల సమయంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ ప్రకటించడం ఈ అంశానికి ఒక కొసమెరుపు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు ఉచితంగా ఇస్తానని తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు చెప్పేశాయి. కానీ ఆ వస్తువులను విద్యార్థులకు రాయితీతో కటాక్షించగలమని ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ చెప్పింది. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఒక పాలిచ్చే ఆవును ఇస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది. 65 ఏళ్లు దాటిన మధ్య తరగతి, చిన్నకారు రైతులకు పింఛను ఇస్తామని కూడా చెప్పింది. ఆ రాష్ట్రంలో మరో ప్రధాన రాజకీయ పక్షం సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తాను అధికారంలోకి (2007 నాటి సంగతి) వస్తే ప్లస్ టెన్ ఉత్తీర్ణుడైన విద్యార్థికి ఒక లాప్‌ట్యాప్, టెన్త్ ఉత్తీర్ణుడైతే టాబ్లెట్ కంప్యూటర్ ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చింది. అట్టడుగున ఉన్న, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వర్గాల కోసం విద్య, వైద్యం, వారి ఆహార భద్రతకు ఉపకరించే బియ్యం పథకం వంటివి ఆహ్వానించదగినవే. వాటిని ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు, పార్టీలు మారి, కొత్త పార్టీలు, సర్కార్లు అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగించడం ఒక చరిత్ర. అలాగే ఇలాంటి హామీలను, తాయిలాలను మొత్తం రాజకీయనాయకులంతా సమర్ధిస్తున్నారని కూడా చెప్పలేం. కానీ గ్రైండర్లు, లాప్‌ట్యాప్‌లు, ఫోన్లు, ఫ్యాన్లు ఉచితంగా ఇస్తామనడం అనాలోచిత చర్య. ఇవన్నీ ఓట్లు దండుకోవడానికి ఇచ్చే తాయిలాలు. ఇక పోలింగ్ నాటి ప్రలోభాలైతే... అవి సాక్షాత్తు లంచాలు. ఎన్నికల సమయంలో, పార్టీ మ్యానిఫెస్టోలలో ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయకపోవడం, అమలు చేయకుండా సాకులు చూపడం, అసలు మరచిపోవడం అంటే ప్రజాస్వామ్యానికి ఒక పార్టీ చేసే అతి పెద్ద ద్రోహం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ప్రకటించుకోగలిగిన భారతదేశంలో, ప్రజాస్వామ్య వ్యవ స్థను నిరంతరం సజీవంగా ఉంచగలిగిన ఎన్నికల వ్యవస్థను ఫ్రీబీల బజారులో అమ్మకానికి పెట్టడం చారిత్రక ద్రోహం. 2011 శాసనసభ ఎన్నికలలో తమిళనాడులో 70 శాతం ఓటర్లు తాము అందుకున్న తాయిలాల గురించీ, పోలింగ్ రోజున దక్కిన లంచాల గురించీ బాహాటంగా చెప్పడమే రాజకీయ పార్టీల ద్వారా, నాయకుల ద్వారా ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అలాంటి ద్రోహాన్ని తిరుగులేకుండా నిర్ధారిస్తున్నది. మరి దీనిని అరికట్టే మార్గాలు లేవా? సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. మ్యానిఫెస్టోల మతలబును అదుపు చేసేందుకు ఒక నిబంధనావళిని రూపొందించమంటూ జూలై 5, 2013న సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యం ముగుసులో ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్న పార్టీలకు కళ్లెం వేయడం అంత సులభమైతే కాదు. తాయిలాలు పంచడంలో, తూతూ మంత్రంగా మ్యానిఫెస్టోలు విడుదల చేయడంలో అన్ని పార్టీలదీ ప్రత్యేక చరిత్రే. సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛను రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్న మాట నిజం. మరో ఐదేళ్లో పదేళ్లో అధికారంలో ఉండడానికి ప్రజాస్వామ్యం వంటి మహోన్నత వ్యవస్థను కలుషితం చేయడం అంటే, రినైజాన్స్ కాలం నాటి పెయింటింగ్‌ను చలి కాచుకోవడానికి తగలబెట్టడం వంటిదే. చాలామంది రాజకీయ నేతలు చేస్తున్న పని ఇదే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు ఫ్రీబీలతో నేతల దగా ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా దగా చేస్తున్న ఫ్రీబీ ఫేం నేతలని చట్టం ఏమీ చేయలేదా? హామీలు ఇచ్చి, ఫ్రీబీలు పంచి అధికారం దక్కించుకున్న నాయకులు, ఎన్నికైన తరువాత హామీలను విస్మరిస్తే వెనక్కి పిలిచే అవకాశం (స్విట్జర్లాండ్ తరహాలో) భారతదేశంలో ఉందా? ఎంతమాత్రం లేదు. ఫ్రీబీలు చాటుమాటు వ్యవహారం. వీటికి కేరాఫ్ ఉండదు. కోట్ల రూపాయలు వదిలేసి పోయిన సంగతులు పత్రికలలో చదివాం. ఇక మ్యానిఫెస్టోలు చట్టబద్ధం. కానీ 1952 నాటి తొలి ఎన్నికల నుంచి మ్యానిఫెస్టోలు తమ అవతారాలను వేగంగా మార్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలను వివరించడం మ్యానిఫెస్టోల ప్రధాన లక్ష్యం కాదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఓటర్లకు ఎలాంటి వరాలు లభిస్తాయో చెప్పడానికే వాటిని ఉపయోగించుకుంటున్నారు. అయినా వీటికి చట్టబద్ధత ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోలేకపోతున్నది. కానీ 5-7-2013 నాటి తీర్పులో ఫ్రీబీలను మాత్రం తప్పు పట్టింది. ఇవి ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీస్తాయని ఎన్నికల కమిషన్ కూడా నిర్ద్వంద్వంగా అంగీకరించింది. వీటి నిరోధానికి అవసరమైన చర్యల గురించి ఆలోచిస్తామని విన్నవించింది. అయితే, ఇవి ఒక వ్యక్తికి ఆపాదించలేం. అలాగే ఒక పార్టీని వెనక్కి పిలవడం అంటే, మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడమే. అలాంటి నిబంధనలు భారతదేశంలో లేవు. నిజానికి ఓటర్లను ప్రలోభ పెట్టరాదన్నది మొదటి నుంచి ఉన్న ఎన్నికల నిబంధన. ఓటర్లను బెదిరించి ఓటు వేయించడం, పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాలకు వారు రావడానికి వాహన సౌకర్యం కల్పించడం సైతం నిబంధనావళి ఉల్లంఘన కిందకే వస్తాయి. కానీ ఈ ఎన్నికల నేరాలు ఇప్పుడు చాలా చిన్నవిగా కనిపించే స్థాయికి చేరిపోయాయి. అభ్యర్థులను హత్య చేయడం, కోట్ల రూపాయలు పెట్టి ఫ్రీబీలు పంచడం, ఉద్విగ్న అంశాలను తెర మీదకు తేవడం ఇప్పుడు తరచూ జరుగుతోంది. ఏమైనా ఫ్రీబీల సంగతి సత్వరమే తేల్చాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించడం స్వాగతించదగినదే. కానీ దీని విజయం మన నేతల చిత్తశుద్ధి మీద కూడా ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యం మాఫియాల పరం కాకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత కూడా. -
నిత్యనూతన ప్రవాహం అంబేడ్కర్ సిద్ధాంతం
సమకాలీన రాజకీయాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్ నిర్దేశించిన మార్గదర్శనాలను అనుసరించడం అనివార్యంగా మారింది. మల్లెపల్లి లక్ష్మయ్య గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరించిన రాజకీయాలు, సంస్థలు, పార్టీలు నేడు అంబేడ్కర్ ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద, సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్ 14 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ సిద్ధాంతాలు, అభిప్రాయాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీయాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది. నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్ ఊసే ఎత్తని కొన్ని పార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చుకునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంతవరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు దళితుల కోసం పనిచేయడానికి ప్రత్యేక సంఘాలనే ఏర్పాటు చేసుకున్నాయి. దళిత హక్కుల పోరాటసమితి, కుల వివక్ష వ్యతిరే క పోరాట సంఘం ఈ రెండు పార్టీల అనుబంధ సంఘాలుగా నిర్మించారంటేనే ఆ మార్పుని గమనించాల్సిన అవసరం వున్నది. మావోయిస్టు లాంటి ఎంఎల్ పార్టీలు నేరుగా కాకపోయినా తమ తమ రాజకీయాలతో ఉన్నవాళ్లతో కొన్ని సంఘాలను నిర్మించి పనిచేస్తున్నాయి. దీనిని ప్రాముఖ్యం కలిగిన రాజకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు పూర్తిగా హిందూమతాన్ని రక్షించి, పెంచి పోషించడానికి ఉద్భవించిన ఆరెస్సెస్ లాంటి సంస్థలు, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచన ప్రకారం తాము అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని ప్రకటించుకున్నాయి. యేడాది క్రితం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవతి ఒక విధాన ప్రకటన చేశారు. తాగునీటికి, దేవాలయానికి, శ్మశానానికి అందరికీ ఒకే స్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు. అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గత పాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్ ను ఒక శక్తిగా నిలబెట్టాయి. అంబేడ్కర్ సిద్ధాంతాలపై ఎంత లోతైన చర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 25 ఏళ్ళ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ఫోన్: 9705566213)