ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా? | Guest Column By Hussain Dalwai On Indian Political System | Sakshi
Sakshi News home page

ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?

Published Fri, Jul 3 2020 1:34 AM | Last Updated on Fri, Jul 3 2020 1:34 AM

Guest Column By Hussain Dalwai On Indian Political System - Sakshi

దేశవిభజనకు ముందు ప్రారంభమైన హిందూ–ముస్లింల మధ్య ఘర్షణ ఆ తర్వాతా కొనసాగడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు మతాల మధ్య ద్వేషాన్ని, పరస్పర అనుమానాలను పెంచి పోషించడంలో మితవాదపక్షం విజయవంతమైంది. ముస్లింలను ద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రించడమే కాకుండా వారిని లవ్‌ జిహాదీలుగా, గోవధ చేసేవారుగా, చివరకు కరోనాను వ్యాప్తి చెందించేవారుగా కూడా నిందిస్తూ వస్తున్నారు.

ముస్లింలను విలన్లుగా చిత్రిస్తూ దుష్ప్రచారం చేయడమే కాకుండా వారిని కాల్చిచంపడానికి కూడా పోలీసులకు విశేషాధికారాలను కల్పిస్తున్నారు. పోలీసులు ముస్లింలను చంపేయడాన్ని సమాజం కూడా పట్టించుకోవడం లేదు. అమెరికా నల్లజాతి ప్రజల్లాగే భారత్‌లో ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా అనేది నేటి ప్రశ్న.

తమిళనాడు పోలీసులు కస్టడీలో తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన పాశవిక ఘటన, పోలీస్‌ యంత్రాంగం విశేషాధికారాలను మరోసారి చర్చల్లోకి తీసుకొచ్చింది. మర్మాయవాలనుంచి రక్తం కారేలా చితకబాదడం, అవయవాలను కుళ్లబొడవడమే వీరి చావుకు కారణమైంది. మన పోలీసులు ఎంత క్రూరులో, నిర్దయాపరులో వీరి మరణం మరోసారి తేటతెల్లం చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం షాపును తెరిచి ఉంచారనే సాకుతో తండ్రీకుమారులను పోలీసు స్టేష న్‌కు లాక్కొచ్చారు. వారు చేసింది సివిల్‌ అపరాధమే కానీ హింసాత్మక నేరం కాదు. ఈ ఉదంతం అమెరికాలోని జార్జి ఫ్లాయిడ్‌ కేసును తలపిస్తుంది. కానీ జార్జ్‌ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో మొదలైన ఉద్యమంలాంటిది భారత్‌లో కనిపించదేం?

ఇక మహారాష్ట్ర ప్రభుత్వం 2003లో క్వాజా యూనస్‌ను కస్టడీలో చంపేసిన నలుగురు పోలీసులను ఈ వారమే తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంది. దీంతో యూనస్‌ తల్లి కోర్టు ఉల్లంఘన పిటిషన్‌ దాఖలు చేసింది. ఆమె కుమారుడైన ఐటీ ఇంజనీరును పోలీసులు గతంలోనే అదుపులోకి తీసుకుని తిరిగి వెనక్కు పంపలేదు. అతడి మృతదేహాన్ని కూడా ఆమె ఇంతవరకు చూడలేకపోయింది. యూనస్‌ తమ కస్టడీనుంచి తప్పించుకున్నాడని పోలీసులు ప్రకటించినప్పటికీ, అతడిని లాకప్‌లో బట్టలూడదీసి గుండెపై, పొత్తికడుపుపై బెల్టుతో హింసించి మరీ చంపారని సీఐడీ విచారణలో తేలింది. ఈ ఉదంతంలో 14మంది పోలీసులపై విచారణ జరగగా నలుగురు పోలీసుల (వేజ్, తివారీ, నికమ్, దేశాయ్‌)పై మాత్రమే మహారాష్ట్ర ప్రభుత్వం నేరారోపణ చేసింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగులో ఉండటం గమనార్హం. 

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై మోకాలు ఉంచి తొక్కిపెట్టి శ్వేతజాతి పోలీసు అధికారి ఊపిరాడకుండా చేసి చంపిన ఉదంతంపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నల్లజాతి ప్రజల ప్రాణాలూ విలువైనవే అంటూ సాగిన ఆ ఉద్యమానికి లండన్, ప్యారిస్‌ వంటి నగరాల్లోకూడా వేలాదిమంది మద్దతునిస్తూ ఊరోగింపు తీశారు. హత్యకు గురైన జార్జికి సంఘీభావంగా నిరసనకారులు మోకాలిమీద నిలబడ్డారు, నినాదాలు చేశారు. ఈ నిరసనలు ఎప్పుడో జరగాల్సి ఉండింది. ప్రతి సంవత్సరం అమెరికా పోలీసులు వెయ్యిమంది నల్ల జాతి ప్రజలను కాల్చి చంపుతున్నారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంతతి యువతను నేరస్తులుగా చిత్రించారు. అమెరికాలోని జైళ్లు పూర్తిగా నల్ల జాతి పౌరులతో కిక్కిరిసిపోతుంటాయి.

మరాఠీ జర్నలిస్టు సమర్‌ ఖదాస్‌ బకరా కళేబరం (బక్రియాచి బాడీ) అనే పేరిట యూనస్‌ కేసుపై ఒక కథనం రాశారు. ఒక ముస్లిం యువకుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషనులో కుర్చీకి కట్టేస్తారు. అతడి ముఖంపై టవల్‌ కప్పివుంచి దానిపై నీరు ధారగా పోస్తారు. ఆ మనిషి గిలగిలా కొట్టుకుంటూ వదిలేయమంటూ ప్రాధేయపడుతుంటాడు. నెమ్మదిగా అతడి వేడికోళ్లు ఆగిపోయి, శబ్దాలు నిలిచిపోతాయి. చివరకు నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో పోలీసులు అతడి చుట్టూ ఉండి జోకులేసుకుంటూ, తింటూ, టీవీ చూస్తూ గడిపేస్తుం  టారు. యూనస్‌ ఖాన్‌ హత్యకు బాధ్యుడైన ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వేజ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. ఇంతవరకు ఇతగాడు 63 మందిని చంపాడు. మరో 6 నెలల్లో రిటైర్‌ కాబోతున్నాడు. అతడికి పదవీవిరమణ ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అతగాడిని ఇటీవలే సర్వీసులోకి తీసుకుంది. అదే సమయంలో యూనస్‌ తల్లి గత 17 ఏళ్లుగా న్యాయం కోసం నిద్రలేని రాత్రులను గడుపుతోంది.
నిందితులైన పోలీసు అధికారులను ప్రోత్సహించే చరిత్ర మనది.

1992–93లో బాంబే దాడుల్లో అసమర్థంగా వ్యవహరించిన లేక నేరుగా హింసాత్మక చర్చలకు పాల్పడిన పోలీసులపై శ్రీకృష్ణ కమిషన్‌ చేసిన నేరారోపణలపై చర్య తీసుకోవడంతో వరుసగా ప్రభుత్వాలు విఫలమవుతూ వచ్చాయి. ఆ దాడుల్లో పోలీసులు ముస్లింలను అతి దగ్గరనుండి కాల్చేశారు. ముస్లిం కుటుంబాలను అల్లర్లకు పాల్పడుతున్న వారి వద్దకు పంపి వారి క్రూరహత్యకు కారణమయ్యారు. ఒక బేకరీలో తొమ్మిదిమందిని కాల్చి చంపిన ప్లటూన్‌కి నాయకత్వం వహించిన పోలీసు అధికారి త్యాగిని తర్వాత ముంబై పోలీసు కమిషనర్‌గా చేశారు. 1997లో ముంబైలోని రాంబాయి నగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనకు నిరసన తెలుపుతున్న దళితులపై ఇన్‌స్పెక్టర్‌ మనోహర్‌ కడామ్‌ కాల్పులకు ఆదేశించి 13మందిని అక్కడికక్కడే చంపించేశాడు. కానీ అతగాడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడికి ప్రమోషన్‌ ఇచ్చి మరీ సర్వీసులో చేర్చుకున్నారు.

పోలీసుల ఇలాంటి ప్రవర్తనలను వారు ఒత్తిడికి గురై చేస్తున్నవిగానూ, వారు కూడా మామూలు మనుషులే కదా అని చెబుతూ సమర్థిస్తున్నారు. ఈ సమర్థనే పోలీసులను ఒకవైపు మరింత క్రూరులుగానూ, అహంభావులుగానూ మార్చేస్తోంది. మరోవైపు వీరికే ఆయుధాలను కట్టబెడుతూ, ఏ జవాబుదారీతనం కూడా లేనివారిగా మారుస్తూ నిధులు కూడా సమకూరుస్తున్నారు.  పైగా వారేం చేసినా వాటి వర్యవసానాలను అనుభవించకుండా విశేషాధికారాలను కట్టబెడుతున్నారు. ఈ విధంగా వారి బాధ్యతారహితమైన హింసాత్మక ప్రవర్తనకు చట్టపరంగా రక్షణ కల్పిస్తున్నారు. భారతదేశంలో పోలీసు వ్యవస్థను పాశవికంగా మలిచిన వ్యవస్థలకు బ్రిటిష్‌ రాజ్‌ కాలంలోనే బీజం పడింది.

గిరిజనులు, దళితులు, ముస్లింలతో సహా కిందితరగతి భారతీయులను అదుపులో ఉంచడంకోసం వారిని నేరస్థులుగా ముద్రించి వలసప్రభుత్వం బుల్లెట్లను ప్రయోగించడమే కాకుండా, చిత్రహింసలు పెట్టేది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఇదే పోలీసు విభాగాలు భారత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కులీన వర్గాలకు సేవ చేయడాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. వీళ్లు నాటి పాశవికత్వాన్నికొనసాగిస్తూ శాస్త్రీయ పోలీసింగ్‌ విధానాలకు దూరమయ్యారు. ఇటీవలి రెండు సర్వేల ప్రకారం ముస్లింలు సహజంగానే నేర ప్రవృత్తి కలవారని 14 శాతం పోలీసులు.. ముస్లింలు ఏదో ఒకరకమైన నేరాలకు పాల్పడుతున్నట్లు 36 శాతం పోలీసులు భావిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛాందసవాద రాజకీయ పాలనా వ్యవస్థ తన రాజకీయ ప్రత్యర్థులకు గుణపాఠం నేర్పాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ రకమైన వివక్ష, దురభిప్రాయాలు మరింత బలం పుంజుకుంటున్నాయి. దేశవిభజనకు ముందు ప్రారంభమైన హిందూ–ముస్లింల మధ్య ఘర్షణ ఆ తర్వాతా కొనసాగడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు మతాల మధ్య ద్వేషాన్ని, పరస్పర అనుమానాలను పెంచి పోషించడంలో మితవాద పక్షం విజయవంతమైంది. ముస్లింలను ద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రించడమే కాకుండా వారిని లవ్‌ జిహాదీలుగా, గోవధ చేసేవారిగా, చివరకు కరోనాను వ్యాప్తి చెందించేవారుగా కూడా నిందిస్తూ వస్తున్నారు. ముస్లింలను విలన్లుగా చిత్రిస్తూ చేస్తూ వచ్చిన దుష్ప్రచారం కారణంగా వారిని కాల్చిచంపడానికి పోలీసులకు విశేషాధికారాలను కల్పిస్తున్నారు. అంతకుమించి పోలీసు బాసులను నాయకత్వపరంగా బాధ్యత వహించేలా చేసే వ్యవస్థ భారతదేశంలోలేదు.

తన ప్లటూన్‌ లోని బలగాలు చేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కమాండర్‌ను బాధ్యుడిని చేయడం మన దేశంలో లేదు. లేదా సామాన్యులు పోలీసు అధికారిపై దావా వేసేందుకు కూడా చట్టం అనుమతించడం లేదు. వారిపై చార్జి షీటు ఉండదు. ఒకవేళ ప్రభుత్వమే ప్రాసిక్యూట్‌ చేసినా అది బలహీనంగా ఉంటుంది, విచారణ ఫలితంలో జాప్యం కొనసాగుతుంది. వీటన్నింటివల్ల పోలీసు పాశవితకు గురైన బాధితులకు ఈ దేశంలో న్యాయం ఒక ఎండమావిగానే మిగిలిపోతోంది.
అమెరికాలో నల్లజాతి ప్రజలు కేవల సంస్కరణలు తమకువద్దని, మొత్తం పోలీసు విభాగాలనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జార్జి ఫ్లాయిడ్‌ స్మారకార్థం వారు ‘నాకు ఊపిరాడటం లేదు’ అంటూ వీధుల్లో నినాదాలు చేస్తున్నారు.

‘నా మెడపై మీరు కాలు వేసి తొక్కుతున్నప్పుడు నేను స్వేచ్ఛగా ఉండలేను. కదలలేను, ఉద్యోగం చేయలేను, కిరాయికి గదిని సంపాదించలేను, యూనివర్శిటీకి వెళ్లలేను, ప్రార్థించలేను. నేను పౌరుడినే కాదు. నా సొంత దేశంలో నేను స్వేచ్ఛగా గాలి పీల్చలేను’ అనే విస్తృతార్థం ఈ వాక్యంలో అంతర్లీనమై ఉంది. న్యాయం లభించకపోతే శాంతి కూడా లభించదు అనేది ఇప్పుడు అమెరికా, యూరప్‌ దేశాల్లోని వీధుల్లో నల్లజాతి ప్రజల మంత్రవాక్యంలాగా ధ్వనిస్తోంది. భారతీయ మెజారిటీ వర్గాలు, ప్రభుత్వాలు కూడా ఈ నినాదాన్ని పట్టించుకుంటాయని మనం ఆశించవచ్చా?
వ్యాసకర్త:హుసేన్‌ దల్వాయి రాజ్యసభ మాజీ ఎంపీ,  సమీనా దల్వాయి ప్రొఫెసర్, జిందాల్‌ గ్లోబల్‌ లా స్కూల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement