భారతదేశంలో రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు చూసి అతి తక్కువ కాలంలో ఇన్ని రంగులు మార్చడం తమవల్ల కూడా కావట్లేదని ఊసరవెల్లులు సైతం చేతులెత్తేసేలా ఉన్నాయి. రాజ కీయ పదవులు,ప్రభుత్వ నిధులు పొందడానికి మాత్రమే గెలిచిన తమ స్థానాన్ని వినియోగించుకోవాలని తాపత్రయ పడుతున్నారు తప్ప, ప్రజలు ఏ పార్టీ మేనిఫెస్టో,విధి విధానాలకు వ్యతిరేకంగా తమను గెలిపించారు అనే కనీస ఆలోచన కూడా చేయడంలేదు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డెక్కినాక బోడి మల్లయ్య’ అన్నట్లుగా పార్టీ టికెట్ అందే వరకు ఒక లెక్క,పార్టీ టికెట్ దక్కించుకున్నాక ఒక లెక్క, ఆ పార్టీ విధి విధానాలను నమ్మి ఓటేసి గెలి పించాక మరో లెక్కలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తయారవ్వ డానికి కారణం ఏంటి? లోపం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందా? పార్టీలు ఫిరాయించే ఫిరాయింపుదారులలో ఉందా? వారిని ఎన్నుకున్న ప్రజలలో ఉందా? అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’లోనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆ చట్టమే ఫిరాయింపుదారుల పాలిట వరంలా మారింది. ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకుంటూ దానికి ‘ఆపరేషన్ ఆకర్ష్‘ లేదా ఇంకేదైనా పేరుతోనో ప్రత్యర్థి పార్టీలో ఉన్న అభ్యర్థులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాగి అసలు ప్రతిపక్షమే లేకుండా చేసి రాచరిక పాలన దిశగా అడుగులు వేయడానికి మన బల
హీనమైన చట్టాలు ఎలా ఉపయోగపడుతున్నాయనేది చర్చనీ యాంశం.
ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయానికొస్తే ఈ తతంగం ప్రస్తుతం మాత్రమే చోటు చేసుకున్నదేమీ కాదు, తమ ఎమ్మెల్యేలను గొర్రెల వలె కొంటున్నారని ప్రతిపక్షం అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంలో అంతగా పస లేదు ఎందుకంటే గతంలో 1990–95 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో పి. చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి అప్పటి బడా పార్టీ ముమ్మరంగా ఫిరాయింపుల ద్వారా ఎంపీలను చేర్చుకొని గద్దెనెక్కడమే కారణం. అలాగే 1991లో కూడా పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1995 నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులనే వాడుకోవడం గమనార్హం. కాబట్టి ఏ ఒక్క రాజ కీయ పార్టీకో ఈ ఫిరాయింపుల సంస్కృతిని ఆపాదించి మిగతా పార్టీలు సత్యహశ్చంద్రుడి పార్టీలుగా బిల్డప్ ఇవ్వాల్సిన పనిలేదు. ఒక వేళ ఏ పార్టీ అభ్యర్థి అయినా మరోపార్టీలోకి మారటం అనివార్యం అయితే తాను గెలిచి పొందిన పదవికి రాజీనామా చేసి బయటకు రావడం ప్రజాస్వామ్యాన్ని శోభిల్ల చేస్తుంది. వైఎస్సార్‌సీపీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది.
ఈ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధకాన్ని అమలు చేసే నిర్ణయాధికారం స్పీకర్‌కు మాత్రమే ఉండటం, స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే కాలాన్ని పొడిగించే సౌకర్యం కలిగి ఉండటం (ఆ కాలం కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కావచ్చు) ఈ చట్టం లోని లోపాలు. ఈ లోపాలవల్లే ప్రతిపక్షంలో ఉండి గెలిచిన అభ్యర్థి తన పదవికి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరి మంత్రి పదవులను సైతం నిర్వహించడం కళ్లారా చూస్తూనే ఉన్నాం.
పార్టీ ఫిరాయింపుల నిరోధక అధికారాన్ని స్పీకర్‌కు కాకుండా స్వతంత్ర సంస్థలకు లేదా ఎన్నికల సంఘానికి అప్పగించినట్లయితే ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదు. అంతే కాకుండా ఒక పార్టీకి చెందిన శాసన సభ్యులు 2/3 వంతు మంది వేరే పార్టీలో చేరితే దాన్ని సమర్థిస్తుండటం కూడా ఈ చట్టం నిర్వీర్యమవడానికి కారణమవుతోంది. కాబట్టి ఒక పార్టీ మేనిఫెస్టోపై ఎన్నికైన సభ్యుడు మరో మేనిఫెస్టో కలిగిన వేరొక పార్టీతో విలీనం కావడాన్ని కూడా రద్దు చేస్తేనే పార్టీ ఫిరాయింపుల నిరోధానికి పూర్తి స్థాయిలో కట్టుబడ్డట్టవుతుంది. ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీ కాకుండా నిజమైన ప్రజాభిప్రాయానికి ప్రతి బింబం కావాలంటే పార్టీ ఫిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది,లేదంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అపహాస్యమే అవుతుంది.
శ్రీనివాస్ గుండోజు ‘ ఫోన్ : 99851 88429
Comments
Please login to add a commentAdd a comment