ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్‌ కొట్టారు! | Political Leaders Lead States As CMs Thrice In India | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ లేకుండా.. రాష్ట్రాలేలిన హ్యాట్రిక్‌ హీరోలు..!

Published Sun, Feb 16 2020 1:21 PM | Last Updated on Sun, Feb 16 2020 2:29 PM

Political Leaders Lead States As CMs Thrice In India - Sakshi

కేజ్రీ... హ్యాట్రిక్‌
ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్‌ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్‌ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్‌ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్‌... 
(చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం)

పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (ఎస్‌డీఎఫ్‌)
రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24  ఏళ్ల 165 రోజులు
సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్‌ బహుదూర్‌ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్‌ 1992లో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు.

సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్‌లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్‌కుమార్‌పై ఒక క్రేజ్‌ని సృష్టించాయి. చామ్లింగ్‌ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు.

సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్‌ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. 

జ్యోతిబసు (సీపీఐ–ఎం)
రాష్ట్రం: పశ్చిమ బెంగాల్‌, పదవీ కాలం: 23  ఏళ్ల  137 రోజులు
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది.

సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్‌ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. 

మాణిక్‌ సర్కార్‌ (సీపీఐ–ఎం)
రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19  ఏళ్ల  363 రోజులు
తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్‌ దిగ్గజం మాణిక్‌ సర్కార్‌. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్‌ కుటుంబంలో జన్మించిన మాణిక్‌ సర్కార్‌ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్‌ సర్కార్‌ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది.

బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్‌ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్‌ సర్కార్‌ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. 

నవీన్‌ పట్నాయక్‌ (బిజూ జనతాదళ్‌)
రాష్ట్రం: ఒడిశా,  పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. 
మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్‌ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్‌ పట్నాయక్‌ ఆ తర్వాత కాలంలో జనతాదళ్‌ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్‌ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్‌ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.

నవీన్‌ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. 

షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌)
రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15  ఏళ్ల  25 రోజులు
ఇప్పుడు అందరం కేజ్రీవాల్‌ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్‌. కాంగ్రెస్‌ డార్లింగ్‌గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి.

ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్‌ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. 

రమణ్‌ సింగ్‌ (బీజేపీ)
రాష్ట్రం: ఛత్తీస్‌గఢ్‌, పదవీ కాలం: 15  ఏళ్ల  4 రోజులు
రాజకీయాల్లో మిస్టర్‌ క్లీన్‌ అన్న ఇమేజ్‌ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్‌తోనే నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు రమణ్‌ సింగ్‌. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్‌ సింగ్‌ను ఆప్యాయంగా చావాల్‌ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్‌గఢ్‌ పరిపాలనను రమణీయంగా మార్చాయి.

వ్యూహాత్మకంగా నక్సల్స్‌ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్‌ సింగ్‌పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్‌ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్‌ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్‌ సింగ్‌ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్‌ సింగ్‌ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. 

నరేంద్ర మోదీ (బీజేపీ)
రాష్ట్రం: గుజరాత్‌,  పదవీ కాలం: 12  ఏళ్ల 226 రోజులు
2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్‌ సీఎంగా నిలిచారు. గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు.

ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్‌కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్‌లో అత్యధికమన్న వాదనా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement