ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎన్నికలు మాత్రం అంత ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదా? మన దేశ ఎన్నికల రాజకీయాలలో ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల జోక్యం ఎక్కువగా ఉంటోందా? మీడియా ముసుగులో ఇలాంటి సోషల్ మీడియా దిగ్గజాలు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయా? అవునంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన సాక్షాత్తూ పార్లమెంట్ వేదికగా బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె ప్రసంగం చిన్నదే కానీ, ఆరోపణలు తీవ్రమైనవి. ఆలోచించి తీరాల్సినవి.
విద్వేష వ్యాఖ్యల వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు మాత్రం అనుకూలించేలా ఫేస్‌బుక్ తన స్వీయ నియమాలను సైతం మార్చేస్తున్నట్టు ప్రసిద్ధ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పరిశోధన గత ఏడాది బయటపెట్టింది. ఇక, రాజకీయ పార్టీల తరఫున పరోక్షంగా పనిచేస్తున్న వాణిజ్య ప్రకటనదారుల విషవ్యవస్థ ఫేస్‌బుక్‌లో ‘న్యూస్ మీడియా’గా చలామణీ అవుతున్న తీరును తాజాగా ‘అల్ జజీరా’, ‘రిపోర్టర్స్ కలెక్టివ్’లు బహిర్గతం చేశాయి. ఎన్నికల వేళ ఈ ‘ఫేక్’ బుక్ చర్యలు దేశ ఎన్నికల చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక గళాలను పూర్తిగా తొక్కేస్తున్నాయి. తప్పుడు సమాచారంతో భావోద్వేగాలను రెచ్చగొట్టి, పిన్నపెద్దల మనసులను కలుషితం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే, బీజేపీకి తక్కువ ధరలకే ఫేస్‌బుక్ ఎన్నికల ప్రచార ప్రకటనల్ని అందించారనీ తెలుస్తోంది. అయితే, అధికార పక్షమే ప్రయోజనం పొందుతున్న వేళ, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ పార్టీ సారథ్య ప్రభుత్వాన్నే కోరాల్సి రావడం విరోధాభాస.
సహజంగానే అధికార పక్షీయులు ఆ పాపంలో తమకు భాగం లేదంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్లు సమాచార ప్రచురణకర్తలా, లేక వట్టి వాహకాలేనా అన్నది ఇప్పటికీ తేలలేదన్న లా పాయింట్ లేవదీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ ఆరోపణలను అడ్డం పెట్టుకొని, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎ) ద్వారా భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోం దంటూ ప్రత్యారోపణలు చేస్తున్నారు. వాదోపవాదాలు పక్కనపెడితే – ఏ దేశంలోనైనా సరే పార్టీలు, నాయకులు, వారి నియుక్తులు ‘తాము చెప్పిందే వేదం, చూపిందే సత్యం’ అని భ్రమింపజేసేలా కథనాలను వండి వార్చడానికి సోషల్ మీడియాను వాడుతుండడం ఆందోళనకరం. ప్రజాపాలనకే ప్రమాదకరం. ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసి, తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి సోషల్ మీడియా వాడకం పెరుగుతోందనీ, దీనికి ప్రభుత్వం చరమగీతం పాడాలనీ సోనియా అన్నది అందుకే!
సోనియా కన్నా తొమ్మిది నెలల ముందే – 2021 జూలైలోనే ఎన్నికలలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు సైతం గళం విప్పడం గమనార్హం. సోషల్ మీడియాతో తిమ్మిని బమ్మిని చేస్తుండడంతో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియలకే ముప్పు వచ్చి పడిందని సర్వోన్నత న్యాయస్థానం అప్పట్లోనే వ్యాఖ్యానించింది. ‘ఫేస్‌బుక్ వర్సెస్ ఢిల్లీ అసెంబ్లీ’ కేసులో తీర్పునిస్తూ, కోర్టు చేసిన ఆ వ్యాఖ్యకు ఒక రకంగా కొనసాగింపే ఇప్పుడు బయటపడ్డ సంగతులు, వినిపిస్తున్న ఆరోపణలు. నిజానికి, తమ వాదనను వినిపించలేని కోట్లాది మందికి ఫేస్‌బుక్ లాంటి వేదికలతో భావప్రకటనా స్వాతంత్య్రం వచ్చింది. ప్రధాన స్రవంతికి ప్రత్యామ్నాయ వేదికగా నాణేనికి రెండో కోణం చూపడానికి సోషల్ మీడియా ఉపయోగాన్నీ కొట్టిపారేయలేం. కానీ పదునైన ఈ కత్తిని దేనికి వాడుతున్నామన్నది కీలకం. జవాబుదారీతనం లేని అపరిమిత స్వేచ్ఛ పొంచి ఉన్న ప్రమాదం.
ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో సైతం ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వ్యవస్థీకృతంగా అనుచిత రాజకీయ జోక్యం సాగుతున్నట్టు తాజా అధ్యయనం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫేస్‌బుక్‌లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ, ప్రతిపక్షాన్ని అవహేళన చేస్తూ అనేక ప్రకటనలొచ్చాయి. ఆ ప్రకటనలిచ్చిన ‘న్యూ ఎమర్జింగ్ వరల్డ్ ఆఫ్ జర్నలిజమ్ లిమిటెడ్’ సంస్థ సాక్షాత్తూ రిలయన్స్ వారి ‘జియో’ చెట్టు కొమ్మేనట. ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధించి ఆ సంగతి తేల్చింది. ఫేస్‌బుక్‌లో ఇలా రహస్య రాజకీయ వాణిజ్యప్రకటనలు కొత్త కాదు. 2019లో అధికార పార్టీతో బంధాన్ని నేరుగా ప్రకటించకుండా పలు ఫేస్‌బుక్ పేజీలు అధిక శాతం ప్రకటనలిచ్చినట్టు ‘ఆల్ట్ న్యూస్’ విశ్లేషణలోనూ వెల్లడైంది. గ్రామీణ ప్రజలే లక్ష్యంగా వార్తాకథనాల ముసుగులో ఇన్‌స్టా వీడియోలతో సాగుతున్న ముస్లిమ్ వ్యతిరేక ప్రచారం అపారమని ‘అల్‌జజీరా’ వెల్లడించింది.
సానుకూలత కోసం పచ్చి అబద్ధాలను సైతం పవిత్రమైన నిజాలుగా, నిష్పూచీగా చలామణీలోకి తేవడంలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్, ఆఖరికి అందరం వాడుతున్న వాట్సప్‌లదీ ప్రధాన భూమిక. ‘వాట్సప్ యూనివర్సిటీ’ల్లో సమాచారం పేరిట ఫార్వర్డ్‌ల రూపంలో నిత్యం ప్రవహిస్తున్న అజ్ఞానానికి అంతం లేదు. డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారి ప్రవహిస్తున్న ఈ అసత్యాల మురుగును అడ్డుకొనేదెలా అనేది ప్రశ్న. ఫేస్‌బుక్‌లో న్యూస్‌ఫీడ్ మాటున దాన్ని స్వలాభానికీ, ప్రత్యర్థులపై బురద జల్లడానికీ వాడుకోవడం రాజకీయ పార్టీల నైచ్యం. చివరకు ఈ ప్రపంచ సంస్థలు, వాటి ఆసరాతో పార్టీలు ఏ భావోద్వేగభరిత పోస్టులు, ఎవరికి, ఏ మోతాదులో చేరాలో నిర్ణయించే స్థాయికి రావడం ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా ముప్పే! దీన్ని ఇకనైనా అడ్డు కోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా, సామాజిక సామరస్యాన్ని కాపాడడం కీలకం. అది మర్చిపోతే అధికారం దక్కినా, సమాజం చీలిపోతుంది. పదునైన కత్తితో ఆటలాడితే, చేయి కోసుకుంటుంది!
పాలకుల ‘ఫేస్’బుక్?
Published Fri, Mar 18 2022 12:04 AM | Last Updated on Fri, Mar 18 2022 12:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment