ప్రధాని మోదీపై మమత భీకర ప్రతిజ్ఞ
పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మొదటినుంచీ నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గట్టిగా సవాల్చేస్తున్న మమతాబెనర్జీ తాజాగా భీకర ప్రతిజ్ఞ చేశారు. ‘నేను బతికినా, చనిపోయినా పర్వాలేదు కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రం భారత రాజకీయాల నుంచి తొలగించి పారేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ ఆమె పేర్కొన్నారు.
పెద్దనోట్ల రద్దుపై మొదటినుంచి మోదీ ప్రభుత్వంపై మమత విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాల మధ్య ఐకత్య లేకపోవడం, గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలబడకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. జాతీయ అంశాలపై తరచూగా స్పందిస్తున్న మమత బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలోనూ మమత మొదట్లో చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై భారత్ బంద్ పిలుపు విషయంలో ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎవరికివారే అన్నట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మమత సోమవారం మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బతికినా, చనిపోయినా పర్లేదు కానీ.. మోదీని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేశారు.