సమకాలీన రాజకీయాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రస్తావన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అంబేడ్కర్ అభిప్రాయాలను అన్వయించుకోవడం, ఆ వెలుగులో ప్రస్తుత సమస్యలను పరిశీలించడం, వాటి పరిష్కారానికి అంబేడ్కర్ నిర్దేశించిన మార్గదర్శనాలను అనుసరించడం అనివార్యంగా మారింది.
మల్లెపల్లి లక్ష్మయ్య
గతంలో అంబేడ్కర్‌ను పూర్తిగా తిరస్కరించిన రాజకీయాలు, సంస్థలు, పార్టీలు నేడు అంబేడ్కర్ ను విస్మరించే పరిస్థితులు లేవంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. భారత రాజకీయ వ్యవస్థలో అటు విప్లవ కమ్యూనిస్టుల నుంచి ఇటు పూర్తిగా మితవాద, సనాతన వాద పార్టీల వరకు అంబేడ్కర్ వాదం, సామాజిక మార్పుకి ఆయన యిచ్చిన నినాదం ఒక ఎజెండాగా మారిపోయింది. ఈ ఏప్రిల్ 14 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే ఒకసారి డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ సిద్ధాంతాలు, అభిప్రాయాలు సమాజంపైన ముఖ్యంగా భారత రాజకీయాల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగించాయో పరిశీలించాల్సి ఉంది.
నేడు దాదాపు అన్ని పార్టీలు అంబేడ్కర్ కృషి గురించి, ఆయన సైద్ధాంతిక ప్రాధాన్యతను గురించి మాట్లాడుతున్నాయి. అసలు అంబేడ్కర్ ఊసే ఎత్తని కొన్ని పార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పార్టీలు తమ అనుబంధ సంఘాలతో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలతో సహా అన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ కార్యక్రమంలో దళిత సమస్యను ప్రస్తావించి దాని పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. కుల సమస్యను తమ ఎజెండాలో చేర్చుకునే పరిస్థితికి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. భూమి సమస్యకోసం పోరాటంలో భాగంగా దళితులను, ఆదివాసులను సమీకరించాలని, కులనిర్మూలన కోసం కృషి జరగాలని, కుల నిర్మూలన జరిగేంతవరకు రిజర్వేషన్లలాంటి ప్రత్యేక సౌకర్యాలు అమలు కావాలని వాళ్ల పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నారు.
సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు దళితుల కోసం పనిచేయడానికి ప్రత్యేక సంఘాలనే ఏర్పాటు చేసుకున్నాయి. దళిత హక్కుల పోరాటసమితి, కుల వివక్ష వ్యతిరే క పోరాట సంఘం ఈ రెండు పార్టీల అనుబంధ సంఘాలుగా నిర్మించారంటేనే ఆ మార్పుని గమనించాల్సిన అవసరం వున్నది. మావోయిస్టు లాంటి ఎంఎల్ పార్టీలు నేరుగా కాకపోయినా తమ తమ రాజకీయాలతో ఉన్నవాళ్లతో కొన్ని సంఘాలను నిర్మించి పనిచేస్తున్నాయి. దీనిని ప్రాముఖ్యం కలిగిన రాజకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు పూర్తిగా హిందూమతాన్ని రక్షించి, పెంచి పోషించడానికి ఉద్భవించిన ఆరెస్సెస్ లాంటి సంస్థలు, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచన ప్రకారం తాము అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని ప్రకటించుకున్నాయి. యేడాది క్రితం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవతి ఒక విధాన ప్రకటన చేశారు. తాగునీటికి, దేవాలయానికి, శ్మశానానికి అందరికీ ఒకే స్థలం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలంటే ఇది అత్యవసరమని ప్రకటించారు.
అయితే ఈ మార్పులు గత రెండున్నర దశాబ్దాల దళిత ఉద్యమాల ఫలితమేనని చెప్పుకోవాలి. సమకాలీన సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశనం చేస్తోన్న అంబేడ్కర్ సిద్ధాంతబలం కూడా అందుకు దోహదం చేసింది. గత పాతిక సంవత్సరాల్లో అంబేడ్కర్ రచనలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా భిన్నరాజకీయాలు కలిగిన సంస్థలు, వ్యక్తులు జరిపిన పరిశోధనలు, సాగిన చర్చలు అంబేడ్కర్ ను ఒక శక్తిగా నిలబెట్టాయి. అంబేడ్కర్ సిద్ధాంతాలపై ఎంత లోతైన చర్చ జరిగితే అది తరతరాల వివక్షనెదిరించేందుకు అంత శక్తిమంతంగా ఉపయోగపడుతుందనడానికి గత 25 ఏళ్ళ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ఫోన్: 9705566213)
నిత్యనూతన ప్రవాహం అంబేడ్కర్ సిద్ధాంతం
Published Tue, Apr 14 2015 12:03 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM
Advertisement
Advertisement