వీరబాహుడు విప్లవిస్తే...!
కొత్త కోణం
ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన వృత్తిని చేసుకొనే హక్కు, లేదా ఆ వృత్తిని కాదనుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. దీనిని ధిక్కరించే, కాదనే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఈ వృత్తిలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలి. వారు కాదనుకుంటే వారికి గౌరవప్రదమైన మరోవృత్తిలో చోటివ్వాలి. ఎవరైనా అందులో పనిచేయడానికి అంగీకరిస్తే ప్రభుత్వమే జీతాలు చెల్లించి సౌకర్యాలు కల్పించి, ఒక నూతన విధానానికి రూపకల్పన చేయాలి.
‘‘ప్రజాస్వామ్యం అనేది పార్లమెంటరీ వ్యవస్థతో, లేదా రిపబ్లిక్ తరహా పాలనతో మాత్రమే పోల్చదగినది కాదు. ప్రజాస్వామ్య మూలాలు ప్రభుత్వ పాలనా విధానంలో లేవు. సామాజిక సహజీవనానికి ప్రజాస్వామ్యం ఒక నమూనా. ప్రజాస్వామ్య మూలాలను సామాజిక సంబంధాలలో వెతకాలి. ఒక సమాజంగా ఏర్పడిన ప్రజలు కలిసి జీవించడంలోనే ప్రజాస్వామ్యశక్తి నిండి ఉంటుంది’’ అని ‘ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అనే అంశం మీద డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వాయిస్ ఆఫ్ అమెరికా (రేడియో) కోసం చేసిన ప్రసం గంలో (మే 1, 1956) పేర్కొన్నారు.
మనుస్మృతి ప్రభావం
ఏ ప్రభుత్వాలు, ఎటువంటి చట్టాలతో పాలన కొనసాగిస్తున్నప్పటికీ ప్రజల్లో ఉన్న తిరోగమన భావాలూ, ఆలోచనలే ఆచరణలో ఆధిక్యం చూపుతూ ఉం టాయి. అందుకే సామాజిక ప్రజాస్వామ్యం అనేది ప్రజల మధ్య సమాన సంబంధాలను నెలకొల్పాలని చెపుతుంది. కానీ ప్రజల మెదళ్లలో అలాంటి భావనలను పాదుకొల్పలేనంత వరకు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు.
జనవరి 26, 1950న ఆమోదించిన మన రాజ్యాంగం ప్రకారం అంట రానితనం నిషిద్ధం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషాపరమైన వివక్షలకు ఇక్కడ స్థానం లేదు. అంటరానితనాన్ని పాటించే వాళ్లు శిక్షార్హులని కూడా చట్టం చెపుతోంది. కానీ సమాజంలో వేళ్లూనుకొని ఉన్న కుల వ్యవస్థ మూలాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందకుండా అవరోధాలు కల్పిస్తూనే ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు అసమా నతలనూ, అంటరానితనాన్నీ నిరోధించడానికి సంబంధించి లిఖిత పూర్వక చట్టమేదీ లేదు. కానీ కులాల, వివిధ వర్గాల స్థానం, స్థాయి ఏమిటో నిర్దేశించే మనుస్మృతి ఉనికిలో ఉన్నది. ఇది రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన సభ్యులు ఆమోదించిన అంగీకార పత్రం కాదు. కొందరి ప్రయోజనాల కోసం ఈ స్మృతి రూపొందింది. అయినా నేటికీ ఇదే ప్రజల మెదళ్ల మీద పనిచేస్తోంది, నడిపిస్తోంది.
మనుస్మృతిలోని పదవ అధ్యాయం, 39వ శ్లోకంలో పేర్కొన్నట్టుగా నిషాద స్త్రీకీ, చండాల పురుషునికీ జన్మించినవాడు అంత్యవాసి. శ్మశానంలో పని చేయడమే అతడి వృత్తి. బొందలు తవ్వడం, కాష్టాలు పేర్చడం లాంటివి చేయాలి. అంతేకాకుండా, ఎనిమిదవ అధ్యాయంలోని, 281వ శ్లోకంలో ‘ఉన్నత కులానికి చెందిన వ్యక్తి స్థానాన్నీ, స్థితినీ చేరుకోవడానికి ప్రయత్నిం చిన అంత్య కుల జుడి తొడపై ఇనుప ముక్క కాల్చి వాతపెట్టాలి’ అని పేర్కొ న్నారు. మనువాదం అంతరార్థం అంతా అసమానతలు కొనసాగుతూ ఉండ డమే. కొన్ని వర్గాల మీద మనువాదం చిమ్మిన విషం తరాలు గడిచినా మాసి పోనంత గాఢంగా ఉందని చెప్పడానికి కొద్దిరోజుల క్రితం తెలంగాణలో జరి గిన ఒక సంఘటన నిదర్శనం.
ఎల్లోయి దురంతమిది
మెదక్ జిల్లా, ఝరాసంగం మండలం, ఎల్లోయి గ్రామంలో 120 దళిత కుటుంబాలను మిగిలిన కుటుంబాలు సామాజికంగా బహిష్కరించాయి. కులవృత్తిని చేయనందుకు ఈ వేటు పడింది. జీవితమంతా ఎవరికైతే రక్త మాంసాలు ధారపోశారో వారే చేలల్లో పనికి రానివ్వకుండా నిషేధించారు. వారి కులవృత్తి డప్పులు మోగించడాన్ని సయితం గ్రామం నిరోధించింది. ఆ కులాల వారు నడిపే ఆటోలు ఎక్కకుండా పొట్ట కొట్టింది. దుకాణాల్లో సరు కులు కొనుక్కోవడం కూడా నేరమైంది. ప్రభుత్వం నడుపుతున్న ఉపాధి హామీ పనుల్లోకి సైతం అనుమతించలేదు. ఇంతకీ ఈ దళితులు చేసిన ‘తప్పు ఏమిట’ని ప్రశ్నిస్తే; శవాలను పూడ్చే పనికే వీళ్లు పుట్టారు... ఆ పని చేయలేదు కనుక బహిష్కరించామని తేల్చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తినీ కూడా ఫలానా పని మాత్రమే చేయాలని బలవంతం చేయకూడదు. పౌరహక్కుల చట్టం; ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టంలోని ఆర్టికల్ 3, క్లాజు -6 ప్రకారం బలవంతంగా పనులు చేయించడం, వెట్టి చాకిరీ చేయించడం నేరం. అయితే ఆ గ్రామంలోని దళి తేతర కులాల పెద్దలకు రాజ్యాంగంలోని అంశాలు తెలియవు, తెలుసుకో వాల్సిన అవసరం రాలేదు. వారికి మనువు ప్రబోధించిన ‘ధర్మ’శాస్త్రం మాత్రమే తెలుసు. దాని ప్రకారమే ఎల్లోయి గ్రామ దళితేతర కులాల పెద్దలు బొందలు తవ్వకపోతే మీకు గ్రామంలో ఉండే అర్హత లేదని ప్రకటించారు. సరిగ్గా ఇదే విషయాన్ని మనువు తన ‘ధర్మ’ సూత్రాలలో పేర్కొనడం గమనిం చవచ్చు. 8వ అధ్యాయం, 281 శ్లోకంలో చెప్పినట్టుగానే ఉన్నత కులాల వలే ఉండాలనుకుంటే గ్రామం నుంచి బహిష్కరించాలి అనే మనువాద సూత్రాన్ని అక్కడ అమలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి దళిత సంఘాలు నిర్వ హించిన ఉద్యమ ఫలితంగా ప్రజాప్రతినిధులు, అధికారులు దిగివచ్చి చట్ట ప్రకారం దోషులను శిక్షిస్తామని, దళితులకు సహాయ సహకారాలు అందిస్తా మని హామీ యిచ్చారు. అయితే ఇది కేవలం చట్టాన్ని అమలు చేసే అధికార ప్రక్రియ మాత్రమే. ఆ గ్రామస్తుల మెదళ్ల నుంచి ఆ భావాన్ని తొలగించే ప్రక్రి యకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలపై జరు గుతున్న అత్యాచారాలకు సంబంధించిన అవగాహనను ఇటు ఎస్సీ, ఎస్టీలలో, అటు దళితేతర కులాల్లో సైతం ప్రభుత్వం కలిగించాలి. దళితేత రులకు ఇది మరింత అవసరం.
ఇటువంటి ఘటనలే కర్ణాటకలో ఆరు నెలల వ్యవధిలో రెండు జరి గాయి. హసన్ జిల్లా అర్కల్ గూడ తాలూకాలోని సిద్ధపుర గ్రామంలోను, ఇదే తాలూకాలోని కేర్ గోడు గ్రామంలోను ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ రెండు గ్రామాల్లో కూడా తమ పూర్వీకులలాగా బొందలు తవ్వడానికి నిరాక రించినందుకే ఆ గ్రామాలలోని దళితులను బహిష్కరించారు. ఆ గ్రామాలకు మంత్రి సోమన్న వెళ్లి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కేసులకు, చట్టానికి భయపడి తాత్కాలికంగా సర్దుకున్నట్టు కనిపిస్తారు. కానీ అంత రాంతరాల్లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను అంతతేలికగా వదులు కునే పరిస్థితి లేదు. కులవ్యవస్థ నిర్దేశించిన వృత్తుల్లో బొందలు తవ్వడం, శ్మశానాలను కాపలాకాయడం కూడా ఉన్నాయి. ఈ పనికి కొన్ని కులాలను కేటాయించారు. అది అంటరాని కులాల్లో భాగంగా ఉన్నవాళ్లు చేయాలని నిర్ణ యించారు. అయితే చాలా చోట్ల అంటరాని కులాల్లో ఎవరైనా చేస్తారు. కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ, కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోనూ మాలల్లో బ్యాగరి ఉపకులం ఈ పనిని నిర్వహిస్తున్నది. మెదక్ జిల్లాలోని ఎల్లోయి గ్రామంలో ఇదే ఉపకుల ం ఆ వృత్తిని నీచంగా భావించి బొందలు తవ్వడానికి నిరాకరించింది. ఈ పనిని చేస్తున్న వాళ్ళని సమాజం నీచంగా చూస్తున్నది. దీనితో ఆ కులంలో చదువుకున్న యువత దీనిని ఆత్మగౌరవ సమస్యగా తీసుకొని సంప్రదాయాన్ని ధిక్కరించింది. నిజానికి ఇతర మతాలలో ఒకే కుటుంబమో, లేక ఒక తెగనో ఇటువంటి కార్యాన్ని నిర్వహించే విధానం లేదు. హిందూమతంలోని కుల వ్యవస్థే దీనిని పెంచి పోషిస్తున్నది.
ఏ శ్మశానంలోనైతే వీరిని పనిచేయాలని కట్టడి చేస్తున్నారో, బొందలు తవ్వకుంటే బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారో, ఈ కులాల వారు మరణిస్తే మాత్రం అదే శ్మశానంలో మూడడుగుల జాగా ఇవ్వరు. అడుగుపెట్టేందుకు కూడా శవాల పక్కన స్థలం ఉండదు. ఈనాటికీ వందలాది గ్రామాల్లో శవాలు పూడ్చిపెట్టుకునే దిక్కులేక వాగుల్లో వంకల్లో దళితులు పాతిపెడుతున్నారు. అగ్రకులాల ఇళ్లముందు నుంచి దళితుల శవాలను మోసినందుకు ఆ దారులే మూసేసిన దౌర్భాగ్యమైన వ్యవస్థ మనది.
ఈ పరిస్థితి మారాలి
మరొకవైపు హైదరాబాద్ ఇతర జిల్లా కేంద్రాల్లో బొందల గడ్డల్లో, శ్మశాన వాటికల్లో పనిచేస్తున్న వాళ్లు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు. వీరంతా గత్యంతరం లేక బొందలగడ్డలే నివాసాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ వాళ్లకు ఎటువంటి సహకారం అందదు. మరో మార్గం లేక అంత్యక్రియలు చేయించేందుకు వచ్చిన వాళ్ళను అడుక్కుంటూ, అంటే చావు దగ్గర కూడా బిచ్చమెత్తుకొని జీవనం సాగిస్తు న్నారు. శవాల దహనం వల్ల వచ్చే పొగ, దుర్గంధం, కాలుష్యం వల్ల ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. బొందలు తవ్వబోమని ధిక్కరించినందుకు సామాజిక బహిష్కరణ చేస్తున్న సమాజం; దిక్కులేక అదే బొందలగడ్డలో దిక్కులేని జీవితం గడుపుతున్న వారిపట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అంటే దళితుడు ఎటువంటి ఫలితాన్నీ ఆశించకుండా అగ్రవర్ణాలకు, ఇతర కులాలకు జన్మతః బానిసై ఉండాలనే దుర్మార్గపు భావజాలానికి తార్కాణమే ఈ సంఘటన.
చివరగా ఒక్కమాట. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జి.హెచ్.ఎం.సి. ఆధ్వర్యంలో ఆధునిక వసతులతో ‘మహాప్రస్థానం’ పేరుతో ఒక శ్మశానాన్ని నిర్మించారు. దీనికి చాలా ప్రచారం వచ్చింది. అందులో పనిచేస్తున్న వాళ్లు ఉద్యోగులుగా ఉన్నారు. ఇది ఒక ఆధునిక చర్య. ఇదే సౌకర్యాన్ని గ్రామా ల్లోనూ కల్పించాలి. ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన వృత్తిని చేసుకొనే హక్కు, లేదా ఆ వృత్తిని కాదనుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. దీనిని ధిక్కరించే, కాదనే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఈ వృత్తిలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలి. వారు కాదను కుంటే వారికి గౌరవప్రదమైన మరోవృత్తిలో చోటివ్వాలి.
ముందుగా ఈ ఇరవై ఐదు వేల మందికి ఆ మురికి కూపం నుంచి విముక్తి కలిగించాలి. ఎవరైనా అందులో పనిచేయడానికి అంగీకరిస్తే ప్రభు త్వమే జీతాలు చెల్లించి సౌకర్యాలు కల్పించి, ఒక నూతన విధానానికి రూప కల్పన చేయాలి. ఎవరైనా ఆ వృత్తి నుంచి బయటకు రావాలనుకుంటే వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
మల్లెపల్లి లక్ష్మయ్య