parliamentary system
-
వివాదాల పరిష్కారానికి 3మార్గాలు
అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఏర్పడే వివాదాల పరిష్కారానికి అమెరికన్ పార్లమెంటరీ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా పరిష్కరించుకోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతిస్తుంది. ఈ మూడు మార్గాలపై సంక్షిప్తంగా... 2020 ఎన్నికల్లో డెమొక్రాట్లు అధికులు మెయిల్ ద్వారా ఓట్లు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రిపబ్లికన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల రోజు వరకూ ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదు. విస్కాన్సిన్లో ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అంశంపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో దాఖలైన వేర్వేరు కేసులన్నీ చివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తాయి. 2000లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలో డెమొక్రటిక్ అభ్యర్థి అల్‌గోర్‌పై గెలిచింది ఇలాంటి కోర్టు కేసు సాయంతోనే. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ట్రంప్ అమీ కోనీ బారెట్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. బారెట్ నియామకం కూడా 6– 3 ఆధిక్యంతో జరగడం ట్రంప్‌కు అనుకూలించే అంశమని నిపుణుల అంచనా. చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలన్నదే తమ అభిమతమని, అందుకే ఓటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా... అమెరికా రాజ్యాంగం ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 సాధించిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమావేశమై అధ్యక్షుడి కోసం ఓట్లు వేయనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు రెండూ జనవరి 6న సమావేశమై ఈ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఫలితాలను నిర్ధారించి ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌కు అందిస్తూంటారు. అయితే ఎన్నికలు పోటాపోటీగా జరిగిన రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీలు రెండు వేర్వేరు ఫలితాలను ఇస్తే ఏమవుతుందన్నది ఇటీవలి కాలంలో విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో గవర్నర్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. అసెంబ్లీలన్నీ రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎవరి మాటకు విలువ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పలువురు చెబుతున్నప్పటికీ, 2000, 1876లలో ఇదే రకమైన వివాదాలు ఏర్పడిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైతే సెనేట్ రిపబ్లికన్ల చేతుల్లో ఉండగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యత కొనసాగుతోంది. అయితే జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసే కొత్త కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు సభలు ఫలితాల విషయంలో అంగీకారానికి రాలేకపోతే ఏమవుతుందన్నది ఓ శేష ప్రశ్న. చట్ట ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గం ఆమోదించిన ఎలక్టర్ల మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అంశం న్యాయస్థానాల పరీక్షకు గురికాని నేపథ్యంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు నిలిచిపోతే అప్పుడు కూడా విజయానికి 270 ఓట్లు కావాలా? లేక లెక్కించిన ఓట్లలో ఆధిక్యత వస్తే సరిపోతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు. కంటింజెంట్ ఎన్నికలు... ఎలక్టోరల్ ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికీ తగిన మెజార్టీ రాకపోతే అది కాస్తా అమెరికన్ రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కంటింజెంట్ ఎన్నికలకు దారితీస్తుంది. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఈ కంటింజెంట్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని ప్రతి రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు లభిస్తుంది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో ఇరవై ఆరు రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. డెమోక్రాట్లకు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో ఇరువురికీ సమానమైన ప్రాభవం ఉంది. ఇంకో రాష్ట్రంలో ఏడుగురు డెమోక్రాట్లు, ఆరుగురు రిపబ్లికన్లు, ఒక లిబరటేరియన్ ఉన్నారు. ఎలక్టోరల్ ఓట్లు ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు 269 చొప్పున వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటింజెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏ వివాదమైనా జనవరి 20లోపు ముగియాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ రోజుతో అధ్యక్షుడి పదవీ కాలం ముగుస్తుంది. ఒకవేళ ఆ రోజుకు కూడా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోతే స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్పీకర్‌గా ఉన్నారు. -
పార్లమెంటరీ విధానంలో మార్పు రావాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సెక్యులరిజం మరింతగా పటిష్టం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ప్రజాసమస్యలపై చర్చ పెరగాలని, ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం ఇక్కడి బిర్లా ఆడిటోరియంలో లెర్న్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టాక్ విత్ అసద్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువ త వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చా రు. పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చిన ప్రజాసమస్యలపై ప్రధాని మోదీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ఉపన్యాసాలతో పక్కదారి పట్టించారని ఆరోపించా రు. ఐదేళ్లలో కశ్మీర్ సమస్య మరింత జఠిలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు కశ్మీరీలు వలస వెళ్లి జీవించే పరిస్థితి లేకుండా చేశారన్నారు. పుల్వామా ఉగ్రదాడికి పెద్దమొత్తంలో ఆర్డీఎక్స్ ఎలా వచ్చిందని ఎవరూ ప్రశ్నించడం లేదని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు రఫేల్ తప్ప ఇంకేమీ పట్టింపు లేద ని విమర్శించారు. పాలకులు మారుతున్నారే తప్ప మైనారిటీలకు ఒనగూరుతున్న అభివృద్ధి శూన్యమన్నారు. కలసికట్టుగా ముందుకు వెళ్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణ యం తీసుకుంటునే సమర్ధవంతమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. రాజకీయాల్లో త్యాగా లు పనికి రావని, బతికి ఉండి ప్రజాసేవ చేయాలన్నారు. యువత టీవీలను వీక్షించడం తగ్గించి పత్రికలు చదివి మరింత జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఎంపీ కోటా నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఆరు రోజులు పార్టీ కార్యాలయమైన దారుస్సాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. యువత పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
రూ. 50 కోట్లతో రాష్ట్రపతి అవసరమా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవన్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. 21 తుపాకులతో గౌరవ వందనం, అనంతరం శ్వేతవర్ణ దుస్తులు ధరించిన భద్రతా సిబ్బంది రాచరిక చిహ్నంగా కత్తులతో అశ్వారోహకులై ముందు కవాతుతో కదంతొక్కుతుండగా కోవింద్ కారు మందగమనంతో ముందుకు సాగింది. దారి పొడువున వివిధ భద్రతా దళాల సాల్యూట్ను స్వీకరిస్తూ కోవింద్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాజు వెడల రవితేజములరయగా.....అన్నట్లూ ఆర్భాటం చూస్తే ఆహా! ఎంత శోభాయమానంగా ఉందని ఎవరైనా అనుకోవచ్చు! నేటి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాష్ట్రపతి పదవి అవసరమా ? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. రాష్ట్రపతికి నిజమైన అధికారాలు ఇవ్వడం లేదని, అలంకార ప్రాయమైన పదవని రాజ్యాంగ నిర్మాతలే అభివర్ణించారు. రాష్ట్రపతి అన్న పదవి 'జాతికి ఒక చిహ్నం' అని బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి 'గొప్ప ఉత్సవ విగ్రహం' అని తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించారు. దేశాన్ని పరిపాలించని గౌరవ ప్రధమైన అధికారి మాత్రమేనని, ఇంగ్లండ్‌లో రాచరిక వ్యవస్థకు చిహ్నంగా భారత రాష్ట్రపతి పదవి అన్న ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఈ పదవిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు. మరి అలంకార ప్రాయమైన భారత రాష్ట్రపతి పదవిని కొనసాగించడానికి ఏడాదికి 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఎంతమేరకు సమంజసం. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి భవనం నిర్వహణ కోసం 41.96 కోట్ల రూపాయలను దేశ ప్రభుత్వం కేటాయించింది. ముంబయికి చెందిన మన్సూర్ దార్వేష్ (65) దాఖలు చేసిన ఆర్టీఐ కింద రాష్ట్రపతి భవన్ బడ్జెట్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి భవన్లో 754 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 9 మంది ప్రైవేటు కార్యదర్శులు, 8 మంది టెలిఫోన్ ఆపరేటర్లు, 27 మంది డ్రైవర్లు, 64 మంది వివిధ రకాలు పనులు చేసే వారున్నారు. వీరందరికి జీతాల కింద నెలకు కోటిన్నర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది. 2015, మే నెలకు చెల్లించిన జీతాల మొత్తం 1.52 కోట్ల రూపాయలు. అదే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు గాను టెలిఫోన్ బిల్లులు 4.25 లక్షలు, 5.01 లక్షల రూపాయలుగా వచ్చాయి. విద్యుత్ ఛార్జీలు, భద్రతా సిబ్బంది జీతభత్యాలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఆ వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించడానికి రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. అలంకారప్రాయమైన పదవిని ఇంతఖర్చుతో కొనసాగించాల్సిన అవసరం ఉందా? రాష్ట్రపతి పదవికి అతి తక్కువ అధికారాలు ఉన్నప్పటికీ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో ఆయన నిర్వహించే పాత్ర పెద్దదని వాదించే ప్రజాస్వామిక వాదులు కూడా ఉన్నారు. 1990వ దశకంలో లాగా ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సందర్భాల్లో రాష్ట్రపతి కీలకం అవుతారని, 1975లో నాటి రాష్ట్రపతి సంతకం చేస్తేనే ఎమర్జెన్సీ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయన్నది వారి వాదన. ఎమర్జెన్సీ వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగిందన్నది అందరికి తెల్సిందే. నాడు రాష్ట్రపతి సంతకం చేయకపోతే ఎమర్జెన్సీ ఆగిపోయేదా! స్పష్టత లేదు. పార్లమెంట్ వెలుపల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు తలెత్తే పరిస్థితిని కోర్టుల ద్వారా చక్కబెట్టుకోవచ్చు. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండి, రాజ్యసభలో కూడా మెజారిటీ దిశగా పాలకపక్షం పయనిస్తున్న నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ లాంటి వ్యక్తులు ఏ మేరకు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉండగలరనేది కోటి రూకల ప్రశ్న. ఆర్డినెన్స్‌ల తప్పుడు సంప్రదాయానికి చరమగీతం పాడాలంటూ పదవి నుంచి తప్పుకుంటూ ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డినెన్స్‌లను రామ్‌నాథ్ లాంటి వారు తిప్పి పంపగలరా? మోదీ విధేయులే రాష్ట్రపతి భవన్ అధికారులుగా నియమితులైనట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పనేనా? మరి ఎందుకీ పదవి? ఎవరి కోసం!? -
పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధిపతి?
కేంద్ర ప్రభుత్వం – రాష్ట్రపతి రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకున్నారు. ఇది భారత పరిస్థితులకు అనువైంది. భారతదేశం బ్రిటిష్‌వారి పాలనలో చాలాకాలం ఉండటం వల్ల పార్లమెంటరీ వ్యవస్థకు ప్రజలు అలవాటుపడ్డారు. అలాగే పార్లమెంటరీ వ్యవస్థ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. వివిధ వైవిధ్యాలున్న భారత్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి పార్లమెంట్ వ్యవస్థ అనువైంది. అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకోలేదు? రాజ్యాంగ కమిటీ సభ్యులైన ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్లు.. పార్లమెంటరీ వ్యవస్థను సమర్థించగా, ప్రొ. కె.టి.షా, కె.ఎం. మున్షీలు రాజ్యాంగ పరిషత్ చర్చల్లో అధ్యక్ష తరహా పద్ధతిని సమర్థించారు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించదు. దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడానికి ప్రజల్లో ఆశించిన మేరకు రాజకీయ చైతన్యం ఉండాలి. భారత్‌లో ఆనాటికి ఈ పరిస్థితులు లేవు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోలేదు. పార్లమెంటరీ ప్రభుత్వ ముఖ్య లక్షణాలు ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించి ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్ష తరహాలుగా వర్గీకరిస్తారు. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసన శాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. అంటే శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య అధికార మిళితం ఉంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్రభుత్వాలంటారు. ఉదా: బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాఅధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. అలాగే శాసన శాఖకు బాధ్యత వహించదు. ఈ రెండు అంగాల మధ్య అధికార పృథక్కరణ ఉంటుంది. ఉదా: అమెరికా, ఫ్రాన్స్, అర్జెంటీనా మొదలైనవి. పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాల అధిపతులుంటారు. 1) నామమాత్రపు అధిపతి 2) వాస్తవాధిపతి. రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటారు. అన్ని అధికారాలు రాష్ట్రపతి పేరున జరుగుతాయి. చట్టపరంగా అధికారాలుంటాయి కాబట్టి రాష్ట్రపతిని చట్టపర అధిపతి అని కూడా అంటారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలిని వాస్తవ లేదా రాజకీయ అధిపతి అంటారు. చట్టపరంగా అధికారం లేకున్నా వాస్తవానికి అన్ని అధికారాలను వీరే చెలాయిస్తారు. కాబట్టి వీరిని అధిపతి అంటారు. పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలికి సంయుక్త, వ్యక్తిగత బాధ్యతలుంటాయి. వీరు సంయుక్తంగా లోక్‌సభకు, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి, క్యాబినెట్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని క్యాబినెట్ లేదా ప్రధానమంత్రి ప్రభుత్వం అని కూడా అంటారు. అధ్యక్ష తరహా ప్రభుత్వ ముఖ్య లక్షణాలు అధికార పృ«థక్కరణ: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. మంత్రులు శాసన సభలో సభ్యులుకారు. శాసనసభకు బాధ్యత వహించరు. రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతి ఒకరే: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఆ దేశ అధ్యక్షుడే దేశాధిపతిగా, ప్రభుత్వాధిపతిగా కొనసాగుతారు. సర్వాధికారాలు అధ్యక్షుడి చేతిలోనే ఉంటాయి. నామమాత్ర, వాస్తవ అధిపతులు అనే విభజన ఉండదు. నిర్ణీత పదవీకాలం: అధ్యక్షుడి పదవీకాలం నిర్ణీతం. పార్లమెంటరీ ప్రభుత్వంలోలాగా శాసనశాఖ విశ్వాసంపై ఆధార పడదు. అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుడిని తొలగించడానికి వీల్లేదు. అందువల్ల అధ్యక్షుడు నిర్ణీత కాలం పదవిలో కొనసాగుతారు. సంయుక్త బాధ్యత ఉండదు: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు తన మంత్రివర్గం, శాసన శాఖకు బాధ్యత వహించడం ఉండదు. వారి తప్పొప్పులను శాసన సభ వివిధ తీర్మానాల ద్వారా విమర్శించే అవకాశం ఉండదు. అందుకే అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని బాధ్యతారహిత ప్రభుత్వం అంటారు. రాజకీయ విజాతీయత: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు తన విచక్షణ మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి కూడా మంత్రులను నియమించుకోవచ్చు. అందువల్ల వివిధ రాజకీయ భావజాలం ఉన్నవారు కూడా మంత్రిమండలిలో కొనసాగవచ్చు. మంత్రులు అధ్యక్షుడికి సలహాదారులు మాత్రమే: అధ్యక్ష తరహాలో సర్వాధికారాలు అధ్యక్షుడికే ఉంటాయి. మంత్రులు కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు. సమాన హోదా ఉండదు. కానీ పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రిమండలి, ప్రధానమంత్రి సహోద్యోగులుగా కొనసాగుతారు. అధ్యక్ష తరహా ప్రభుత్వం ప్రధానంగా అమెరికాలో అమల్లో ఉంది. ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఇతర దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉన్నా దాన్ని పార్లమెంటరీ–అధ్యక్ష తరహా మిశ్రమంగానే చెప్పవచ్చు. భారత రాజ్యాంగం – రాష్ట్రపతి భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను పేర్కొంటాయి. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. ప్రకరణ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా లేదా తన కింది అధికారుల సహాయంతో నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రిమండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగం పరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినా, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే వాటిని చెలాయిస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ప్రకరణ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది. ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. గమనిక: కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు. ఇది 1995 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రకరణ 54లో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక వైవిధ్యంగా ఉంటుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎంఎల్ఏ, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు. ఎంఎల్ఏల ఓటు విలువ = వివరణ: 1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026 వరకు పొడిగించారు. n ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓటు విలువ 148కి సమానంగా (2012లో 14వ రాష్ట్రపతి ఎన్నికల ప్రకారం) ఉండేది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ విలువ మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ ఓటు విలువ 158, తెలంగాణ ఎంఎల్ఏ ఓటు విలువ 133 ఉండొచ్చు. అత్యధిక ఓటు విలువ ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ – 208 తమిళనాడు – 176 జార్ఖండ్ – 176 మహారాష్ట్ర – 175 బిహార్ – 173 అతి తక్కువ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు సిక్కిం – 7 మిజోరాం – 8 అరుణాచల్ ప్రదేశ్ – 8 నాగాలాండ్ – 9 ఎంపీల ఓటు విలువ = ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. 2012లో 13వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలఓటు విలువ 708. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అభ్యర్థికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ. సూత్రం పరంగా చెప్పాలంటే -
వీరబాహుడు విప్లవిస్తే...!
కొత్త కోణం ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన వృత్తిని చేసుకొనే హక్కు, లేదా ఆ వృత్తిని కాదనుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. దీనిని ధిక్కరించే, కాదనే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఈ వృత్తిలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలి. వారు కాదనుకుంటే వారికి గౌరవప్రదమైన మరోవృత్తిలో చోటివ్వాలి. ఎవరైనా అందులో పనిచేయడానికి అంగీకరిస్తే ప్రభుత్వమే జీతాలు చెల్లించి సౌకర్యాలు కల్పించి, ఒక నూతన విధానానికి రూపకల్పన చేయాలి. ‘‘ప్రజాస్వామ్యం అనేది పార్లమెంటరీ వ్యవస్థతో, లేదా రిపబ్లిక్ తరహా పాలనతో మాత్రమే పోల్చదగినది కాదు. ప్రజాస్వామ్య మూలాలు ప్రభుత్వ పాలనా విధానంలో లేవు. సామాజిక సహజీవనానికి ప్రజాస్వామ్యం ఒక నమూనా. ప్రజాస్వామ్య మూలాలను సామాజిక సంబంధాలలో వెతకాలి. ఒక సమాజంగా ఏర్పడిన ప్రజలు కలిసి జీవించడంలోనే ప్రజాస్వామ్యశక్తి నిండి ఉంటుంది’’ అని ‘ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అనే అంశం మీద డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వాయిస్ ఆఫ్ అమెరికా (రేడియో) కోసం చేసిన ప్రసం గంలో (మే 1, 1956) పేర్కొన్నారు. మనుస్మృతి ప్రభావం ఏ ప్రభుత్వాలు, ఎటువంటి చట్టాలతో పాలన కొనసాగిస్తున్నప్పటికీ ప్రజల్లో ఉన్న తిరోగమన భావాలూ, ఆలోచనలే ఆచరణలో ఆధిక్యం చూపుతూ ఉం టాయి. అందుకే సామాజిక ప్రజాస్వామ్యం అనేది ప్రజల మధ్య సమాన సంబంధాలను నెలకొల్పాలని చెపుతుంది. కానీ ప్రజల మెదళ్లలో అలాంటి భావనలను పాదుకొల్పలేనంత వరకు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. జనవరి 26, 1950న ఆమోదించిన మన రాజ్యాంగం ప్రకారం అంట రానితనం నిషిద్ధం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషాపరమైన వివక్షలకు ఇక్కడ స్థానం లేదు. అంటరానితనాన్ని పాటించే వాళ్లు శిక్షార్హులని కూడా చట్టం చెపుతోంది. కానీ సమాజంలో వేళ్లూనుకొని ఉన్న కుల వ్యవస్థ మూలాలు ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందకుండా అవరోధాలు కల్పిస్తూనే ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు అసమా నతలనూ, అంటరానితనాన్నీ నిరోధించడానికి సంబంధించి లిఖిత పూర్వక చట్టమేదీ లేదు. కానీ కులాల, వివిధ వర్గాల స్థానం, స్థాయి ఏమిటో నిర్దేశించే మనుస్మృతి ఉనికిలో ఉన్నది. ఇది రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన సభ్యులు ఆమోదించిన అంగీకార పత్రం కాదు. కొందరి ప్రయోజనాల కోసం ఈ స్మృతి రూపొందింది. అయినా నేటికీ ఇదే ప్రజల మెదళ్ల మీద పనిచేస్తోంది, నడిపిస్తోంది. మనుస్మృతిలోని పదవ అధ్యాయం, 39వ శ్లోకంలో పేర్కొన్నట్టుగా నిషాద స్త్రీకీ, చండాల పురుషునికీ జన్మించినవాడు అంత్యవాసి. శ్మశానంలో పని చేయడమే అతడి వృత్తి. బొందలు తవ్వడం, కాష్టాలు పేర్చడం లాంటివి చేయాలి. అంతేకాకుండా, ఎనిమిదవ అధ్యాయంలోని, 281వ శ్లోకంలో ‘ఉన్నత కులానికి చెందిన వ్యక్తి స్థానాన్నీ, స్థితినీ చేరుకోవడానికి ప్రయత్నిం చిన అంత్య కుల జుడి తొడపై ఇనుప ముక్క కాల్చి వాతపెట్టాలి’ అని పేర్కొ న్నారు. మనువాదం అంతరార్థం అంతా అసమానతలు కొనసాగుతూ ఉండ డమే. కొన్ని వర్గాల మీద మనువాదం చిమ్మిన విషం తరాలు గడిచినా మాసి పోనంత గాఢంగా ఉందని చెప్పడానికి కొద్దిరోజుల క్రితం తెలంగాణలో జరి గిన ఒక సంఘటన నిదర్శనం. ఎల్లోయి దురంతమిది మెదక్ జిల్లా, ఝరాసంగం మండలం, ఎల్లోయి గ్రామంలో 120 దళిత కుటుంబాలను మిగిలిన కుటుంబాలు సామాజికంగా బహిష్కరించాయి. కులవృత్తిని చేయనందుకు ఈ వేటు పడింది. జీవితమంతా ఎవరికైతే రక్త మాంసాలు ధారపోశారో వారే చేలల్లో పనికి రానివ్వకుండా నిషేధించారు. వారి కులవృత్తి డప్పులు మోగించడాన్ని సయితం గ్రామం నిరోధించింది. ఆ కులాల వారు నడిపే ఆటోలు ఎక్కకుండా పొట్ట కొట్టింది. దుకాణాల్లో సరు కులు కొనుక్కోవడం కూడా నేరమైంది. ప్రభుత్వం నడుపుతున్న ఉపాధి హామీ పనుల్లోకి సైతం అనుమతించలేదు. ఇంతకీ ఈ దళితులు చేసిన ‘తప్పు ఏమిట’ని ప్రశ్నిస్తే; శవాలను పూడ్చే పనికే వీళ్లు పుట్టారు... ఆ పని చేయలేదు కనుక బహిష్కరించామని తేల్చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తినీ కూడా ఫలానా పని మాత్రమే చేయాలని బలవంతం చేయకూడదు. పౌరహక్కుల చట్టం; ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టంలోని ఆర్టికల్ 3, క్లాజు -6 ప్రకారం బలవంతంగా పనులు చేయించడం, వెట్టి చాకిరీ చేయించడం నేరం. అయితే ఆ గ్రామంలోని దళి తేతర కులాల పెద్దలకు రాజ్యాంగంలోని అంశాలు తెలియవు, తెలుసుకో వాల్సిన అవసరం రాలేదు. వారికి మనువు ప్రబోధించిన ‘ధర్మ’శాస్త్రం మాత్రమే తెలుసు. దాని ప్రకారమే ఎల్లోయి గ్రామ దళితేతర కులాల పెద్దలు బొందలు తవ్వకపోతే మీకు గ్రామంలో ఉండే అర్హత లేదని ప్రకటించారు. సరిగ్గా ఇదే విషయాన్ని మనువు తన ‘ధర్మ’ సూత్రాలలో పేర్కొనడం గమనిం చవచ్చు. 8వ అధ్యాయం, 281 శ్లోకంలో చెప్పినట్టుగానే ఉన్నత కులాల వలే ఉండాలనుకుంటే గ్రామం నుంచి బహిష్కరించాలి అనే మనువాద సూత్రాన్ని అక్కడ అమలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి దళిత సంఘాలు నిర్వ హించిన ఉద్యమ ఫలితంగా ప్రజాప్రతినిధులు, అధికారులు దిగివచ్చి చట్ట ప్రకారం దోషులను శిక్షిస్తామని, దళితులకు సహాయ సహకారాలు అందిస్తా మని హామీ యిచ్చారు. అయితే ఇది కేవలం చట్టాన్ని అమలు చేసే అధికార ప్రక్రియ మాత్రమే. ఆ గ్రామస్తుల మెదళ్ల నుంచి ఆ భావాన్ని తొలగించే ప్రక్రి యకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలపై జరు గుతున్న అత్యాచారాలకు సంబంధించిన అవగాహనను ఇటు ఎస్సీ, ఎస్టీలలో, అటు దళితేతర కులాల్లో సైతం ప్రభుత్వం కలిగించాలి. దళితేత రులకు ఇది మరింత అవసరం. ఇటువంటి ఘటనలే కర్ణాటకలో ఆరు నెలల వ్యవధిలో రెండు జరి గాయి. హసన్ జిల్లా అర్కల్ గూడ తాలూకాలోని సిద్ధపుర గ్రామంలోను, ఇదే తాలూకాలోని కేర్ గోడు గ్రామంలోను ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ రెండు గ్రామాల్లో కూడా తమ పూర్వీకులలాగా బొందలు తవ్వడానికి నిరాక రించినందుకే ఆ గ్రామాలలోని దళితులను బహిష్కరించారు. ఆ గ్రామాలకు మంత్రి సోమన్న వెళ్లి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కేసులకు, చట్టానికి భయపడి తాత్కాలికంగా సర్దుకున్నట్టు కనిపిస్తారు. కానీ అంత రాంతరాల్లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను అంతతేలికగా వదులు కునే పరిస్థితి లేదు. కులవ్యవస్థ నిర్దేశించిన వృత్తుల్లో బొందలు తవ్వడం, శ్మశానాలను కాపలాకాయడం కూడా ఉన్నాయి. ఈ పనికి కొన్ని కులాలను కేటాయించారు. అది అంటరాని కులాల్లో భాగంగా ఉన్నవాళ్లు చేయాలని నిర్ణ యించారు. అయితే చాలా చోట్ల అంటరాని కులాల్లో ఎవరైనా చేస్తారు. కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ, కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోనూ మాలల్లో బ్యాగరి ఉపకులం ఈ పనిని నిర్వహిస్తున్నది. మెదక్ జిల్లాలోని ఎల్లోయి గ్రామంలో ఇదే ఉపకుల ం ఆ వృత్తిని నీచంగా భావించి బొందలు తవ్వడానికి నిరాకరించింది. ఈ పనిని చేస్తున్న వాళ్ళని సమాజం నీచంగా చూస్తున్నది. దీనితో ఆ కులంలో చదువుకున్న యువత దీనిని ఆత్మగౌరవ సమస్యగా తీసుకొని సంప్రదాయాన్ని ధిక్కరించింది. నిజానికి ఇతర మతాలలో ఒకే కుటుంబమో, లేక ఒక తెగనో ఇటువంటి కార్యాన్ని నిర్వహించే విధానం లేదు. హిందూమతంలోని కుల వ్యవస్థే దీనిని పెంచి పోషిస్తున్నది. ఏ శ్మశానంలోనైతే వీరిని పనిచేయాలని కట్టడి చేస్తున్నారో, బొందలు తవ్వకుంటే బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారో, ఈ కులాల వారు మరణిస్తే మాత్రం అదే శ్మశానంలో మూడడుగుల జాగా ఇవ్వరు. అడుగుపెట్టేందుకు కూడా శవాల పక్కన స్థలం ఉండదు. ఈనాటికీ వందలాది గ్రామాల్లో శవాలు పూడ్చిపెట్టుకునే దిక్కులేక వాగుల్లో వంకల్లో దళితులు పాతిపెడుతున్నారు. అగ్రకులాల ఇళ్లముందు నుంచి దళితుల శవాలను మోసినందుకు ఆ దారులే మూసేసిన దౌర్భాగ్యమైన వ్యవస్థ మనది. ఈ పరిస్థితి మారాలి మరొకవైపు హైదరాబాద్ ఇతర జిల్లా కేంద్రాల్లో బొందల గడ్డల్లో, శ్మశాన వాటికల్లో పనిచేస్తున్న వాళ్లు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు. వీరంతా గత్యంతరం లేక బొందలగడ్డలే నివాసాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ వాళ్లకు ఎటువంటి సహకారం అందదు. మరో మార్గం లేక అంత్యక్రియలు చేయించేందుకు వచ్చిన వాళ్ళను అడుక్కుంటూ, అంటే చావు దగ్గర కూడా బిచ్చమెత్తుకొని జీవనం సాగిస్తు న్నారు. శవాల దహనం వల్ల వచ్చే పొగ, దుర్గంధం, కాలుష్యం వల్ల ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. బొందలు తవ్వబోమని ధిక్కరించినందుకు సామాజిక బహిష్కరణ చేస్తున్న సమాజం; దిక్కులేక అదే బొందలగడ్డలో దిక్కులేని జీవితం గడుపుతున్న వారిపట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం. అంటే దళితుడు ఎటువంటి ఫలితాన్నీ ఆశించకుండా అగ్రవర్ణాలకు, ఇతర కులాలకు జన్మతః బానిసై ఉండాలనే దుర్మార్గపు భావజాలానికి తార్కాణమే ఈ సంఘటన. చివరగా ఒక్కమాట. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జి.హెచ్.ఎం.సి. ఆధ్వర్యంలో ఆధునిక వసతులతో ‘మహాప్రస్థానం’ పేరుతో ఒక శ్మశానాన్ని నిర్మించారు. దీనికి చాలా ప్రచారం వచ్చింది. అందులో పనిచేస్తున్న వాళ్లు ఉద్యోగులుగా ఉన్నారు. ఇది ఒక ఆధునిక చర్య. ఇదే సౌకర్యాన్ని గ్రామా ల్లోనూ కల్పించాలి. ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన వృత్తిని చేసుకొనే హక్కు, లేదా ఆ వృత్తిని కాదనుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. దీనిని ధిక్కరించే, కాదనే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఈ వృత్తిలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలి. వారు కాదను కుంటే వారికి గౌరవప్రదమైన మరోవృత్తిలో చోటివ్వాలి. ముందుగా ఈ ఇరవై ఐదు వేల మందికి ఆ మురికి కూపం నుంచి విముక్తి కలిగించాలి. ఎవరైనా అందులో పనిచేయడానికి అంగీకరిస్తే ప్రభు త్వమే జీతాలు చెల్లించి సౌకర్యాలు కల్పించి, ఒక నూతన విధానానికి రూప కల్పన చేయాలి. ఎవరైనా ఆ వృత్తి నుంచి బయటకు రావాలనుకుంటే వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య