
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. 21 తుపాకులతో గౌరవ వందనం, అనంతరం శ్వేతవర్ణ దుస్తులు ధరించిన భద్రతా సిబ్బంది రాచరిక చిహ్నంగా కత్తులతో అశ్వారోహకులై ముందు కవాతుతో కదంతొక్కుతుండగా కోవింద్ కారు మందగమనంతో ముందుకు సాగింది. దారి పొడువున వివిధ భద్రతా దళాల సాల్యూట్‌ను స్వీకరిస్తూ కోవింద్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. రాజు వెడల రవితేజములరయగా.....అన్నట్లూ ఆర్భాటం చూస్తే ఆహా! ఎంత శోభాయమానంగా ఉందని ఎవరైనా అనుకోవచ్చు!
నేటి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాష్ట్రపతి పదవి అవసరమా ? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. రాష్ట్రపతికి నిజమైన అధికారాలు ఇవ్వడం లేదని, అలంకార ప్రాయమైన పదవని రాజ్యాంగ నిర్మాతలే అభివర్ణించారు. రాష్ట్రపతి అన్న పదవి 'జాతికి ఒక చిహ్నం' అని బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి 'గొప్ప ఉత్సవ విగ్రహం' అని తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించారు. దేశాన్ని పరిపాలించని గౌరవ ప్రధమైన అధికారి మాత్రమేనని, ఇంగ్లండ్‌లో రాచరిక వ్యవస్థకు చిహ్నంగా భారత రాష్ట్రపతి పదవి అన్న ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఈ పదవిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు.
మరి అలంకార ప్రాయమైన భారత రాష్ట్రపతి పదవిని కొనసాగించడానికి ఏడాదికి 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఎంతమేరకు సమంజసం. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి భవనం నిర్వహణ కోసం 41.96 కోట్ల రూపాయలను దేశ ప్రభుత్వం కేటాయించింది. ముంబయికి చెందిన మన్సూర్ దార్వేష్ (65) దాఖలు చేసిన ఆర్టీఐ కింద రాష్ట్రపతి భవన్ బడ్జెట్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి భవన్‌లో 754 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 9 మంది ప్రైవేటు కార్యదర్శులు, 8 మంది టెలిఫోన్ ఆపరేటర్లు, 27 మంది డ్రైవర్లు, 64 మంది వివిధ రకాలు పనులు చేసే వారున్నారు. వీరందరికి జీతాల కింద నెలకు కోటిన్నర నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది.
2015, మే నెలకు చెల్లించిన జీతాల మొత్తం 1.52 కోట్ల రూపాయలు. అదే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు గాను టెలిఫోన్ బిల్లులు 4.25 లక్షలు, 5.01 లక్షల రూపాయలుగా వచ్చాయి. విద్యుత్ ఛార్జీలు, భద్రతా సిబ్బంది జీతభత్యాలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఆ వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించడానికి రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. అలంకారప్రాయమైన పదవిని ఇంతఖర్చుతో కొనసాగించాల్సిన అవసరం ఉందా?
రాష్ట్రపతి పదవికి అతి తక్కువ అధికారాలు ఉన్నప్పటికీ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో ఆయన నిర్వహించే పాత్ర పెద్దదని వాదించే ప్రజాస్వామిక వాదులు కూడా ఉన్నారు. 1990వ దశకంలో లాగా ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సందర్భాల్లో రాష్ట్రపతి కీలకం అవుతారని, 1975లో నాటి రాష్ట్రపతి సంతకం చేస్తేనే ఎమర్జెన్సీ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయన్నది వారి వాదన. ఎమర్జెన్సీ వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరిగిందన్నది అందరికి తెల్సిందే. నాడు రాష్ట్రపతి సంతకం చేయకపోతే ఎమర్జెన్సీ ఆగిపోయేదా! స్పష్టత లేదు. పార్లమెంట్ వెలుపల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు తలెత్తే పరిస్థితిని కోర్టుల ద్వారా చక్కబెట్టుకోవచ్చు.
లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండి, రాజ్యసభలో కూడా మెజారిటీ దిశగా పాలకపక్షం పయనిస్తున్న నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ లాంటి వ్యక్తులు ఏ మేరకు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉండగలరనేది కోటి రూకల ప్రశ్న. ఆర్డినెన్స్‌ల తప్పుడు సంప్రదాయానికి చరమగీతం పాడాలంటూ పదవి నుంచి తప్పుకుంటూ ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డినెన్స్‌లను రామ్‌నాథ్ లాంటి వారు తిప్పి పంపగలరా? మోదీ విధేయులే రాష్ట్రపతి భవన్ అధికారులుగా నియమితులైనట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పనేనా? మరి ఎందుకీ పదవి? ఎవరి కోసం!?