పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధిపతి? | Constitutional producers parliamentary system | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధిపతి?

Published Wed, Jan 25 2017 4:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధిపతి? - Sakshi

పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ అధిపతి?

కేంద్ర ప్రభుత్వం – రాష్ట్రపతి
రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకున్నారు. ఇది భారత పరిస్థితులకు అనువైంది. భారతదేశం బ్రిటిష్‌వారి పాలనలో చాలాకాలం ఉండటం వల్ల పార్లమెంటరీ వ్యవస్థకు ప్రజలు అలవాటుపడ్డారు. అలాగే పార్లమెంటరీ వ్యవస్థ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది. వివిధ వైవిధ్యాలున్న భారత్‌లో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి పార్లమెంట్‌ వ్యవస్థ అనువైంది.

అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకోలేదు?
రాజ్యాంగ కమిటీ సభ్యులైన ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌లు.. పార్లమెంటరీ వ్యవస్థను సమర్థించగా,
ప్రొ. కె.టి.షా, కె.ఎం. మున్షీలు రాజ్యాంగ పరిషత్‌ చర్చల్లో అధ్యక్ష తరహా పద్ధతిని సమర్థించారు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభకు బాధ్యత వహించదు. దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడానికి ప్రజల్లో ఆశించిన మేరకు రాజకీయ చైతన్యం ఉండాలి. భారత్‌లో ఆనాటికి ఈ పరిస్థితులు లేవు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోలేదు.

పార్లమెంటరీ ప్రభుత్వ ముఖ్య లక్షణాలు
ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించి ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్ష తరహాలుగా వర్గీకరిస్తారు. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడి శాసన శాఖ విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. అంటే శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య అధికార మిళితం ఉంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్రభుత్వాలంటారు. ఉదా: బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాఅధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. శాసన శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. అలాగే శాసన శాఖకు బాధ్యత వహించదు. ఈ రెండు అంగాల మధ్య అధికార పృథక్కరణ ఉంటుంది. ఉదా: అమెరికా, ఫ్రాన్స్, అర్జెంటీనా మొదలైనవి.

పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాల అధిపతులుంటారు. 1) నామమాత్రపు అధిపతి
2) వాస్తవాధిపతి.
రాష్ట్రపతి లేదా రాజు నామమాత్రపు అధిపతిగా ఉంటారు. అన్ని అధికారాలు రాష్ట్రపతి పేరున జరుగుతాయి. చట్టపరంగా అధికారాలుంటాయి కాబట్టి రాష్ట్రపతిని చట్టపర అధిపతి అని కూడా అంటారు.
ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలిని వాస్తవ లేదా రాజకీయ అధిపతి అంటారు. చట్టపరంగా అధికారం లేకున్నా వాస్తవానికి అన్ని అధికారాలను వీరే చెలాయిస్తారు. కాబట్టి వీరిని  అధిపతి అంటారు.

పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలికి సంయుక్త, వ్యక్తిగత బాధ్యతలుంటాయి. వీరు సంయుక్తంగా లోక్‌సభకు, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు.
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి, క్యాబినెట్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని క్యాబినెట్‌ లేదా ప్రధానమంత్రి ప్రభుత్వం అని కూడా అంటారు.

అధ్యక్ష తరహా ప్రభుత్వ ముఖ్య లక్షణాలు
అధికార పృ«థక్కరణ: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. మంత్రులు శాసన సభలో సభ్యులుకారు. శాసనసభకు బాధ్యత వహించరు.
రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతి ఒకరే: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఆ దేశ అధ్యక్షుడే దేశాధిపతిగా, ప్రభుత్వాధిపతిగా కొనసాగుతారు. సర్వాధికారాలు అధ్యక్షుడి చేతిలోనే ఉంటాయి. నామమాత్ర, వాస్తవ అధిపతులు అనే విభజన ఉండదు.

నిర్ణీత పదవీకాలం: అధ్యక్షుడి పదవీకాలం నిర్ణీతం. పార్లమెంటరీ ప్రభుత్వంలోలాగా శాసనశాఖ విశ్వాసంపై ఆధార పడదు. అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుడిని తొలగించడానికి వీల్లేదు. అందువల్ల అధ్యక్షుడు నిర్ణీత కాలం పదవిలో కొనసాగుతారు.

సంయుక్త బాధ్యత ఉండదు: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు తన మంత్రివర్గం, శాసన శాఖకు బాధ్యత వహించడం ఉండదు. వారి తప్పొప్పులను శాసన సభ వివిధ తీర్మానాల ద్వారా విమర్శించే అవకాశం ఉండదు. అందుకే అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని బాధ్యతారహిత ప్రభుత్వం అంటారు.

రాజకీయ విజాతీయత: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు తన విచక్షణ మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర పార్టీల నుంచి కూడా మంత్రులను నియమించుకోవచ్చు. అందువల్ల వివిధ రాజకీయ భావజాలం ఉన్నవారు కూడా మంత్రిమండలిలో కొనసాగవచ్చు.

మంత్రులు అధ్యక్షుడికి సలహాదారులు మాత్రమే: అధ్యక్ష తరహాలో సర్వాధికారాలు అధ్యక్షుడికే ఉంటాయి. మంత్రులు కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు. సమాన హోదా ఉండదు. కానీ పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రిమండలి, ప్రధానమంత్రి సహోద్యోగులుగా కొనసాగుతారు.

అధ్యక్ష తరహా ప్రభుత్వం ప్రధానంగా అమెరికాలో అమల్లో ఉంది. ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఇతర దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉన్నా దాన్ని పార్లమెంటరీ–అధ్యక్ష తరహా మిశ్రమంగానే చెప్పవచ్చు.

భారత రాజ్యాంగం – రాష్ట్రపతి
భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను పేర్కొంటాయి.
కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.
ప్రకరణ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు.

ప్రకరణ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా లేదా తన కింది అధికారుల సహాయంతో నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రిమండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

భారతదేశంలో బ్రిటిష్‌ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగం పరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినా, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే వాటిని చెలాయిస్తుంది.

రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
ప్రకరణ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది. ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు.

గమనిక: కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు. ఇది 1995 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ప్రకరణ 54లో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నిక వైవిధ్యంగా ఉంటుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు.
ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎంఎల్‌ఏ, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు.

ఎంఎల్‌ఏల ఓటు విలువ =
వివరణ: 1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026 వరకు పొడిగించారు.
n    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓటు విలువ 148కి సమానంగా (2012లో 14వ రాష్ట్రపతి ఎన్నికల ప్రకారం) ఉండేది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ విలువ మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎంఎల్‌ఏ ఓటు విలువ 158, తెలంగాణ ఎంఎల్‌ఏ ఓటు విలువ 133 ఉండొచ్చు.

అత్యధిక ఓటు విలువ ఉన్న కొన్ని రాష్ట్రాలు
ఉత్తరప్రదేశ్‌     – 208
తమిళనాడు    – 176
జార్ఖండ్‌     – 176
మహారాష్ట్ర     – 175
బిహార్‌         – 173
అతి తక్కువ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
సిక్కిం         – 7
మిజోరాం     – 8
అరుణాచల్‌ ప్రదేశ్‌    – 8
నాగాలాండ్‌     – 9
ఎంపీల ఓటు విలువ =

ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది.
2012లో 13వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలఓటు విలువ 708.
రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అభ్యర్థికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ. సూత్రం పరంగా చెప్పాలంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement