‘బుగ్గ’లకు సెలవ్!
వీవీఐపీల కార్లకు సైరన్లూ ఉండవు ∙కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిశ్చయించింది.
అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలతోపాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ‘వీఐపీ సంస్కృతిని సూచించే అన్ని రంగుల బుగ్గలను తొలగించాలనుకుంటున్నాం.. ఇలాంటి వాటికి ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదు’ అని ప్రభుత్వం తెలిపింది. భేటీ వివరాలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘మే 1 తర్వాత ఎవరి వాహనాలపైనా బుగ్గలుండకూడదు.
కేవలం అత్యవసర వాహనాలపైనే నీలి బుగ్గలుంటాయి. కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ ఎవరికీ ఇలాంటి బుగ్గలను వాహనాలపై పెట్టుకునేందుకు అనుమతిచ్చే అధికారం ఉండదు. దీనికెవరూ మినహాయింపు కాదు. ఎందుకంటే బుగ్గలకు సంబంధించిన నిబంధనలనే చట్టం నుంచి తొలగిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. చాలాకాలంగా దీనిపై చర్చ జరుగుతోం దన్న కేంద్ర మంత్రి.. దీనికి అనుగుణంగా కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల్లో సవరణలు చేస్తామన్నారు. ఇప్పటికే వీఐపీ వాహనాలకు బుగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి.
ప్రజాస్వామ్య విలువల బలోపేతానికే..
‘ప్రజల ప్రభుత్వం.. వీఐపీ సంస్కృతిలో భాగమైన వాహనాలపై బుగ్గలు, సైరన్లను తొలగించాలని నిర్ణయించింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య విలువలను ఇది మరింత బలోపేతం చేస్తుంది. వీటిని తొలగించాలంటూ వస్తున్న వినతులను గౌరవిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంది’ అని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎర్రబుగ్గ, సైరన్లను తొలగించి కేబినెట్ భేటీ నిర్ణయాన్ని అమలుచేసిన తొలి మంత్రిగా నితిన్ గడ్కరీ నిలిచారు. మంత్రులు తమ వాహనాలకు సైరన్లు వినియోగించటం సరికాదని.. కేవలం పైలట్ పోలీసు వాహనాలకు మాత్రమే సైరన్లుండాలని మంత్రి తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపర చర్యలు తప్పవన్నారు. ఈ దిశగా వాహన చట్టానికి చేయాల్సిన సవరణలపై ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
ఎన్నికల కమిషన్‌కు నిధులు: ఎన్నికల వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావటంలో భాగంగా.. పేపర్ ట్రయల్ మెషీన్స్‌ను వినియోగించాలన్న ఈసీ ప్రణాళికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లకు అవసరమైన 16,15,000 వీవీపీఏటీ (ఓటు నిర్ధారణ పత్రం) యంత్రాల కోసం రూ. రూ.3,174 కోట్లు ఖర్చుకానుంది. బుధవారం దీనిపై చర్చించిన కేంద్ర కేబినెట్.. తొలి దశలో రూ. 1600 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాది మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక్కో యంత్రం తయారీకి రూ. 19,650 ఖర్చు అవుతుందని అంచనా. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈసీ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇతర కేబినెట్ నిర్ణయాలు:
వ్యాపారుల వద్ద చక్కెర నిల్వల పరిమితిని మరో ఆరునెలలు (ఏప్రిల్ 29 నుంచి అక్టోబర్ 28, 2017 వరకు) పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. 1991–1999 మధ్య చనిపోయిన లేదా గాయపడిన సైనికులు మూడు నెలలపాటు సెలవులను ఎన్‌క్యాష్‌మెంట్ (డబ్బులు పొందటం) చేసుకునేందుకు ఆమోదం తెలిపింది.
ప్రతి భారతీయుడూ వీఐపీనే: మోదీ
‘ప్రతి భారతీయుడూ ప్రత్యేకమే. ప్రతి ఒక్కరూ వీఐపీనే. చాలా కాలం క్రితమే ఈ బుగ్గల తొలగింపు జరగాల్సింది. నేడు గొప్ప ప్రారంభం జరిగింది. నవభారతం స్ఫూర్తిలో ఇవన్నీ సరైనవి కావు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పరీకర్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రాలకు నేరుగా విదేశీ రుణం
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) లాంటి విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రాలు తమ ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకోసం ఓడీఏ(అఫీషియల్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్) భాగస్వాముల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు వీలు కల్పించే మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ రుణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా అప్పు తీసుకునేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. అయితే, కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.