మతం పేరుతో ఓట్లడగటం నేరమా?
కులం, మతం కీలక రాజకీయాంశాలుగా మారాయని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాన్ని ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యగా భావించవచ్చా? అని బుధవారం ప్రశ్నించింది. ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగటాన్ని నేరంగా పరిగణించటం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలో అక్రమ కార్యకలాపాలపై చర్యలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్ పరిధిపై చర్చ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. నన్ను గెలిపిస్తే మీ అభ్యున్నతికి పాటుపడతాను. నాకు ఓటేయండని అడిగితే తప్పేంటి?’ అని కూడా కోర్టు ప్రశ్నించింది.
బుధవారం రోజంతా జరిగిన చర్చలో మంగళవారం నాటి ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అనే విషయాన్ని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అయితే ‘హిందుత్వ’ అంశాన్ని సుప్రీంకోర్టు తర్వాతైనా మరోసారి చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. భారతీయ శిక్ష్మా స్మృతిలోని 153 (ఏ)ను ఉదహరిస్తూ.. మతంపేరుతో ఓట్లు అడగటం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించే వ్యక్తి నేర విచారణకు అర్హుడని సిబల్ కోర్టుకు తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లను రాబట్టుకోవటంలో రాజకీయనేతలు ముదిరిపోయారని.. ఈ పద్ధతికి బ్రేక్ వేయటం తక్షణ అవసరమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలువురి వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.