భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు  | No politician can seek vote in name of religion and caste | Sakshi
Sakshi News home page

భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు 

Published Mon, Oct 16 2023 4:18 AM | Last Updated on Mon, Oct 16 2023 4:18 AM

No politician can seek vote in name of religion and caste - Sakshi

ముహమ్మద్‌ ఫసియొద్దీన్‌: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం 
నిర్వహించవచ్చా?  

ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు.

ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్‌’ యాప్‌ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. 

విద్వేషాలు రెచ్చగొట్టరాదు... 

  • భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. 
  • ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు.  
  • ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు.  
  • ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు.  
  • యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు.   
  • ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. 
  • ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు.  

ఊరేగింపులు... 

  • ఊరేగింపుల రూట్‌ మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి.  
  • ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి.   
  • ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూ­ట్‌లో ఊరేగింపు నిర్వహించే సమ­యంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. 
  • ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  
  • ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు.  

పోలింగ్‌ బూత్‌ల వద్ద.. 

  • ఓటర్లు మినహా పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్‌ కలిగిన వారికి మినహాయింపు.  
  • పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి.   

సభలకు ముందస్తు అనుమతి 

  • శాంతిభద్రతల పరిరక్షణకు చర్య­లు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యం­త్రాం­గానికి తెలియజేయాలి.  
  • సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దర­ఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి.  
  • సభలో లౌడ్‌ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి.  

స్వేచ్ఛగా ఓటు వేసేలా.. 

  • అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి.  
  • తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి.  
  • ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు.  
  • పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు.  
  • పోలింగ్‌బూత్‌ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు.  
  • అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు.  
  • పోలింగ్‌ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్‌ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement