కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారబోతున్నారు. గాంధీ–నెహ్రూ కుటుంబ వారసత్వంతో పాటు ఇందిరాగాంధీ ఆహార్యంతో భవిష్యత్తు భారత రాజకీయాలపై ఆమె చూపించబోయే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2004 లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలి నుండి పోటీ చేసిన తల్లి సోనియాగాంధీ, అమేథీ నుండి పోటీ చేసిన అన్న రాహుల్ గాంధీల తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అడపా దడపా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా – ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జిగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తీవ్ర ప్రచారం చేసినా తన పార్టీని ఘోర పరాజయం నుండి కాపాడలేక పోయారు. కానీ 2022లో జరిగిన హిమాచల్‌ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో అన్నీ తానై అధికార బీజేపీని ఓడించడానికి దోహద పడ్డారు. ఈ విజయం... ఆ తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవటానికి స్ఫూర్తినిచ్చింది.
18వ లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మహిళల మెడలో మంగళ సూత్రాలు మాయం చేస్తారనే మోదీ విమర్శలకు ధీటుగా స్పందించారామె. ‘ఈ దేశ ప్రజల కోసం నా తల్లి సోనియా గాంధీ తన మంగళ సూత్రాన్ని త్యాగం చేసింద’ని మోదీ విమర్శలను తిప్పి కొట్టిన తీరు ఓటర్లను ఆకర్షించినట్లుంది. మరి 4లక్షల మెజారిటీని ఓటర్లు కట్టబెట్టారంటే మామూలు సంగతి కాదు.
లోక్‌సభలో విపక్షం నుండి ప్రభుత్వంపై బలమైన విమర్శలతో విరుచుకుపడే సుప్రియా సూలే, మహువా మొయిత్రాకి తోడుగాప్రియాంక గాంధీ చేరడం విపక్ష ‘ఇండియా’ కూటమికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే.
రాహుల్ గాంధీ ఉత్తర భారత్ నుండి, ప్రియాంక గాంధీ దక్షిణ భారతం నుండి ప్రాతినిధ్యం వహించటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చూడాలి. ఇంతకు ముందు దక్షిణాదికి చెందిన తెలంగాణలోని మెదక్ నుండి ఇందిరా గాంధీ, కర్ణాటకలోని బళ్లారి నుండి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
– డా‘‘ తిరునహరి శేషు ‘ రాజకీయ విశ్లేషకులు, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment