అతిథి ముఖ్యమంత్రులు | Guest Chief Ministers | Sakshi
Sakshi News home page

అతిథి ముఖ్యమంత్రులు

Published Sun, Oct 26 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

అతిథి ముఖ్యమంత్రులు

అతిథి ముఖ్యమంత్రులు

‘ఏక్ దిన్‌కా సుల్తాన్’! ఈ పేరుతో చాటుమాటుగా పిలిపించుకునే దురదృష్టవంతుల తెగ ఒకటి భారత రాజకీయాలలో కనిపిస్తూ ఉంటుంది. వీరి పదవీ వైభోగం మరీ క్షణికం కాదుగానీ, దక్కిన ఆ హోదాను బట్టి విశ్లేషకులు అలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అధిరోహించిన పదవిని పూర్తిస్థాయిలో చలాయించే అవకాశం గానీ, పూర్తికాలం అనుభవించే అదృష్టం కానీ వీరికి సాధారణంగా ఉండవు. వెండితెర మీద అతిథి పాత్రల్లా వస్తారు. అలాగే నిష్ర్కమిస్తారు. ఇలాంటి త్రిశంకుయోగం అడపా దడపా ప్రధాని పదవికి, సర్వ సాధారణంగా ముఖ్యమంత్రి పదవికి పడుతూ ఉంటుంది. వారిలో కొందరు తరువాత ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో దక్కించుకుని ఉండొచ్చు. అలాంటి అదృష్టవంతులు లేకపోలేదు కూడా. లేదా పూర్తిగా కనుమరుగైపోవచ్చు. అలా అని వీరిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని కూడా పిలవరు. కాబట్టి అతిథి ముఖ్యమంత్రి అని పిలుచుకోవచ్చు. అలాంటి అతిథులే ఈవారం మన ‘వివరం’.

ఈ సెప్టెంబర్ ఆఖరున తమిళనాడుకు ఇలాంటి అతిథి ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేశారు. ఆయన పేరు పన్నీర్‌సెల్వం. 2016లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకు ఆయనే పదవిలో కొనసాగే అవకాశం మెండుగా ఉంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడం వల్ల జయలలిత శాసనసభ్యత్వం రద్దయింది. కాబట్టి గతంలో మాదిరిగా ఆమె జైలు నుంచి రాగానే సెల్వం కుర్చీ ఖాళీ చేయవలసిన అవసరం ఇప్పటికి లేదు.
 
ఇలాంటి అతిథి ముఖ్యమంత్రులు భారత రాజకీయాలలో కోకొల్లలు. అన్ని రాష్ట్రాలలోను వీరి ఉనికి కనిపిస్తుంది. ఒక రాజకీయ సంక్షోభంలో ఆ పదవిని చేపడతారు కాబట్టి ఇలాంటి వారి పేర్లను చరిత్ర గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. తమిళ రాజకీయాలకీ, సినిమా రంగానికీ మధ్య బంధం విడదీయలేనిది. రాజకీయాలలో, రాజకీయ నేతల లో సినిమా పోకడలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి.  జయలలిత సంగతే తీసుకుందాం. ఆమె ప్రజలకి అభివాదం చేసే తీరు, గజగమనిలా ఠీవిగా నడిచి వచ్చే తీరు, ముఖంలో సందర్భానికి తగ్గట్టు తూకం వేసినట్టు ఉండే చిరునవ్వు లేదా గాంభీర్యం అంతా ఒక మహారాణి పాత్ర మీద చిత్రీకరిస్తున్న సినిమా దృశ్యాలని గుర్తుకు తెస్తుంది.

ఆమె వస్తున్నపుడు అమాత్యులూ ఎమ్మెల్యేలూ, పార్టీ నాయకులూ బారులు తీరి, అమ్మవారి పాదాలపై మోపడానికి తొందరపడుతున్నట్టు ఉండే శిరస్సులతో నిమిషాల కొద్దీ వంగి ఉండే దృశ్యాలు కూడా ద్రవిడ రాజకీయాలకు ప్రత్యేకం. ఆఖరికి అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు కూడా సినిమా టైపులోనే ఉంటాయి. ఇక్కడ అతిథి ముఖ్యమంత్రులు అచ్చంగా అతిథి పాత్రలను పోలి ఉండడం వింతేమీ కాదు. 65 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల మీద పురచ్చితలైవి జయలలిత  ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తరువాత పన్నీర్‌సెల్వం అనే ఈ వీర విధేయుడు ముఖ్యమంత్రి అయిన తీరు, ప్రమాణ స్వీకార వేళ పన్నీరు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యం, తరువాత ప్రమాణాలు చేసిన మంత్రివర్గ సభ్యుల ఏడుపుల కోరస్ - సర్వం వెండితెర దృశ్యమాలికనే తలపించింది.
 
పన్నీర్‌సెల్వం అతిథి ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. ఆ రెండు సందర్భాలు జయలలిత అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్లినప్పటివే కావడం విశేషం. మే 14, 2001లో ముఖ్యమంత్రి అయిన జయ సెప్టెంబర్ 21, 2001న అంటే, ఆరుమాసాలు కూడా పూర్తికాకుండానే అరెస్టయ్యారు. అప్పుడు మొదటిసారి పన్నీర్‌సెల్వం 21 సెప్టెంబర్ 2001 నుంచి మార్చి1, 2002 వరకు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ సెప్టెంబర్ 29, 2014న అదే దృశ్యం రిపీట్ అయింది. ఆమె జైలుకు వె ళ్లారు. సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2016లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే గతంలో మాదిరిగా జయ బెయిల్ మీద బయటకు వచ్చినా, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు.  
 
తమిళనాడు
ఇటీవలి తమిళ రాజకీయాల నేపథ్యంలో చూస్తే వీఆర్ నెడుంజెళియన్ అనే పెద్దాయన తాత్కాలిక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భం కనిపిస్తుంది. 1984-85 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఆస్పత్రిలో చేరారు. అప్పుడు మంత్రివర్గ సమావేశాలకు వీఆర్ అధ్యక్షత వహించేవారు. ఆ సేవలు వృథా కాలేదు. 1987లో ఎంజీఆర్ కన్నుమూసినపుడు వీఆర్  ‘యాక్టింగ్ సీఎం’గా వ్యవహరించారు. తరువాత అన్నా డీఎంకేలో వారసత్వ పోరు రణరంగాన్ని తలపించింది. ఒకవైపు జయలలిత, ఇంకొకవైపు ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు. నిన్నటిదాకా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్న జయకు అప్పుడు చుక్కెదురైంది.

ముఖ్యమంత్రి పదవికి జానకితో పోటీ పడిన నెడుంజెళియన్ కూడా ఓడిపోయారు. అయితే పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన జానకిని రాజకీయ కారణాలు అతిథిపాత్రకు పరిమితం చేశాయి. జనవరి 7, 1988న పదవీ స్వీకారం చేసిన జానకి ఆ జనవరి 30న పదవిని కోల్పోయారు. ఆమె ప్రభుత్వాన్ని రాజీవ్‌గాంధీ బర్తరఫ్ చేశారు. 24 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి ‘తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రి’ అన్న ఒక్క ప్రత్యేకతను తప్ప మరేదీ మిగుల్చుకోలేదు. తరువాత ఎన్నికలలో ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకె వర్గం ఓడిపోయింది.
 
ఆంధ్రప్రదేశ్
ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిన ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విరివిగా కనిపిస్తారు. ఇందిర ప్రధానిగా ఉన్నపుడు ముఖ్యమంత్రులను పేకముక్కల్లా మారుస్తారని ఒక విమర్శ ఉండేది. అలాంటి అనేక పేకముక్కలలో భవనం వెంకటరామ్ కూడా ఒకరు. ఫిబ్రవరి 24, 1982న పదవిని చేపట్టిన భవనం ఆ సంవత్సరం సెప్టెంబర్ 20న రాజీనామా చేశారు. తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ జీవితంలోని ‘వెన్నుపోటు -1’ లేదా ‘ఆగస్ట్ సంక్షోభం’ తరువాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాదెండ్ల భాస్కరరావు సరిగ్గా ఒక్కమాసమే ఆ పదవిలో (ఆగస్ట్ 16-సెప్టెంబర్ 16, 1984) ఉన్నారు. నిజానికి నాదెండ్ల ‘అనుకోని’ అతిథి ముఖ్యమంత్రి. రోశయ్య అచ్చమైన స్టాప్ గ్యాప్ ముఖ్యమంత్రి కోవలోకి వస్తారు.
 
కేరళ
దక్షిణాదిన రాజకీయ అస్థిరతకు మారుపేరు కేరళ. అత్యవసర పరిస్థితి తరువాత అక్కడ ముఖ్యమంత్రులు తరుచు మారిపోతూ ఉండేవారు. అక్కడ లెఫ్ట్ కూటమి లేదా కాంగ్రెస్ నాయకత్వంలోని డెమాక్రటిక్ కూటమి అధికారంలోకి వస్తూ ఉండేవి. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మారిపోతాడో ఎవరికీ తెలిసేది కాదు.  నిజానికి అక్కడ ఈ సంస్కృతి 1947లోనే ఆరంభ మైంది. ఆగస్ట్ 14, 1947న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పినంపిల్లి గోవింద మేనన్ కేవలం 51 రోజులే ఆ పదవిలో ఉండి, అక్టోబర్ 22న వైదొలిగారు. సంకీర్ణ రాజకీయాలను నడపడం ఎలాగో దేశానికి నేర్పిన వాడు కె. కరుణాకరన్ కావచ్చు. కానీ ఈయన మొదటి సారి మార్చి 25, 1977న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ 32 రోజులకే ఏప్రిల్ 25న రాజీనామా చేశారు. తరువాత రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు.

ముస్లిం లీగ్ నాయకుడు సీహెచ్ మహ్మద్ కొయ అక్టోబర్ 12, 1979న ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి, 51 రోజుల తరువాత డిసెంబర్ 1న వైదొలిగారు. కేరళ వామపక్ష పాలనలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి కనిపిస్తుంది. ఈకే నాయనార్ డిసెంబర్ 28, 1981న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 81 రోజలు తరువాత మార్చి 17, 1982న వైదొలిగారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా కదిదల్ మాంజప్ప ఉదాహరణ  ఇలాంటిదే. మాంజప్ప ఆగస్ట్ 19, 1956న ప్రమాణం చేసి 73 రోజుల తరువాత అక్టోబర్ 31న రాజీనామా చేశారు. ఈయన కర్ణాటక మూడో ముఖ్యమంత్రి. ఈయన ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన హనుమంతయ్య రాజీనామాతో తాత్కాలికంగా మాంజప్పను నియమించారు. అయితే అదే రాష్ట్రంలో ఎస్ ఆర్ కాంతి ఉదాహరణ మరో విధంగా ఉంది. ఈయన మార్చి 14, 1962న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి, జూన్ 20న త్యజించారు. ఇంకొక్క రెండు రోజులు ఉంటే వందరోజులు పూర్తయ్యేవి.
 
మధ్యప్రదేశ్
ఇందిరా గాంధీ హయాంలో ముఖ్యమంత్రుల తీరు మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఉండేవి. మధ్యప్రదేశ్‌లో నరేశ్ చంద్రసింగ్ మార్చి 13, 1969న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, సరిగ్గా 13 రోజులకి మార్చి 25న బుద్ధిగా రాజీనామా చేసి వెళ్లిపోయారు.  రవిశంకర్ శుక్లా అనే మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నవంబర్ 1, 1956న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 61 రోజుల తరువాత డిసెంబర్ 31న పదవీ త్యాగం చేశారు. అంటే నెహ్రూ హయాంలోనూ ఇలాంటి విన్యాసాలకు లోటు లేదు. మధ్యప్రదేశ్‌లోనే జనవరి 1, 1957న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంతరావ్ మాండ్లోయ్ జనవరి 31కి రాజీనామా చేయవలసి వచ్చింది.

అయితే ఈయనకు 1962లో మరో అవకాశం వచ్చి రెండేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.  ఉత్తర ప్రదేశ్‌లో చంద్రభాను గుప్త మార్చి 14, 1967న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 19 రోజులు పనిచేసి ఏప్రిల్ 2న వైదొలిగారు. సుందర్‌లాల్ పట్వా ఎంపీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పని చేశారు. మొదటిసారి జనతా పార్టీ అభ్యర్థిగాను, తరువాత బీజేపీ ముఖ్యమంత్రిగాను పదవిని అలంకరించారు. అయితే మొదటిసారి జనవరి 20, 1980న పదవి స్వీకరించి 29 రోజులకే ఫిబ్రవరి 17న రాజీనామా చేశారు. మళ్లీ 1990 లో బీజేపీ ముఖ్యమంత్రిగా రెండేళ్లు పనిచేశారు.
 
రాజస్థాన్, మహారాష్ట్ర
రాజస్థాన్‌లో శివచరణ్ మాధుర్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత హీరాలాల్ దేవ్‌పురా అనే కాంగ్రెస్ నాయకుడు  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మళ్లీ హరిదేవ్ జోషిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే వరకు మాత్రమే దేవ్‌పురా అధికారంలో ఉన్నారు. దేవ్‌పురా వైభవం ఫిబ్రవరి 23- మార్చి 10, 1985 వరకే. అంటే పదహారు రోజుల పండగ.
 మహారాష్ట్రలో మరుత్‌రావ్ కన్నమ్‌వార్ మరణంతో ముఖ్యమంత్రిగా పీకే సావంత్ నవంబర్ 25న ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా పదకొండు రోజుల తరువాత అంటే డిసెంబర్ 4న పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కోసం సీటు ఖాళీ చేస్తూ పదవికి రాజీనామా చేశారు.
 
ఢిల్లీ
ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తొలి దశలో కొంత రాజకీయ అనిశ్చితి కనిపిస్తుంది. బీజేపీ అక్కడ అధికారం చేపట్టినా ముఖ్యమంత్రులను మార్చడం, అంతర్గత కలహాల విషయంలో కాంగ్రెస్‌కు తీసిపోదని సంకేతాలు ఇచ్చినట్టు వ్యవహరించింది. 1993లో అధికారం చేపట్టిన తరువాత 1996 వరకు మదన్‌లాల్ ఖురానా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత అంతర్గత కలహాలతో ఖురానా వైదొలగి, 1996 నుంచి 1998 అక్టోబర్ వరకు సాహెబ్ సింగ్ వర్మ సీఎం పదవిని చేపట్టారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నష్ట నివారణ చర్యలు తీసుకుందామని బీజేపీ అక్టోబర్ 12, 1998న ఆ పార్టీ ప్రముఖురాలు, అప్పుడు వాజపేయి మంత్రివర్గంలో పని చేస్తున్న సుష్మ స్వరాజ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆమె కేవలం 52 రోజులు ఆ పదవిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆమె డిసెంబర్ 3న రాజీనామా చేశారు.

ఐదు నిముషాల ముఖ్యమంత్రి
మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో జేడీ(యు) ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. తరువాత జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు.  సీఎం పదవి స్వీకరించమని ఈ సంవత్సరం మే 19వ తేదీన నితీశ్ కుమార్ జీతన్‌రామ్‌ను ఆదేశించారు. జీతన్ నితీశ్ మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ మంత్రి. ఆయన కూడా దళితుడే. ఆ పదవికి తననే ఎందుకు ఎంపిక చేశారని మాత్రం జీతన్ ప్రశ్నించలేదు. అయితే ఆ పదవిలో తాను ఉండేది ఎంతకాలం? అన్న మాటను కూడా నిక్షిప్తం చేసి ఒక  ప్రశ్నను సంధించారు జీతన్. ‘‘ఇది దశరథ్ బాబాకు ఇచ్చిన అవకాశం వంటిదేనా?’’- అదీ ప్రశ్న.
 
ఎవరీ దశరథ్ బాబా? లేదా దశరథ్ మాంఝీ. ఈయనే బీహార్‌కు ఐదు నిముషాల ముఖ్యమంత్రి. గయ సమీపంలోని ఘెలార్ గ్రామానికి చెందిన దశరథ్ 2007లో నితీశ్ కుమార్ నిర్వహించిన ప్రజా దర్బార్‌కు హాజరయ్యారు. ఆయనను చూసి పరమానందభరితుడైన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ‘ఓ ఐదు నిముషాలు నీవే ముఖ్యమంత్రివ’ని తన కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఇంతకీ దశరథ్ చేసిన ఘనకార్యం ఏమిటి? అత్రి బ్లాక్‌లోని ఒక ఆస్పత్రితో తన కుగ్రామాన్ని అనుసంధానం చేయడానికి 22 సంవత్సరాలు అవిశ్రాంతంగా పాటుపడి, ఒంటి చేత్తో రోడ్డు నిర్మించారు. అది తెలిసి, సంతోషం పట్టలేక అలా తన సింహాసనాన్ని ఐదు నిముషాల పాటు ఆ కర్మయోగికి ధారాదత్తం చేశారు నితీశ్.
 
కేజ్రీవాల్ 49 రోజుల ప్రహసనం
ఆమ్ ఆద్మీ పార్టీతో భారత రాజకీయాలలో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అపహాస్యం పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో అధిక స్థానాలలో ఆప్ మెజారిటీ పార్టీగా నిలిచింది. కానీ అధికారంలోకి రావడానికి తగినన్ని స్థానాలు లేవు. తను దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పెద్ద హడావిడి చేశారు. నలభయ్ తొమ్మిది రోజులకు రాజీనామా ఇచ్చారు. ఆయన అచ్చమైన అతిథి ముఖ్యమంత్రి.
 
ఎవరూ గాయపడని యుద్ధం
అసమ్మతి కార్యకలాపాలతో, సీల్డ్ కవర్ ద్వారా  ముఖ్యమంత్రులైనవాళ్లు ఉన్నారు. ఐదేళ్లు పాలన సాగించవలసిన ముఖ్యమంత్రిని అర్థంతరంగా దించేసి, తాత్కాలిక ముఖ్యమంత్రులను ప్రతిష్టించే విన్యాసానికి ‘లోపలి మనిషి’లో పీవీ నరసింహారావు ఇచ్చిన విశ్లేషణ భారత రాజకీయ చరిత్రలోనే విశిష్టమైనది. ముఖ్యమంత్రులను తొలగించడం, వారిని కేంద్రానికో, గవర్నర్ గిరీకో పంపించడం; అసమ్మతి నేతను ముఖ్యమంత్రిని చే యడం భారత రాజకీయాలలో కనిపిస్తుంది. దీనికే  ఎవరూ గాయపడకుండా చేసే యుద్ధం అని పీవీ పేరు పెట్టారు. రాజకీయ రంగం వరకు పీవీ చెప్పింది అక్షర సత్యం. కానీ ఆ యుద్ధం వల్ల గాయపడే వ్యవస్థలు ఎప్పుడూ ఉన్నాయి. అవే ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి వ్యూహాలు.  
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement