MP Vijayasai Reddy Analysis On Changes In Indian Politics, Details Inside - Sakshi
Sakshi News home page

రాజకీయాలతో ప్రజల మమైకం.. బిస్మార్క్‌ మాటలు అక్షర సత్యం

Published Mon, Jun 12 2023 12:09 PM | Last Updated on Mon, Jun 12 2023 1:44 PM

Mp Vijayasai Reddy Analysis On Changes In Indian Politics - Sakshi

భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 55 ఏళ్ల వరకూ, అంటే 21వ శతాబ్దం మొదలయ్యే వరకూ ప్రజల్లో కొంత మందికి రాజకీయాలంటే వ్యతిరేకత ఉండేది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనిపించనప్పుడు తప్పంతా రాజకీయ నాయకులదే అనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. 1960, 70ల్లో అయితే అసలు ప్రజాస్వామ్యం ఇండియాకు ప్రయోజనకరమా? అనే ప్రశ్న కూడా బహిరంగ ప్రదేశాల్లో మధ్య తరగతి నోట వినిపించేది. కొందరైతే ప్రజాజీవితంలో అరాచకం తరచు కనిపించే భారతదేశంలో సైనిక పాలనే మెరుగైన ఫలితాలు ఇస్తోందేమోననే రీతిలో ఆగ్రహంతో మాట్లాడేవారు.

అయితే, 1977 నుంచీ దేశ రాజకీయాల్లో శరవేగంతో వచ్చిన మార్పులు, వికసించిన జన చైతన్యం, పాలనా వ్యవస్థల్లో కొద్దిపాటి కదలికలు కానరావడంతో–రాజకీయాలను, రాజకీయ నేతలను, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పలచనచేసి మాట్లాడే ధోరణి తగ్గిపోయింది. అన్ని సమస్యలకూ ప్రభుత్వాలది, రాజకీయపక్షాలదే బాధ్యత కాదని, జనంలో రాజకీయ స్పృహ, చలనశీలత ఉంటేనే పనులు వీలైనంత సక్రమంగా జరుగుతాయనే భావన వారిలో ఏర్పడడం మొదలైంది. దేశంలో 1977 పార్లమెంటు ఎన్నికలు ప్రజల పరిశీలనా దృష్టిలో గణనీయ మార్పు తీసుకొచ్చాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1978 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తెలుగు జనం ఆలోచనా ధోరణిలో చెప్పుకోదగ్గ పరిణతికి కారణమయ్యాయి. అప్పటి నుంచీ తెలుగునాట ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పరిపాలన సాగాలనే విషయంపై శ్రద్ధ పెరిగింది. 2004 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగునాట రాజకీయాల్లో, పాలనా వ్యవహరాల్లో ఊహించని మార్పులు విస్తృత ప్రజాచైతన్యానికి దారితీశాయి. 

రాజకీయపక్షాల ధోరణిపై అవగాహన పెరుగుతోంది!
అనేక సమస్యలపై, సందర్భాల్లో వివిధ ప్రధాన రాజకీయపక్షాల వైఖరిపై ప్రజలకు పాతికేళ్ల క్రితం సంపూర్ణ అవగాహన ఉండేది కాదని రాజకీయ పండితులు చెబుతుంటారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉండడంతో ఆయా పార్టీల రాజకీయ ధోరణుల్లో మార్పులు అవసరమయ్యాయి. ప్రజా సంక్షేమం కోసం, పాలన సాఫీగా నడవడానికి రాష్ట్రాలను పరిపాలించే పార్టీలపై బాధ్యత, ఒత్తిడి ఎక్కువవుతున్నాయి. కేంద్రంలోని పాలకపక్షంతో పరిపాలన విషయంలో సఖ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితులు పదేళ్లుగా ఎక్కువయ్యాయి.

వేర్వేరు సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఉన్న భిన్న రాజకీయపక్షాలు ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా రాష్ట్రాల్లోని పాలకపక్షాలతో (అవి ప్రాంతీయపార్టీలైనా లేదా జాతీయపక్షాలైనా) కలిసిమెలిసి సుహృద్భావ వాతావరణంలో వ్యవహరించాల్సివస్తోంది. 19వ శతాబ్దం చివరిలో జర్మనీ ఏకీకరణకు కారకుడైన ఆటో వాన్‌ బిస్మార్క్‌ (దేశాధినేత ఛాన్సలర్‌ గా ఆయన 1871–1890 మధ్య ఉన్నారు) దాదాపు 150 ఏళ్ల క్రితం అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.

అధికారంలో ఉన్న నాయకులు ఆచరణాత్మత రాజకీయాలు నడపడానికి ఏం చేయాలో ఆయన సూటిగా ఒక్క వాక్యంలో చెప్పారు. ‘రాజకీయాలంటే–అలివికానివిగా కనిపించేవాటిని సాధ్యమయ్యేలా కృషిచేయడమే. ఇదొక కళ. ఎంత వరకు వీలైతై అంత వరకు సాధించడమే ఈ కళ లక్ష్యం,’ అనే అర్ధంలో బిస్మార్క్‌ చెప్పిన మాటలను ఇప్పటికీ ఆధునిక ప్రజాతంత్ర దేశాల్లో గుర్తుచేసుకుంటుంటారు.

1989-90 మధ్య దేశ ప్రధానిగా ఉన్న విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ జీకి మైనారిటీ ప్రభుత్వం ఏడాదిపాటు నడపటం చాలా కష్టమైంది. సైద్ధాంతికంగా భిన్నదృవాలై బీజేపీ, వామపక్షాల నుంచి బయటి నుంచి మద్దతు తీసుకుంటూ వీపీ సింగ్‌ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి నాయకత్వం వహించడం అత్యంత క్లిష్టంగా ఉండేది. ఫలితంగా, మిత్రపక్షాలతో ఆయన అనేకసార్లు ఇష్టంలేకున్నా రాజీపడేవారు. అప్పుడు ఆయన రాజ్యపాలనకు సంబంధించి బిస్మార్క్‌ మాటలను తరచు ఉటంకించేవారు. ఇప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలకపక్షాలు పలు సందర్భాల్లో జనం కోసం రాజకీయంగా ఎంతో యుక్తితో వ్యవహరించాల్సి వస్తోంది. ‘పాలిటిక్స్‌ ఈజ్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ ద పాసిబుల్‌’ అనే బిస్మార్క్‌ వాక్యం 21వ శతాబ్దంలో కూడా ప్రాసంగికత కలిగి ఉంది. ఇది అన్ని కాలాలకూ వర్తిస్తుంది.


-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement