ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల జనాభా | Mp Vijayasai Reddy Analysis On Expansion Of Urban Areas In Ap | Sakshi
Sakshi News home page

ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల జనాభా

Published Fri, Jun 23 2023 7:24 PM | Last Updated on Fri, Jun 23 2023 7:40 PM

Mp Vijayasai Reddy Analysis On Expansion Of Urban Areas In Ap - Sakshi

భారతదేశంలో పట్టణ ప్రాంతాల జనాభా వేగంగా పెరుగుతోంది. మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో పట్టణీకరణకు మంచి ఊపునిచ్చాయి. పట్టణ ప్రాంతాల జనసంఖ్య వృద్ధితోపాటు దేశ ఆర్థికవ్యవస్థలో నగరాలు, పట్టణాల వాటా కూడా మరింత వేగంగా పెరుగుతోంది. ఇండియాలో పట్టణ ప్రాంతాల జనాభా 1961లో 8.23 కోట్ల నుంచి 1981 నాటికి 16.60 కోట్లకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 48 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. అంటే దేశ జనాభాలో ఐదో వంతుకు పైగా పట్టణాలోనే జీవిస్తోందన్న మాట.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే 2001–2011 దశాబ్దంలో దేశంలో పట్టణ జనాభా ఎన్నడూ లేనంత గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా వృద్ధిచెందింది. పెరిగిన 18 కోట్ల 14 లక్షల జనాభాలో పట్టణ ప్రాంతాల జనం 9 కోట్ల 10 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంతాలది 9 కోట్ల 40 లక్షలు. 2011 నుంచీ పట్టణ ప్రాంతాల్లో జనసంఖ్య శరవేగంతో పెరుగుతోంది. మొత్తం దేశ జనాభాలో ఇదివరకు 18 శాతం ఉన్న పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 37 శాతానికి పెరిగిందని అంచనా.

ఐక్యరాజ్యసమితి-హేబిటెట్‌ ప్రపంచ నగరాల జనాభా (2022) నివేదిక ప్రకారం భారత పట్టణ ప్రాంతాల జనాభా 2025 నాటికి 54.74 కోట్లు, 2030కి 60.73 కోట్లు, 2035 నాటికి 67.45 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత స్వాతంత్య్రానికి 100 ఏళ్లు నిండిన మూడు సంవత్సరాలకు అంటే 2050 కల్లా పట్టణ ప్రాంతాల జనసంఖ్య 81.4 కోట్లకు పెరిగిపోతుందని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి. అంటే, దేశంలో పట్టణాల జనాభా గ్రామీణ జనాభా కంటే చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పట్ణణ ప్రాంతాలపైనా పెరిగిన శ్రద్ధ
దక్షిణాదిన మూడో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్ణణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదీగాక, నగరాలు, పట్టణాలుగా అంటే  మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీ హోదా రాని పెద్ద గ్రామాలు పట్టణ ప్రాంతాల సౌకర్యాలతో నవ్యాంధ్రలో వృద్ధిచెందుతున్నాయి. పట్టణ హోదా ఇంకా దక్కని ఇలాంటి పెద్ద గ్రామాలను ‘సెన్సస్‌ టౌన్లు’ అని పిలుస్తారు. కాస్త వెనుకబడిన ప్రాంతాలుగా గతంలో భావించిన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పట్టణ జనాభా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా పెరుగుతోందని 2011 జనాభా లెక్కలు తేల్చిచెప్పాయి.

నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచీ గ్రామీణ ప్రాంతాలతో సమానంగా పట్టణ ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి బాదరబందీ లేకుండా జీవనం సాఫీగా సాగడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

ఇంకా, నగరాలు, పట్టణాల్లో నెలవారీ జీతాలు వచ్చే ఉపాధి లేని ఆటో డ్రైవర్లు వంటి ఆధునిక వృత్తుల్లో ఉన్న దిగువ మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ఏపీలో అమలుచేస్తున్నారు. అశాంతి, అలజడికి త్వరగా గురయ్యే అవకాశాలున్న పట్టణ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిన అనేక చర్యల వల్ల ఆంధ్రా పట్టణాలు, నగరాలు శాంతి, సౌభాగ్యాలతో నేడు వర్ధిల్లుతున్నాయి.


విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement