ప్రపంచంలో ప్రజాతంత్ర పంథాలో పయనిస్తున్న రెండు అతిపెద్ద దేశాలు ఇండియా, అమెరికా మైత్రి నేడు రోజురోజుకు బలపడుతోంది. ఈ నెల 21-23 మధ్య జరిగే భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధికార పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. అనేక చారిత్రక కారణాలు, పరిస్థితుల వల్ల 1947 నుచి 1990ల ఆరంభం వరకూ భారత-అమెరికా ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నంతగా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి అంత దగ్గరగా లేవనే అభిప్రాయం నెలకొని ఉండేది. అప్పటి రెండు అగ్రరాజ్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం రెండు ప్రజాస్వామ్య దేశాల పాలకులపై ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతారు. అయితే, ప్రపంచీకరణ, సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవం ఆధునిక ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే ప్రక్రియ మొదలైన 20వ శతాబ్దం చివరిలో ఇండియా, అమెరికా ప్రభుత్వాల మధ్య కూడా సంబంధాలు బలోపేతమయ్యాయి.
అన్ని రంగాల్లో రెండు పెద్ద దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలు పటిష్ఠమవ్వడం మొదలైంది. అలా ఈ స్నేహబంధంలో వచ్చిన గొప్ప మార్పు ఈ పాతికేళ్లలో దృఢపడుతోంది. పెద్ద సంఖ్యలో ‘అవకాశాల స్వర్గం’ అమెరికా వెళ్లి స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఈ మిత్ర సంబంధాలు మరింత పరిణతి చెందడానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ప్రపంచంలో నేటి అత్యంత క్లిష్ట సమయంలో ఇండియాకున్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమే అమెరికాకు కొత్త, అతి సన్నిహిత మిత్ర దేశంగా భారత్ అవతరించడానికి అతిపెద్ద కారణమని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ పత్రిక ‘ది ఇకనామిస్ట్’ వ్యక్తం చేసిన అభిప్రాయం నూరు శాతం నిజమని అంతర్జాతీయ నిపుణులు అంగీకరిస్తున్నారు.
గతంలో అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ మధ్య తీవ్ర పోటీ ఉన్న సమయంలో భారత పాలకులు సోవియెట్ పక్షాన ఉన్న మాట కూడా నిజమేనని చరిత్రకారులు చెబుతారు. అయితే, ‘ఇండియాకు సోవియెట్ యూనియన్ ఆదర్శ రాజ్యమని అప్పట్లో ప్రకటించిన కొందరు పెద్దలు మాత్రం తమ పిల్లలను పై చదువులకు అమెరికా పంపేవారు. అనారోగ్యం వస్తే అమెరికా ఆస్పత్రుల్లో చికిత్స చేయించు కోవడానికే ఇష్టపడేవారు,’ అని ప్రసిద్ధ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ వ్యగ్యంతో మేళవించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
అమెరికా కాంగ్రెస్ లో రెండోసారి ప్రధాని ప్రసంగించడం ఇండియాకు విశేష గౌరవం
భారత ప్రధాని మోదీ వచ్చే వారం తన అధికార పర్యటనలో భాగంగా అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించబోతున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం ఇప్పటి వరకూ బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా వంటి కొద్ది మంది మహానేతలకే దక్కింది. అనేక రంగాలతోపాటు ఆర్థికరంగంలో పరుగులు పెడుతున్న ఇండియా కిందటేడాది బ్రిటన్ ను దాటి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించింది. అచిరకాలంలో జర్మనీ, జపాన్ దేశాలను భారత్ అధిగమించి విశ్వశక్తిగా దర్శనమిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనేక అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. అందివస్తున్న అవకాశాలతో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా వెళ్లి స్థిరపడిన భారతీయుల సంఖ్య 45 లక్షలు దాటిపోయింది.
ఈ ప్రవాస భారతీయులు అమెరికాతో భారత్ మైత్రీబంధం మరింత బిగయడానికి చేస్తున్న కృషికి నిదర్శనంగా భారత ప్రధాని అధికార పర్యటన నిలిచిపోతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ హిల్ (చట్టసభలు–కాంగ్రెస్)లో భారత ప్రధాని వచ్చే వారం చేసే ప్రసంగం ప్రపంచంలో అతిపెద్ద, అతిగొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బలపడుతున్న స్నేహసంబంధాలను గొప్ప మలుపు తిప్పుతుందనడంలో సందేహం లేదు.
విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment