
ఘనతంత్రం
వివరం
జనవరి 26 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే). ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (ఇండిపెండెన్స్ డే). ఏమిటి తేడా ఈ రెండు రోజులకు? ఇండిపెండెన్స్ డే అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజున గతాన్ని తలుచుకుంటూ, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటాం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్య్రం వచ్చాక మనకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యాంగాన్ని (కాన్‌స్టిట్యూషన్) అమల్లోకి తెచ్చుకున్న రోజు. వర్తమానంలో మనం ఏమిటి? భవిష్యతుల్లో మనం ఏమిటి? అనే విషయాలను ఆ రోజు బేరీజు వేసుకుంటూ రాజ్యాంగ నిర్మాతల్ని గౌరవించుకుంటాం. ఇవాళ రిపబ్లిక్ డే. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం.
భారత రాజ్యాంగం అసలు ప్రతులను ఇంగ్లిషు, హిందీ భాషలలో అందమైన చేతిరాతతో రాశారు. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో భద్రపరిచి పార్లమెంటు గ్రంథాలయంలో ఉంచారు.
ఈ చేతరాత ప్రతులపై 1950 జనవరి 24న రాజ్యంగసభ (రాజ్యాంగ రూపకర్తలతో ఏర్పడిన సభ) లోని మొత్తం 284 మంది సభ్యులు (15 మంది మహిళా సభ్యులు సహా) సంతకాలు చేశారు.
రాజ్యాంగం తయారవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. (2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు)
ప్రపంచంలోకెల్లా అతి పెద్దది భారత రాజ్యాంగమే! అతి చిన్నది అమెరికా రాజ్యాంగం. అతి పురాతనమైన రాజ్యాంగం మాత్రం ఇరాక్ వారిది. క్రీ.పూ.2300 లోనే వారొక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగంగా (జనహిత రాజ్యాంగం అనే అర్థంలో) భారత రాజ్యాంగానికి మంచి పేరుంది.
ఒక్కో దేశం నుంచి ఒక్కో అంశాన్ని తీసుకుని మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఉదా: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ఫ్రాన్సు రాజ్యాంగం నుంచి, పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, ఆదేశ సూత్రాలను ఐర్లండ్ నుంచి, సుప్రీం కోర్టు విధి విధానాలను జపాన్ నుంచి అరువు తెచ్చుకున్నాం.
భారత రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్‌లోని సారనాధ్‌లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోకస్తంభం నుంచి స్వీకరించారు. దానిపై ఉండే నాలుగు సింహాలు, గుర్రం, ఎద్దులతో పాటు, అశోక చక్రం, సత్యమేవ జయతే అనే అక్షరాలను కలిపి 1950 జనవరి 26 న మన జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాం.
‘అబైడ్ విత్ మి’ (A-bide with me) అనే బైబిల్ కీర్తనను రిపబ్లిక్ ఆవిర్భావం రోజు ఆలపించారు. గాంధీ మహాత్మునికి ఇష్టమైన బైబిల్ కీర్తన అంది.
సంతకాలు పెడుతున్న సమయంలో పార్లమెంటు భవనం బయట బోరున వర్షం కురవడం మొదలైంది! అది చూసి కొంతమంది సభ్యులు ‘మంచి శకునం’ అని వ్యాఖ్యానించారు.
తొలి రిపబ్లిక్ డే ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. 1950 జనవరి 29న ముగిశాయి. బ్రిటన్ సైనిక దళాలు నిష్ర్కమణకు సూచికగా ‘బీటింగ్ ది రిట్రీట్’ వాద్యాలు ప్రతిధ్వనించాయి.