రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ప్రభుత్వాలు
పట్నంబజారు(గుంటూరు) : భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాలకుల కళ్లు తెరిపించేలా ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేందుకు ప్రభుత్వాలు యోచించడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు యత్నించడం సబబు కాదన్నారు.
ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పేదల భూములు లాక్కోవడం, ఎస్సీ, ఎస్టీల నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం అన్యామన్నారు. ఏప్రి ల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లే ళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాం గం ఒక పవిత్ర గ్రంథమని, కుల, మతాల పేరుతో కొందరు విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. టీడీపీ నేతలు మహనీయుల ఫొటోలకు దండలువేయడం తప్ప, వారి ఆశయాలను అమలులో పెట్టడం లేదన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, జెడ్పిటీసీ రూరల్ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.