జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి?
అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది.
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి?
వివక్షకు సమర్థనా?
సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు.
కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు.
పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు.
వివక్షాపూరిత అనుభవాలెన్నో!
భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ.
టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది.
ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా?
పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు?
సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో!
అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి.
ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి?
జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి.
కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా?
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment