ప్రతీకాత్మక చిత్రం
కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుంటారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలూ పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్‌లో దొరుకుతుందని వెతుకుతున్నాం. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. 21వ శతాబ్దిలోనూ భారత్‌లో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి.
నా బాల్యంలోనూ, ప్రస్తుతం కూడా మా గ్రామంలో ఓ సాధారణ ప్రక్రియ జరుగుతూ వస్తోంది. ప్రతి వృత్తినీ ఒక్కో సామాజిక బృందం మాత్రమే నిర్వహిస్తూంటుంది. ప్రతి కమ్యూనిటీకీ ఒక్కో పేరు ఉంటుంది. పొలాలను దున్నడం, గొర్రెలు కాయడం లేదా పశువుల పెంపకం, చేపలుపట్టడం, కల్లుగీత, కుండల తయారీ, బట్టలు ఉతకడం, నేతపని, క్షురక వృత్తి, చెప్పుల తయారీ, జంతువులు లేక మనుషుల మృతదేహాలకు అంతిమసంస్కారం నిర్వహించడం వంటి ఒక్కో పనిని ఒక్కో కులం ప్రత్యేకంగా చేసేది. గ్రామంలో ఏదైనా వృత్తి చేతులు మారుతూ ఉంటుందంటే అది పొలం దున్నడం మాత్రమే. ఇతర వృత్తులన్నీ వేర్వేరు కులాల చేతుల్లోనే ఉంటాయి.
నా బాల్యంలో అన్ని కులాలూ కలిసి భోజనం చేసే పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని కులాలు కలిసి భోంచేయడం సాధ్యపడుతోంది కానీ, కులాంతర వివాహం ఇప్పటికీ కష్టసాధ్యమే. మార్పు ఏదైనా జరిగిందంటే అది పైపైన మాత్రమే జరుగుతోంది తప్ప వ్యవస్థాగతంగా కాదు. అంతరాల పరమైన అసమానత్వం ఇప్పటికీ అలాగే ఉంది. బ్రాహ్మణ, వైశ్య కులాలు ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటూ మిగతా కులాలకంటే అగ్రస్థానంలో ఉంటున్నాయి.
కులపరమైన సమానత్వం గ్రామంలోనూ లేదు. నగరంలోనూ లేదు. 72 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో ప్రజాజీవితంలో సమానత్వం లేనేలేదు. 20వ శతాబ్ది మధ్య నుంచి, 21వ శతాబ్ది ప్రారంభం వరకు భారతదేశంలో మానవ సంబంధాలు అంతరాలు, అసమానతల మధ్యే కొనసాగుతున్నాయి. స్త్రీపురుషులతో సహా మనుషులందరినీ సమానంగా సృష్టించాడని చెబుతున్న దేవుడు నేటికీ మా సామాజిక చట్రంలోకి ప్రవేశించలేకున్నాడు.
ప్రతి గ్రామంలోనూ పశువుల, మనుషుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించే వారిని అంటరానివారిగా గుర్తిస్తుం టారు. ఇక రజకులు, క్షురకులను కూడా హీనంగా చూస్తుంటారు. దాదాపుగా దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాదిన ఇది కఠినంగా అమలవుతుంటే దక్షిణాదిలో కాస్త తక్కువ స్థాయిలో అమలవుతోంది. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ ఉత్తరాదిన బలంగానూ, దక్షిణాదిలో బలహీనంగానూ ఉండటానికి ఇదే కారణం. గ్రామాల్లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ ఉనికిలోకి రాకముందు చారిత్రకంగా చూస్తే, అన్ని వృత్తులను ఐక్యం చేసేది ఒక్క ఆలయం మాత్రమే. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడన్న భావంతో గ్రామంలోని ఆలయం అన్ని కులవృత్తుల వారికి ఉమ్మడి స్థలంగా ఉండేది.
భారతీయ గ్రామాలు చాలా విభిన్నమైనటువంటివి. ఆలయ పూజారి వారికి ఏం చెబుతాడన్నది ఊహించుకోండి మరి. మీ వృత్తిపరంగా ఉండే మీ విధులను నిర్వహించండి, అన్ని వృత్తులూ మన మనుగడ కోసం అవసరమైనట్టివే, మీరూ మీ వృత్తిపరమైన విధులూ దేవుడి రా>జ్యంలో సమానమైనవే. కానీ దీనికి భిన్నంగా గ్రామీణ పూజారి గ్రామస్థులకు ఏం చెబుతూ వచ్చాడో తెలుసా? అసమానత్వాన్ని, అంటరానితనాన్ని పాటించడం మీ పవిత్ర ధర్మం. ఎందుకంటే దేవుడు లేక దేవుళ్లు మిమ్మల్ని అసమానంగానే సృష్టించారు అనే. దేవుడి ప్రతినిధిగా భావించే వ్యక్తే గ్రామీణులకు ఇలా చెబుతూ వస్తే దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వం ఎలా వస్తుంది?
ఉమ్మడి బోధనా స్థలంగా పాఠశాల గ్రామాల్లో ప్రవేశించడానికి ముందు ఆలయం ఒక ఉమ్మడి సామాజిక స్థలంగా ఉండాలి. గ్రామ దేవాలయానికి సమానత్వమే సూత్రమైతే, ఆ సమానత్వం గ్రామీణ జీవితంలో భాగమై ఉండాలి. అన్ని కులవృత్తుల ప్రజలూ పక్కపక్కనే కూర్చుని ఆహారాన్ని ఆరగించాలని గ్రామ దేవాలయం మొదటినుంచి ప్రబోధించి ఉంటే, గ్రామాల్లో అసమానత్వం అసలు ఉండేది కాదు. కుల అసమానత్వానికి, అగౌరవానికి పరిష్కారం కులాంతర వివాహమేనని చాలామంది సామాజిక సిద్ధాంతవేత్తలు భావిస్తుం టారు. కాని అన్ని కులాల మధ్య ఆధ్యాత్మిక సమానత్వం ఏర్పర్చనట్లయితే, మరే ఇతర కులవ్యతిరేక చర్యలతో పెద్దగా సాధించేదంటూ ఏదీ ఉండదు. మనుషుల్లో కులాలను దేవుడు సృష్టించలేదని ప్రతి ఆలయంలోనూ పూజారి ప్రకటించి ఉంటే, దేశంలో కొద్దిగా అయినా సాధ్యపడుతున్న కులాంతర వివాహాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా యువతీయువకుల హత్యలకు దారితీసి ఉండేవికావు.
అలాంటి వాతావరణంలో ఆర్టికల్ 15 వంటి సినిమా ఏదీ మనకు అవసరమై ఉండేది కాదు. మనం ఆలయంలోనే సమానత్వాన్ని కోల్పోయాం. అది పోలీసు స్టేషన్‌లో దొరుకుతుందని వెతుకుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆలయం గురించి పేర్కొనలేదు. ఆలయం సృష్టించిన సమస్యను పోలీసు స్టేషన్ పరిష్కరించలేదు. ఉమ్మడి వ్యవస్థలుగా ఆలయం, పాఠశాల మాత్రమే దీన్ని పరిష్కరించాలి. మన వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి అర్చక కులం సిద్ధపడనంతవరకు కులాంతర వివాహాలు మన దేశంలో విజయవంతం కావు. అర్చకత్వం అనేది కుల వృత్తిగా కాకుండా వ్యక్తులు చేసే వృత్తిగా మారనంతవరకు మన వివాహ వ్యవస్థ మారదు. కుల సంబంధాలు మారవు. అప్పుడు మాత్రమే శ్రమను గౌరవించడం మన కుటుంబ సంస్కృతిలో సాధ్యపడుతుంది.
ఈ ప్రాథమిక అంశాలను మనం సాధించి ఉంటే, ఇస్లామిక్ మసీదు మన గడ్డపైకి అడుగుపెట్టగలిగేదే కాదు. అలాగే క్రిస్టియన్ చర్చి కూడా భారతదేశంలోకి వచ్చేది కాదు. ముస్లిం ఆక్రమణదారులు కానీ, క్రిస్టియన్ వలసపాలకులు కానీ వచ్చి ఉన్నా, వారు భారత్‌లో ఇంతటి విజయాలు సాధించి ఉండేవారు కాదు.
మరోమాటలో చెప్పాలంటే, ఆధునిక కాలంలో మన సమాజాలన్నింటిలోనూ మానవ సమానత్వానికి ఆధ్యాత్మికపరమైన ప్రజాస్వామ్య వ్యవస్థే నిజమైన పునాదిగా ఉంటోంది. మన దేశంలో అలాంటి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ పండితులే ప్రతిపాదించి ఉండాలి. ఆధ్యాత్మిక సమానత్వ సూత్రాన్ని దేవుడు ప్రసాదించిన సూత్రంగా ఆలయం ఆచరించి ఉంటే మన దేశం మరో విభిన్న దశలో సాగి ఉండేది.
సాధారణంగా మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ సమానత్వం పట్లే చర్చలు సాగుతుంటాయి.
కానీ గ్రామ స్థాయినుంచి మానవ సంబంధాలన్నింటినీ ఆధ్యాత్మిక సమాజమే పూర్తిగా నియంత్రిస్తున్నప్పుడు మన పౌర సమాజ పొరల్లోకి రాజకీయ సమానత్వాన్ని తీసుకురావడం ఎలా సాధ్యం? మానవ సమానతా సమాజాన్ని నిర్మించాలంటే ఇక్కడే ఆలయం, చర్చి, మసీదు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. పరిశుద్ధమైన శాకాహార తత్వమే జాతీయ ఆహా రంగా హిందుత్వ శక్తులు చాలాకాలంగా పేర్కొంటూ వస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం మాంసాహారులు ఎవ్వరు భారతీయులు కారు. అందుకే ఇప్పుడు శాకాహారులైన బ్రాహ్మణులు, వైశ్యులు, ఆరెస్సెస్ కంటే శూద్ర, దళిత, ఆదివాసీ మాంసాహారులను తక్కువజాతికింద పరిగణిస్తున్నారు.
ఇప్పుడు అసమానత్వాన్ని నిర్మూలించడానికి బదులుగా అసమానత్వాన్ని పెంచి పోషించే అత్యంత శక్తివంతమైన నూతన శాకాహార కులంగా ఆరెస్సెస్ అవతరించింది. జాతీయవాదాన్ని ప్రజల ఆహార ఆర్థికవ్యవస్థకు అనుసంధానించడం తగదంటూ.. ఆరెస్సెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఏ శూద్రకులానికి చెందిన కార్యకర్త కూడా నొక్కి చెప్పలేరు. ఎందుకంటే రుగ్వేద కాలం నుంచి శూద్రులను బౌద్ధికంగా తక్కువస్థాయి కలిగినవారిగా గుర్తిస్తూ వస్తున్నారు.
శాకాహారమే తమ ఆహారంగా ఉండినట్లయితే 5 వేల సంవత్సరాల క్రితమే హరప్పా వాసులు మన గొప్ప నాగరికతను నిర్మించి ఉండేవారు కాదని ఆరెస్సెస్‌కు అర్థం కావడం లేదు. వెయ్యి సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో శాకాహార ఉత్పత్తి జరిగి ఉండలేదు. ఆహారంతో సహా అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని రద్దు చేసిపడేశారు. హిందూ కుల అంతరాల వ్యవస్థకే కాదు. భారతీయ ఇస్లాం, భారతీయ క్రిస్టియానిటీకి కూడా ఇది పెద్ద సమస్యగానే ఉంటోంది.
మన గ్రామాల్లో నేటికీ గుణాత్మకమైన మార్పు జరగలేదు. ఆలయం అదే కులధర్మంతో నడుస్తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులను చంపేయడాన్ని, గర్భగుడిలోకి ప్రవేశించిన దళితులపై దాడి చేయడాన్ని అది ఆమోదిస్తోంది. హిందూ దేవుళ్ల కంటే ఓటుహక్కే దళితులను కాపాడుతోంది. పూజారి వైఖరి మాత్రం కులధర్మాన్ని ఆచరిస్తూనే సాగుతోంది. ఇదే అన్ని అసమానతలకు తల్లివంటిది. మనం ఆలయాన్ని మార్చలేనట్లయితే, ప్రతి పాఠశాలలో ఉదయం ఇలా ప్రార్థన చేయవలసిందిగా మన విద్యార్థులను కోరదాం. ఆలయ దేవుడు సమానత్వం తేనట్లయితే, పాఠశాల దేవుడు దేశంలో సమానత్వాన్ని తెచ్చేలా చేద్దాం.
దేవుడా మమ్మల్ని సమానులుగా సృష్టించావు
దేవుడా స్త్రీపురుషులను సమానులుగా సృష్టించావు
దేవుడా మాలో కులాలు లేకుండా సృష్టించావు
దేవుడా మామధ్య అంటరానితనం లేకుండా చేశావు
దేవుడా పనిచేసి జీవించమని మా అందరికీ చెప్పావు
దేవుడా మా తల్లిదండ్రులను గౌరవించమని చెప్పావు
దేవుడా గర్విస్తున్న భారతీయులుగా మేం నిన్ను ప్రార్థిస్తున్నాం
దేవుడా భారతీయులందరినీ సమానులుగా సృష్టించావు
వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్
సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment