శతాబ్దిన్నర క్రితం నాటి వలస పాలకుల చట్టమది. ఇవాళ అన్ని రకాలుగా కాలం చెల్లిన శాసనమది. అయినా సరే ఏలినవారి చేతిలో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే బలమైన ఆయుధంగా మిగిలింది. నిరసన తెలిపే రైతుల మొదలు విమర్శించే విలేఖరుల దాకా ప్రతి ఒక్కరినీ పాలకుల దృష్టిలో రాజద్రోహుల్ని చేసింది. ప్రభుత్వ సమీక్ష సాగే వరకు ఆ చట్టం అమలును నిలిపి వేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారమిచ్చిన ఆదేశం చరిత్రాత్మకమైనది.
వేధింపులకూ, రాజకీయ కక్ష సాధింపులకూ సాధనంగా మారిన భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ‘సెక్షన్ 124ఎ’ను సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనలపై ప్రజాస్వామ్యవాదులకు ఈ తీపి కబురు వచ్చింది. ఈ ఒక్క మాటతో చట్టాల దుర్వినియోగం సంపూర్ణంగా మారకపోయినా, కనీసం ఒక ముందడుగు. ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వ సమీక్ష ప్రక్రియ కోసం వేచిచూడాలి.
ఒక చట్టంగా ఏదీ చెడ్డది కాకపోవచ్చు. కానీ, దుర్వినియోగంతోనే సమస్యంతా! రాజద్రోహ చట్టంలోనూ అదే జరిగింది. ఆ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చి, వారం తిరగకుండానే సరైన వేదికపై చట్టాన్ని సమీక్షిస్తామని మాట మార్చే ఏలికలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థల చొరవే సామాన్యులకు శ్రీరామరక్ష. రాజద్రోహ చట్టం కింద 2014 –19 మధ్య అయిదేళ్ళ కాలంలో దేశంలో మొత్తం 326 కేసులు దాఖలయ్యాయని హోమ్ శాఖే చెబుతోంది.
వాటిలో అత్యధికంగా 54 కేసులు అస్సామ్ లోవే. అయితే, నమోదైన ఆ కేసుల్లో సగాని కన్నా తక్కువగా కేవలం 141 కేసుల్లోనే ఛార్జ్‌షీట్లు ఫైలయ్యాయి. తీరా ఆరుగురంటే ఆరుగురే దోషులుగా తేలారట. దీన్నిబట్టి పెడుతున్న కేసులకూ, దోషులకూ పొంతన లేదన్న మాట. ఇప్పటికీ ఏటా 90 శాతానికి పైగా కేసులు పెండింగ్‌లోనే.
చరిత్ర చూస్తే, ఐపీసీ ముసాయిదాను రూపొందిస్తున్నప్పుడే బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే రాజద్రోహ చట్టాన్ని అందులో చేర్చారు. అయితే, 1860లో అమలులోకి వచ్చిన శిక్షాస్మృతిలో పొర పాటున ఈ చట్టాన్ని చేర్చలేదు. తర్వాత 1890లో ప్రత్యేక చట్టం 17 ద్వారా ఐపీసీలో 124ఎ సెక్షన్ కింద నేరంగా రాజద్రోహాన్ని చేర్చారు. అప్పట్లో ద్వీపాంతరవాస శిక్ష విధించేవారు.
అటుపైన 1955లో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ అసమ్మతిని సహించలేని బ్రిటిష్ పాలకులు తిలక్, అనీబిసెంట్, మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధులపై ఈ శాసనాన్నే ప్రయోగించిన తీరు ఓ పెద్ద కథ.
స్వాతంత్య్రం వచ్చాక రెండు హైకోర్టులు ఐపీసీ ‘సెక్షన్ 124ఎ’ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కానీ, 1962 నాటి ప్రసిద్ధ కేదార్‌నాథ్ కేసులో అయిదుగురు జడ్జీల సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆ హైకోర్టు తీర్పుల్ని కొట్టేసి, ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదేనని పేర్కొంది. హింసకు ప్రేరేపించనంత వరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినా సరే అది రాజద్రోహం కాదంటూ మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, ఆ తర్వాతా గత 60 ఏళ్ళలో విచ్చలవిడిగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉండడం సిగ్గుచేటు.
ఒక్క 2019లోనే రాజద్రోహం కేసులు 25 శాతం, అరెస్టులు 41 శాతం పెరిగాయి. అలా ఉద్యమ నేతలు హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి, బీమా కొరేగావ్ కేసు నిందితుల మొదలు తాజా మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా – ఆమె భర్త దాకా పలువురు ఇప్పుడు రాజద్రోహులు. ప్రత్యర్థుల నోరు నొక్కడానికి కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఈ చట్టాన్ని వాటంగా చేసుకున్నాయని విమర్శలు వస్తున్నది అందుకే. 1950ల నుంచి నేటి దాకా పార్టీలకు అతీతంగా ఈ పాపంలో అందరిదీ భాగం ఉంది. భారత లా కమిషన్, సుప్రీం కోర్ట్ ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించాయి. చట్టాన్ని రద్దు చేయడమే సబబన్నాయి.
దేశ సమైక్యత, సమగ్రతకు పాకిస్తాన్, చైనా సహా అనేక ప్రమాదాలు పొరుగునే పొంచి ఉన్నవేళ, తీవ్రవాదాన్నీ, అసాంఘిక శక్తుల్నీ అణచివేయడానికి కఠిన చట్టాలు అవసరమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనో, మరొకటనో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఆ చట్టాలను దుర్వినియోగం చేయడంతోనే చిక్కు. ప్రాథమిక హక్కులైన వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు మినహాయింపుగా రాజద్రోహాన్ని పెట్టాలనే చర్చ రాజ్యాంగ రచన రోజుల్లోనే వచ్చింది.
భారత రాజ్యాంగ షరిషత్‌లోని పలువురు సభ్యులు దానితో విభేదించి, ఆ మాటను చేర్చనివ్వక స్వేచ్ఛను కాపాడారు. అయితే, ఇవాళ చట్టమంటూ ఉన్నాక అరుదుగానో, తరచుగానో దుర్వినియోగం కాక తప్పని దుఃస్థితిలో పడ్డాం. అందువల్లే రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే వాదనలో బలం ఉంది.
సమీక్షిస్తామనడం మంచిదే కానీ, దానికి ఏళ్ళూపూళ్ళూ కాలయాపన చేస్తేనే కష్టం. కొత్త పేరు, కొత్త రూపంలో పాత చట్టం తెస్తే, కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పటికే లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్ సాక్షిగా రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం విజ్ఞత. ఇంకా చెప్పాలంటే, విమర్శకులను వేధించడానికి సాధనాలవుతున్న ‘ఉపా’ లాంటి అనేక స్వాతంత్య్రానంతర కర్కశ చట్టాలపైనా ఆ ఉదార సమీక్ష నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది.
మారిన కాలానికి తగ్గట్టుగా శిక్షాస్మృతిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్త స్మృతిని పార్లమెంట్ ఆమోదంతో తేవాలని నిపుణుల మాట. ఎనిమిదేళ్ళలో 1500కి పైగా పాత చట్టాలను రద్దు చేశామని జబ్బలు చరుస్తున్న పాలకులు ఇంతటి విప్లవానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా? ఎంతసేపటికీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయలేదనే కన్నా, ఇప్పుడు తాము చేసిచూపడంలోనే చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే అమృత కాలం గడిచిపోయింది.
అవును... కొనసాగిస్తే ద్రోహమే!
Published Thu, May 12 2022 12:17 AM | Last Updated on Thu, May 12 2022 12:17 AM
Comments
Please login to add a commentAdd a comment