రాజ్యాంగం మన జీవనాడి | Rajnath counters 'intolerance', says Cong misused secularism | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం మన జీవనాడి

Published Fri, Nov 27 2015 2:46 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM

రాజ్యాంగం మన జీవనాడి - Sakshi

రాజ్యాంగం మన జీవనాడి

* వాడివేడి చర్చతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు షురూ
* ‘లౌకికవాదం’ పదం చాలా దుర్వినియోగమవుతోంది: రాజ్‌నాథ్
* లౌకికవాదం అంటే.. ‘ధర్మ నిరపేక్షత’ కాదు.. ‘పంత్ నిరపేక్షత’

* రాజ్యాంగంలోని నియమాలపై దాడి జరుగుతోంది: సోనియా
* విమర్శ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం: లోక్‌సభ స్పీకర్
* అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో చర్చ
న్యూఢిల్లీ: ‘భారత రాజ్యాంగానికి నిబద్ధత’ అనే అంశంపై చర్చతో అధికార, విపక్షాల మధ్య పరస్పర విమర్శలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి.

రాజ్యాంగ పీఠికలోని ‘లౌకికవాదమ’నే పదం చాలా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వమంటే, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని విపక్షాలు ‘అసహనం’ అంశాన్ని లేవనెత్తాయి. స్పీకర్ సహా అధికార, విపక్ష సభ్యులందరూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కొనియాడారు. తొలి రోజు ప్రారంభంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం కనిపించింది.

ప్రధాని మోదీ సభలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, ఆర్‌జేడీ నేత జైప్రకాష్‌ల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ అభివాదం చేశారు. ఆ సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ సభలో లేరు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై మురళీమనోహర్ జోషి, మరో ఇద్దరు సీనియర్ నేతలతో కలిసి పార్టీ నాయకత్వం మీద ధ్వజమెత్తిన కురువృద్ధుడు అద్వానీకి మోదీ అభివాదం చేశారు.

విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా, మంత్రి వెంకయ్య, మరి కొందరు బీజేపీ నేతలు ప్రతిపక్షాల స్థానాలకు వెళ్లి అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. జైట్లీ ప్రతిపక్షాల స్థానం వద్దకు వెళ్లి ఆజాద్, శరద్‌యాదవ్, ఏచూరి, మాయావతి సహా విపక్ష నేతలందరినీ పలుకరించారు.
 
రోజంతా సభలోనే మోదీ: చర్చ సందర్భంగా మోదీ గురువారం రోజంతా సభా కార్యక్రమాలు సాగినంత సేపూ సభలోనే కూర్చోవటం విశేషం. సభ్యులు మాట్లాడుతున్నపుడు వింటూ, నోట్స్ రాసుకున్నారు. ఉదయం 11కు మొదలైన సమావేశం గంట భోజన విరామం తర్వాత రాత్రి 7:15 వరకూ కొనసాగింది. మోదీ రోజంతా సభలో ఉండి రికార్డు సృష్టించారంటూ ఖర్గే వ్యాఖ్యానించి సభ్యులను నవ్వించారు.
 
‘లౌకికవాదం’ చాలా దుర్వినియోగమవుతోంది
‘‘రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.  ఈ రెండు పదాలూ రాజ్యంగంలో భాగమైనందున.. వాటిని పీఠికలో చేర్చాల్సిన అవసరముంటుందని బి.ఆర్.అంబేడ్కర్ ఎన్నడూ ఆలోచించలేదు.
* సెక్యులరిజం (లౌకికవాదం) అనే పదానికి హిందీలో ‘ధర్మ నిరపేక్షత’ అనే పదాన్ని వినియోగించటం సరికాదు. సెక్యులరిజం పదానికి ‘పంత్ నిరపేక్షత’ (హిందీలో పంత్ అంటే మతం లేదా మతవర్గం) అనేది వాస్తవ అనువాదం. ఇది హిందీ అధికారిక అనువాదమైనందున ఈ పదాన్ని వినియోగించాలి.
* ‘లౌకికవాదం’ అనేది దేశంలో అత్యంత అధికంగా దుర్వినియోగం చేసిన పదం. పదాన్ని అతిగా దుర్వినియోగం చేయటం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న ఉదంతాలు ఉన్నాయి.
* రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేశారు. కోటా అనేది రాజ్యాంగంలో భాగం. ఈ అంశంపై ఇక చర్చకు ఆస్కారమే లేదు.  
* సీత విషయమై ఎవరో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తినపుడు ఆమెను ‘అగ్ని పరీక్ష’ ఎదుర్కోమన్న  రాముడు  గొప్ప ప్రజాస్వామ్యవాది.
* అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు, వివక్షకు గురైనా కూడా.. ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదు. (అమీర్‌ఖాన్ అసహనం విషయమై మాట్లాడుతూ తన భార్య దేశం విడిచి వెళదామా అన్నారన్న వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ పరోక్షంగా విమర్శించారు.) ముస్లింలలోని 72 తెగలన్నీ నివసించే దేశం, జోరాస్ట్రియన్, యూదు తెగలు నివసించే దేశం భారతదేశం.
* అంబేడ్కర్ తత్వశాస్త్రంతో, రాజ్యాంగంతో మోదీ స్ఫూర్తి పొందారు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బఢావో - బేటీ పఢావో వంటి పథకాలను ప్రారంభించారు.
 
చర్చలకు సభా వేదిక కన్నా పెద్దది ఏదీ ఉండదు
‘‘ఈ సమావేశాల్లో ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ చర్చ, ఉత్తమ వినూత్న భావనలు వస్తాయని విశ్వసిస్తున్నా. చర్చలకు సభా వేదిక కన్నా మరొక పెద్ద వేదిక ఏదీ ఉండదు. ’’ అని ప్రధాని మోదీ విలేకరులతో పేర్కొన్నారు. ఆయన గురువారం పార్లమెంటు భవనం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ..  సమావేశాలు సజావుగా సాగే విషయమై బుధవారం అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ తాను మాట్లాడినట్లు చెప్పారు.

‘‘రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మా లక్ష్యం. రాజ్యాంగం ఒక ఆశాకిరణం. అది మన మార్గదర్శి’’ అని తెలిపారు. ‘‘ఆశ(హోప్) అంటే సామరస్యం, అవకాశం, ప్రజాభాగస్వామ్యం, సమానత్వం అని’’ ఆయన అన్నారు. రాజ్యాంగం రూపకల్పనపై పార్లమెంటు గ్రంధాలయ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శనను మోదీ సందర్శించారు.
 
ఆదర్శాలు, విలువలను పాటిద్దాం: ‘‘చరిత్రాత్మకమైన తొలి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మీకు స్ఫూర్తినివ్వాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వటం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళలు, పురుషులు అందరికీ ఈ దినోత్సవం ఒక నివాళి.

మనమంతా రాజ్యాంగపు ఆదర్శాలు, విలువలను పాటిద్దాం.. దేశ నిర్మాతలు గర్వించే భారతదేశాన్ని తయారు చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన అపూర్వ కృషిని గుర్తు చేసుకోకుండా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవటం అసంపూర్తిగానే ఉంటుంది. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా’’ అని మోదీ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
 
వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనుల్లంఘనీయం
‘‘రాజ్యాంగంలో పరిపాలనా ప్రణాళికకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే మూడు సూత్రాలు కేంద్రంగా ఉండే స్వేచ్ఛాయుత రాజకీయాలు భారతదేశానివి.
* వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనేవి ఉమ్మడి మేలు లాగానే అనుల్లంఘనీయం.
* ప్రతి వ్యక్తికీ విశ్వాసం, మతం, ఆరాధన హక్కును రాజ్యాంగం హామీ ఇస్తోంది.
* ప్రజాస్వామ్య పరిపాలనలో ఏకాభిప్రాయ నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశం. అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరస్పరం చర్చిస్తూ, కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
* రాజ్యాంగంలోని రాజ్య విధానానికి సంబంధించిన ఆదేశక సూత్రాలు.. న్యాయబద్ధమైన సామాజిక క్రమాన్ని నిలబెట్టి, కాపాడాలని చెప్తున్నాయి.
* ప్రజాస్వామ్యానికి మౌలిక పునాదులుగా బలమైన సంస్థలను రాజ్యాంగం అందిస్తోంది. రాజ్యపు మూడు అంగాలు - శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు - సామరస్యంగా పనిచేయాలి.
* కీర్తిప్రతిష్టలతో విశ్రమించే సమయం కాదిది. అభివృద్ధికి సంబంధించి మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఇన్నేళ్లలో బలమైన సంస్థాగత, ప్రభుత్వ నిర్మాణాలను మనం అభివృద్ధి చేసుకున్నాం. విద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల భద్రత వంటి ఎంతో కీలకమైన రంగాల్లో మన లక్ష్యాలను సాధించుకోవటానికి మరింత కష్టపడి పనిచేయాల్సిన సమయమిది.’’
 
రాజ్యాంగ ఆదర్శాలపై దాడి జరుగుతోంది
‘‘రాజ్యాంగంలోని ఆదర్శాలు, నియమాలు ప్రమాదంలో పడ్డాయి. వాటిపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న ఉదంతాలు.. రాజ్యాంగ మూలసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి.
* ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ.. దానిని అమలు చేసే వారు చెడ్డవారు అయితే.. తుది ప్రభావం చెడ్డగానే ఉంటుంది’ అని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు.
* రాజ్యాంగంపై ఎన్నడూ విశ్వాసం లేని వారు, రాజ్యాంగ రచనలో పాలుపంచుకోని వారు.. ఇప్పుడు దానిపై ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు దానికి నిబద్ధతపై చర్చ జరుపుతున్నారు. ఇంతకు మించిన పెద్ద జోక్ ఇంకేదీ ఉండదు.
* రాజ్యాంగం సరళమైనదని నిరూపితమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానికి వందకు పైగా సవరణలు జరిగాయి.
* అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో రాజకీయ సిద్ధాంతం, ఆర్థికశాస్త్రాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగివచ్చి, షెడ్యూల్డు కులాలు, అణగారిన వర్గాల వారి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న అంబేడ్కర్ అసమాన ప్రతిభను, శక్తిసామర్థ్యాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.
* ‘నన్ను చైర్మన్‌గా ఎంపిక చేయటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీలో నా కన్నా విద్యావంతులు, ఉత్తములైన వారు ఉన్నారు’ అని అంబేడ్కర్ అప్పుడు చెప్పారు.
* 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించినప్పుడు.. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేడ్కర్ కన్నా ఉత్తమ సారథి మరొకరు ఉండబోరని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కితాబునిచ్చారు.
* రాజ్యాంగం చరిత్ర చాలా పురాతనమైనది. 1931 మార్చిలో నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరాచీ సదస్సులో ప్రాధమిక హక్కులు, ఆర్థిక హక్కులపై తీర్మానం చేసింది.’’
 
సామ్యవాద, లౌకిక పదాలు లేకుండానే...
న్యూఢిల్లీ: రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం ఆప్ ప్రభుత్వం ఇంగ్లిష్ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సామ్యవాద, లౌకిక పదాలు ప్రచురితం కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటుకు ఆప్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించి, 4 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా సమాచార, ప్రచార శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. జరిగిన పొరపాటుకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విచారం వ్యక్తం చేశారు.
 
‘భారతీయ భాషలకు అధికార హోదా’
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు, తమిళం సహా భారతీయ భాషలన్నింటికీ అధికార భాష హోదా కల్పించాలని లోక్‌సభ ఉపసభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువా రం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషలను అధికార భాషలుగా గుర్తిస్తూరాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకురారు? నేను తమిళంలో పార్లమెంటులో మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి? మా సొంత భాషలో మాట్లాడుకునే హక్కు మాకుంది. అని అన్నారు.
 
భారత ఆత్మకు ప్రతిబింబం

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్... రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నేడు ప్రపంచం భారత్ వైపు, భారత విలువలవైపు చూస్తోందంటే అందుకు మన రాజ్యాంగమే ప్రధాన కారణం. ఇప్పటి దాకా వందసార్లు సవరణలు జరిగినా.. ప్రాథమిక కూర్పునకు ఎక్కడా భంగం వాటిల్లకపోవటమే మన రాజ్యాంగం ప్రత్యేకత. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం కూర్పు, రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను గమనిస్తే..
* 1930ల నుంచే సొంత రాజ్యాంగం కోసం కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది.
* ఎన్నో తర్జన భర్జనలు, గొడవల తర్వాత 1946లో వైస్రాయ్ లార్డ్ వావెల్ ఇందుకు అంగీకరించారు.
* రాజ్యాంగ రచనకు 1946 నుంచి 1949 మధ్య రెండు సంవత్సరాల 11నెలల 18 రోజుల సమయం పట్టింది.
* రాజ్యాంగ పరిషత్తులో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. 9 మంది మహిళలు ఇందులో ఉన్నారు. 24 మంది అమెరికన్లు కూడా రాజ్యాంగ చర్చలో ఏడ్రోజుల పాటు పాల్గొన్నారు.
* రాజ్యాంగ రచన సమయంలోనే దేశంలో మతఘర్షణలు, కులపోరాటాలు చోటుచేసుకున్నాయి.
* దీంతో ప్రాథమిక విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతత్వాలను రాజ్యాంగంలో చేర్చారు.
* రాజ్యాంగ నిజప్రతిని ప్రఖ్యాత లేఖకుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ చేత్తో రాశా రు. ఇందుకు ఆయనకు ఆరు నెలలు పట్టింది. ఇందుకు ఒక్క పైసా తీసుకోలేదు.
* వివిధ భాషల్లో రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినా.. రాజ్యాంగాన్ని మాత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాశారు.
* ఇప్పటికీ రాజ్యాంగం నిజప్రతులు పార్లమెంటు లైబ్రరీలోని హీలియం చాంబర్స్‌లో భద్రంగా ఉన్నాయి.
* ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు విధులు, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వ సమాఖ్య, యూకే నుంచి ప్రధాన మంత్రి, కేబినెట్, పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నారు.
* 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ ఆమోదించింది.
* 1950, జనవరి 26 రాజ్యాంగ అమలు ప్రారంభం కావటంతో.. గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించింది.
* 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
* దీనికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు రాజ్యాంగ పరిషత్ 166సార్లు సమావేశమైంది.
* ఇందులో 144 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే చర్చ జరిగింది.
* చర్చ సందర్భంగా ప్రతిపాదించిన 7,635 సవరణల్లో 2,473 సవరణలను తిరస్కరించారు.
* ప్రపంచంలోనే అతిపెద్దదైన మన రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 5 అనుబంధాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement