శీతాకాల సమావేశాలకు తెర
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
18 బిల్లులకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: గత నెల 24 నుంచి నెలరోజులు జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. పలు సమస్యలపై విపక్షం ఆందోళనతో గందరగోళం నెలకొన్నా, ఉభయ సభలూ పలు బిల్లులను ఆమోదించగలిగాయి. అయితే, బీమా, బొగ్గు గనుల కేటాయింపులు సహా కీలకమైన సంస్కరణలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండగానే ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
లోక్‌సభ రికార్డ్ స్థాయిలో 18 బిల్లులకు ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల కే టాయింపు, కార్మిక చట్టాల సవరణ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. లోక్‌సభలో అంతరాయాలు, వాయిదా కారణంగా మొత్తం మూడుగంటల వ్యవధి వృథా అయింది. రాజ్యసభ 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. మతమార్పిడులపై ఆందోళన సహా, వివిధ అంశాలపై విపక్షం ఆందోళనతో 62 గంటల సభా సమయం వృథా అయింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ పేరు మార్పు, నల్లధనం తదితర అంశాలపై విపక్ష సభ్యుల ఆందోళనతో ఎక్కువ సార్లు సభ సాగలేదు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేందుకు వీలు కలిగించే బిల్లుకు అంతరాయాల వల్లనే ఆమోదం లభించలేదు. బొగ్గు క్షేత్రాల తాజా వేలానికి వీలుకలిగించే బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లును డిసెంబర్ 12నే లోక్‌సభ ఆమోదించినా, రాజ్యసభనుంచి ఆమోదం లభించలేదు. నల్లధనాన్ని వెనక్కి రప్పించేం దుకు ఉద్దేశించిన బిల్లును, కాలదోషం పట్టిన 90 చట్టాల రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీల పరిశీలనకు రాజ్యసభ సిఫార్సు చేసింది.
విపక్షాల తీరు దురదృష్టకరం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో విపక్షాల తీరు దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉభయసభల వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటు పనిచేసేలా చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు.