
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది.
ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా?
గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్‌ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు.
గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది.
నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్‌తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు.
ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్‌కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది.
ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్‌కు హక్కు లేదు.
కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్‌లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి?
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment