ఆధునిక రాజకీయవ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే స్ఫూర్తి కావాలని నినదించిన మహోన్నత రాజ్యాంగం మనది. ప్రజా స్వామ్యం కేవలం రాజ కీయ పాలనా పద్ధతి మాత్రమే కాదు, సంపదలో సమాన పంపిణీ ఆవశ్యక తను చర్చించిన భావనగా రాజ్యాంగ రచనా సంఘం ఆవిష్కరించింది. అందుకు భారతీయ బౌద్ధం నుంచి ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని నిపుణులు వెలికి తీశారు. ఉత్పత్తి కులాల అణచివేతకు కారణాలను ఆనాడే గుర్తించారు. వీటిని అధిగమించాలంటే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థే దివ్యఔషధమనే ప్రతిపాదన ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య మూలాలున్న బౌద్ధం భారతీయుల వారసత్వ సంపదగా ప్రశంసలం దుకుంది. దీనిలో అభిప్రాయాల పరస్పర మార్పిడి, చర్చావిధానం రాజ్యాంగసభను సమ్మో హనపరిచాయని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడుతూ అన్నారు.
ప్రజాస్వామ్య మన్నికకు వర్గరహిత సమాజం ఎంతో అవసరమని అంబేడ్కర్ పేర్కొన్నారు. అలాగే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు అవకాశం వుండాలన్నారు. ప్రభుత్వం గరిష్ఠ సామాజిక జీవనం ప్రాతిపదికగా బాధ్యత తీసుకోవాలి. సమాజం ప్రజాస్వామ్య బద్ధంగా లేనప్పుడు, ప్రభుత్వం కూడా అలా ఉండ టానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఉద్యోగుల మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆ ఉద్యోగులు వచ్చిన సామాజిక నేపథ్యం అప్రజాస్వామిక లక్షణాలు కలిగివుంటే ప్రభుత్వం కూడా అప్రజా స్వామికంగా మారిపోతుంది. ఈ సందర్భంలోనే ‘ప్రభుత్వం’ అనే పదాన్ని అంబేడ్కర్ నిర్వచించారు.
ప్రభుత్వం అంటే మంచి చట్టాలు, మంచి పరిపాలన. ముఖ్యమైన విధులు న్యాయవ్యవస్థ చేతికి చేరాలి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు నిర్లక్ష్యానికి గురికాకూడదు. దీనిని విస్మ రించి పాలకులు తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తే, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కుంటువడుతుంది. తోటి మనిషి మీద గౌరవం, సమభావం కలిగి ఉన్నప్పుడే నిజమైన సమాజం ఏర్పడుతుందని, అదే పరిపూర్ణ ప్రజా స్వామ్యానికి పునాది కాగలుతుందనే విషయాన్ని తేటతెల్లం చేశారు. ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని, దీని కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. లేకుంటే భారత సమాజం పాలక వర్గం, పాలిత వర్గంగా విభజన చెంది, వ్యక్తి శ్రేయస్సుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రధానంగా రెండు విషయాలు మూలస్తంభాలుగా నిలవాలనేది రాజ్యాంగ నిర్దేశం. అవి ఒకటి సమర్ధ మైన పాత్ర పోషించగల ప్రతిపక్షం, రెండు నిజాయితీతో కూడిన ఎన్నికల నిర్వహణ. అప్పుడే అధికారమార్పిడి ప్రక్రియ సులభతరంగా జరుగు తుంది. ఈ వ్యవస్థ ద్వారానే అణగారిన ప్రజానీకం విముక్తి సుసాధ్యమవుతుంది. పరిపూర్ణ ప్రజా స్వామ్య మనుగడకు అడ్డంకిగా ఎన్ని అవరోధాలు ఎదురయినా జనబాహుళ్యం కలిగిన భారత దేశా నికి ప్రజాస్వామ్యమే శరణ్యంగా నిలిచింది. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలు చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లితేనే దాని ఫలాలు ప్రజల అను భవంలోకి వస్తాయని అంబేడ్కర్ అన్నారు. ప్రజా స్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరు గారిపోతాయన్న ఆయన హెచ్చరికలు ఎప్పటికీ సజీవసత్యాలుగా నిలుస్తాయి.
-డాక్టర్ జి.కె.డి.ప్రసాద్
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment