1949 నవంబర్ 26వ తేదీన, రాజ్యాంగ సభలో భారత ప్రజలు తమకి తాము రాజ్యాంగాన్ని సమర్పించుకున్నారని చరిత్ర చెపుతుంది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు 284 మంది రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. ఆ సమయంలో వానజల్లులు పడుతూ ఉండడం శుభ శకునంగా భావించారట. శాస్త్రీయ దృష్టి కోణం, స్వేచ్ఛ, సమానత్వాల ఆకాంక్షలతో రాసుకున్నది రాజ్యాంగం. ఆ ప్రయత్నపు ఆమోద సమయంలో ఇటు వంటి వ్యక్తీకరణ కాస్త వింతగానే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగ రచనా ప్రస్థానం మొత్తం చూస్తే పై విలువలు రాజ్యాంగంలో పాదుకొల్పడానికి ఒంటి చేత్తో పోరాటం చేస్తూ, నిప్పులవాగులో నిరంతరం ఎదురీదిన అంబేడ్కర్ గుర్తుకు వస్తే ఆ చిరుజల్లులు కురవాల్సినవే అనిపిస్తుంది.
ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగం ఇపుడు తరుచూ మాట్లాడుకునే అవసరం అయింది. ముఖ్యంగా పీడిత వర్గాలు తమ హృదయాలలో వెలిగించు కున్న ఆశాదీపం అయింది. తమ తమ మతగ్రంథాల కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. భారత రాజ్యాంగం చుట్టూ దాని ఆచరణలో విరోధాభాస కొంత ఉంది. నిజంగా రాజ్యాంగపు రక్షణ తప్పనిసరిగా కావాల్సిన వర్గాల వారు ఆ స్ఫూర్తిని ప్రకటించడం మొదలు పెట్టగానే ఆధిపత్య వర్గాలు, ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతాయి.
రాజ్యాంగం శ్రమజీవులను విముక్తి చేయగలదా అన్న ప్రశ్నకి జవాబు అంత సులువు కాదు. రాజ్యాంగం ద్వారా సాధించుకోవలసిన విలువలను గుర్తిస్తూనే ఆచరణలో ఆ విలువలను నిలబెట్టలేని పరిమితులు కూడా రాజ్యాంగంలో ఉన్నాయన్నది గ్రహించాలి. ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన శక్తిమంతమైన ఆయుధం ‘ఓటు’ అనుకుంటాము కదా! తమని తాము పరిపాలించుకోవడానికి తమని తామే ఎన్నుకునే వ్యవస్థ మనది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలు తమ సంక్షేమానికి పాటుపడే పార్టీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నుకుంటారు. మరి ఆచరణలో ఇంత సింపుల్‌గా జరుతున్నదా?
కొన్నేళ్ళ కిందట ‘న్యూటన్’ అని ఒక సినిమా వచ్చింది. ఎన్నికలు ఎంత ఫార్స్‌గా మారిపోయాయో మనసుకు హత్తుకునేట్లు చెప్పడం కోసం త్రిముఖ నేపథ్యాన్ని తీసుకున్నారు. ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ సాధనాలతో పోరాడే మావోయిస్టులు, ఎన్నికలని నిజాయితీగా జరిపించాలనుకునే పోలింగ్ బూత్ అధికారి, ఓటు అంటే తెలియని అమాయకపు ఆదివాసీలు – ఈ ముప్పేట కథనంతో భారత ప్రజాస్వామ్యపు లొసుగులను కళ్ళకి కట్టినట్లు చూపించారు.
రాజ్యాంగంలో తాము ఏమి హక్కులు పొందు పరుచుకున్నారో తెలియని ప్రజలు కోట్లాది మంది. ఓటుని హక్కుగా ప్రజలకి ఇవ్వగలిగిన రాజ్యాంగం, ఇన్నేళ్లలో ఆ ఓటు చుట్టూ ఉన్న దట్టమైన డబ్బు అల్లికని తెంపలేకపోయింది. అనేక మౌలిక హక్కు లను ప్రకటించిన రాజ్యాంగం దొంతర్లుగా పేరుకు పోయిన అంతరాలను తగ్గించలేకపోయింది.
అలాగని ఇప్పటికిపుడు దేశవ్యాప్తంగా అందరినీ సమానత్వపు తాటిమీదకి తెచ్చే పూర్తి భరోసాని ఏ రాజ కీయాలూ ఇవ్వలేకపోతున్నాయి. కులం, మతం, వర్గం, జెండర్ తదితర అంశాలలోని ఆధిపత్య శక్తులని అదుపు చేయగలిగే తక్షణ రక్షణ కవచంగా రాజ్యాంగం మాత్రమే కనిపిస్తోంది. సూక్ష్మస్థాయి సంగతి సరే, స్థూలంగానైనా మేళ్ళు జరగాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపా డుకోవడానికి పోరాటం చేయక తప్పదు. రాజ్యాంగాన్ని అక్కున చేర్చుకోక తప్పదు.
గత పదేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలు అపరిమితంగా పెరిగిపోయాయి. తినడానికి ఒక ముద్ద తక్కువైనా ఓర్చుకోగలిగే మనుషులు, తమ విశ్వాసాల పట్ల నిక్క చ్చిగా స్వాభిమానంతో ఉంటారు. భిన్నమతాలకి నిలయమైన ఇండియాలో మైనార్టీలకి హక్కులకి రక్షణ ఉండాలని, మతాల మధ్య చిచ్చు రేగకూడదనే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది రాజ్యాంగం.
దాని ప్రకారం భారత ప్రజలు మతస్వేచ్ఛని కలిగి ఉంటారు. ప్రజలని పరిపాలించే ప్రభుత్వాలు మాత్రం మతాతీతంగా పరిపాలన చేయాలి. కానీ మనుషులు పౌరులుగా కాక ఓటుబాంకులుగా కనపడడం మొదలయ్యాక మత సామ రస్యం కాలం చెల్లిన విలువ అయిపోయింది. ఇక మెజారిటీ మత రాజ్యస్థాపన లక్ష్యంగా కలిగిన పార్టీలు పరిపాల నలోకి రావడం వల్ల రాజ్యాంగస్ఫూర్తి మరింత క్షీణించింది.
మన వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలకి రాజ్యాంగం విలువ ఇచ్చినట్లే, మనమే రాసుకున్న రాజ్యాంగం పట్ల మనందరికీ అవగాహన ఏర్పడడం చాలా అవసరం. పౌరులుగా ఎలా మెలగాలన్న రాజకీయ స్పృహని మౌలి కంగా రాజ్యాంగం ఇస్తుంది. రాజకీయాలంటే అయిదేళ్ళ కోసారి వచ్చే ఎన్నికలు, కుల, మత, వర్గ గోదాల్లో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల బెట్టింగ్ కాదనీ, అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేయగల చైతన్యమనీ తెలుపుతుంది.
ఈ రాజకీయ స్పృహ కలిగిననాడు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల ఆలోచన కూడా మొదలవుతుంది. రాజ్యాంగం ఇపుడు మన తక్షణావసరం అన్నామంటే అది బేషరతు కానక్కర్లేదు. రాజ్యాంగ విలువలని కాపాడు కోవడానికి కృషి చేస్తూనే, ఆధిపత్య వర్గాలకి అనువుగా మారే పరిమితులను కూడా గుర్తించాలి. దృఢ అదృఢ లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగానికి ఎపుడైనా సవరణ జరిగితే పీడిత ప్రజల ఆకాంక్షలు అందులో ప్రతిఫలించేట్లు జాగరూకులమై ఉండాలి.
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే
malleswari.kn2008@gmail.com
(నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం)
రాజ్యాంగ పఠనం మన తక్షణావసరం
Published Fri, Nov 24 2023 3:59 AM | Last Updated on Fri, Nov 24 2023 3:59 AM
Comments
Please login to add a commentAdd a comment