భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు.
అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది.
బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు.
ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు.
అభివృద్ధిని తరచిచూస్తే...
దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది.
అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు.
ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది.
ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు?
ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు.
అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment