
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది.
ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్‌లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment