సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2021 – 22)నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులన్నిటిలో ఆంగ్ల మాధ్యమమే అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో ఉన్నత విద్యామండలి ఇందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. ఇంజనీరింగ్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహిస్తుండగా నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మాత్రం పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమం అమలులో లేదు. ఇంగ్లీషు మాధ్యమంలో డిగ్రీ పూర్తిచేసిన వారితో పోలిస్తే తెలుగు మాధ్యమంలో చదివిన వారు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు.
ఫలితంగా డిగ్రీ చదివినా నిరుద్యోగులుగా లేదంటే చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది. పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. టెన్త్, ఇంటర్ తెలుగు మీడియంలో చదివిన వారు సైతం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.
2020–21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా ఆన్‌లైన్‌లో చేపట్టిన డిగ్రీ ప్రవేశాల్లో ఈ అంశం తేటతెల్లమైంది. 80 శాతానికి పైగా విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీలో చేరారు. గతంతో పోలిస్తే ఆంగ్ల మాధ్యమంలో చేరికలు 20 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 4,24,937 సీట్లు ఉండగా ఈ ఏడాది 2,62,805 మంది విద్యార్థులు చేరారు. వీరిలో తెలుగు మీడియం వారు 65,989 మంది ఉండగా ఇంగ్లీషు మీడియంలో చేరిన విద్యార్థులు 1,96,816 మంది ఉన్నారు.
ద్విభాషా పాఠ్యపుస్తకాలు: ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అనే మూడు అంశాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఉంటుందని చెప్పారు.
డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూనే ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా డిగ్రీ కోర్సులలో ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తేనున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు.
ఒకే పాఠ్యాంశం ఒకవైపు ఆంగ్లంలో, రెండోవైపు తెలుగులో ఉండేలా ఈ పాఠ్యపుస్తకాలు ఉంటాయన్నారు. దీనివల్ల పాఠ్యాంశాలను ఆంగ్లంలో చాలా త్వరగా నేర్చుకోగలుగుతారని వివరించారు. ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తేనున్నందున డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సుల సిలబస్‌లో కూడా మార్పులు చేర్పులు చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment